శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 42
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
21. కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా (షోడశాక్షరీ)
22. తాటంకయుగళీభూత తపనోడుప మండలా (షోడశాక్షరీ)
ఇరవైరెండవ నామ మంత్రము - 
  ఓం తాటంకయుగళీభూత తపనోడుప మండలాయై నమః
సూర్య, చంద్ర మండలాలను తన చెవులకు ఆభరణాలుగా కలిగివున్న పరమేశ్వరి అయిన జగన్మాతకు నమస్కారము.
అమ్మవారి రెండు కన్నులు, సూర్య చంద్రులు. రెండు చెవుల ఆభరణములు, సూర్య చంద్రులు. కన్నులతో చూచినది చూసినట్లుగా చెప్తుంటే,  చెవులకు తాటంకములుగా వున్న సూర్య చంద్రులు విన్నది విన్నట్టుగా చెప్పడానికి కర్మసాక్షులుగా వున్నారు. ఈ విధంగా అమ్మను చూసిన వశిన్యాది వాగ్దేవతలు, "తాటంకయుగళీభూత తపనోడుప మండలా" అని శ్రీమన్మహారాజ్నిని కీర్తించారు.
అమ్మ ఒక చెవికమ్మ సూర్యమండలం అయితే, రెండవ చెవికమ్మ చంద్రమండలం. ఈ సూర్యచంద్రుల గమనం వలననే ఈ జగత్తులో పగలు, రాత్రి, సంధ్యా సమయాలు ఏర్పడుతున్నాయి. రోజులూ, పక్షాలు, నెలలూ, సంవత్సరాలు అనబడే కాలచక్రం కదులుతోంది. సూర్య చంద్రులు అమ్మ చెవి కమ్మలు గా వుండటం వలన, ఈ కాలచక్రం అమ్మ అధినంలోనే వుంది. అమ్మ వారి ఈ మహిమాన్వితమైన అనంత సౌభాగ్యం వలననే అయ్యవారు, పరమేశ్వరుడు కాలానికి వశుడు కాకుండా వున్నాడు.
ప్రయత్నంతో గానీ, మనసుతో గానీ మంత్రము నడిపే విధానమే జపము. ఏ ప్రయత్నమూ లేకుండా నడిచే మంత్ర విధానాన్ని "అజపా" విధానము అంటారు. ఈ "అజపా" విధానంలో మనం శ్వాస తీసున్నంత సులభంగా మంత్రం నడుస్తుంది. ఈ అప్రయత్నంగా జరిగే జపంలో "హంసస్సోహం" అని మంత్రం నడుస్తూ వుంటుంది. దీనినే "హంస గాయత్రి" అని అంటారు. అమ్మవారికి కన్నులు, చెవులుగా వున్న సూర్య చంద్రులు అన్ని జీవులలో ప్రాణస్వరూపాలుగా వుండి, తమ తత్వముతో ఇడా పింగళ నాడులలో వుండి అజపా గాయత్రి స్వరూపమై వున్నారు. పరమేశ్వరియే, "అజపా గాయత్రి" గా శోభిల్లుతోంది.
కాలగమన చక్రాన్ని తన అధీనంలో వుంచుకున్న పరమేశ్వరికి నమస్కరించేడప్పుడు 
ఓం తాటంకయుగళీభూత తపనోడుప మండలాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు
Popular posts