ఒక పచ్చని పల్లెటూరిలో సత్యం అనే రైతు నివసించేవాడు. అతని పేరుకు తగ్గట్టుగానే అతను ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు. ఆ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సత్యం ఇచ్చే సలహా కోసం ఎదురుచూసేవారు. దానికి ప్రధాన కారణం సత్యం ఆడే మాట తప్పని నైజం. అతను ఒకసారి నోటితో మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా ఆ మాటను నిలబెట్టుకుంటాడనే నమ్మకం అందరిలో ఉండేది. ఆ ఏడాది వరుణ దేవుడు కరుణించడంతో సత్యం పొలంలో పంట చాలా బాగా పండింది. పసిడి రంగులో మెరుస్తున్న వరి పంట్టను చూసి సత్యం ఎంతో మురిసిపోయాడు. పంట చేతికి వచ్చే సమయానికి పక్క గ్రామానికి చెందిన ఒక పెద్ద వ్యాపారి సత్యం వద్దకు వచ్చాడు.
ఆ వ్యాపారి సత్యం పొలాన్ని కలియతిరిగి చూసి "సత్యం, ఈసారి నీ పంట చాలా అద్భుతంగా పండింది. ఈ పంట మొత్తం నాకే అమ్ము. నీకు మంచి ధర ఇస్తాను" అని అడిగాడు. సత్యం కాసేపు ఆలోచించి "సరేనయ్యా, ఈసారి పంట మీకే ఇస్తాను" అని మాట ఇచ్చాడు. అయితే ఆ సమయంలో పంట ధర గురించి వారు ఖచ్చితంగా మాట్లాడుకోలేదు. "రేపు మా ఇంటికి రండి, కూర్చుని ధర గురించి వివరంగా మాట్లాడుకుందాం" అని చెప్పి పంపించాడు. మరుసటి రోజు ఉదయం సత్యం ఇంటికి మరో కొత్త వ్యాపారి వచ్చాడు. అతను పంటను చూసి మొదటి వ్యాపారి కంటే చాలా ఎక్కువ ధర ఇస్తానని ఆశ చూపాడు. ఆ ధర వినగానే సత్యం భార్య కళ్ళు మెరిశాయి.
ఆమె వెంటనే సత్యం దగ్గరకు వచ్చి "చూడండి, ఈ కొత్త వ్యాపారి చాలా ఎక్కువ ధర ఇస్తామంటున్నారు. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. పంటను ఇతనికే అమ్ముదాం" అని ఉత్సాహంగా చెప్పింది. సత్యం ఆమె మాటలు విని మౌనంగా ఉండిపోయాడు. బయట వేచి ఉన్న వ్యాపారిని చూసి "అయ్యా, క్షమించండి. నేను నిన్ననే పక్క ఊరి వ్యాపారికి మాట ఇచ్చాను. ధర నిర్ణయించకపోయినా పంట ఇస్తానని ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను మాట తప్పలేను" అని సున్నితంగా తిరస్కరించాడు. భార్యకు ఈ విషయం నచ్చలేదు. "ధర ఖరారు చేయనప్పుడు మాట ఇచ్చినా చెల్లదు కదా, మన లాభం మనం చూసుకోవాలి కదా" అని ఆమె గొడవపడింది. దానికి సత్యం "ధనం ఈరోజు వస్తుంది రేపు పోతుంది, కానీ ఒకసారి పోయిన మాట తిరిగి రాదు. మాట అంటే మాటే" అని ఖచ్చితంగా చెప్పాడు.
అన్నట్టుగానే మొదటి వ్యాపారి రాగానే తక్కువ ధర అయినా సరే అతనికి పంటను అప్పగించాడు. కాలం గడిచింది. కొన్ని నెలల తర్వాత ఆ ప్రాంతంలో ఊహించని విధంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు వంకలు పొంగి పొర్లి పంట పొలాలు అన్నీ నీట మునిగిపోయాయి. రైతులందరూ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. విత్తనాలు కొనడానికి కూడా ఎవరి దగ్గర పైసా లేదు. అందరూ అప్పుల కోసం దిక్కులు చూస్తున్నారు. ఆ సమయంలో పక్క ఊరి వ్యాపారి మళ్ళీ గ్రామానికి వచ్చాడు. అతను నేరుగా సత్యం ఇంటికి వెళ్లి అందరి ముందు ఇలా అన్నాడు.
"సత్యం, ఆనాడు నీకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా కేవలం నాకు ఇచ్చిన మాట కోసం తక్కువ ధరకే పంటను అమ్మావు. నీ నిజాయితీ నా మనసును గెలుచుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిన్ను ఆదుకోవడం నా బాధ్యత. అందుకే ఈ ఏడాది నీకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు నేను ఉచితంగా ఇస్తాను. నీ పంట పండిన తర్వాత చూసుకుందాం" అని ప్రకటించాడు. ఆ మాట విన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఆనాడు సత్యం నిలబెట్టుకున్న చిన్న మాట, ఈనాడు అతనికి కొండంత అండగా నిలిచింది. ధనం కంటే మాటకు ఉన్న విలువ ఎంతో గొప్పదని ఆ రోజు అందరికీ అర్థమైంది.
అప్పుడు సత్యం తన భార్యతో మరియు గ్రామస్తులతో ఇలా అన్నాడు: "చూశారా, ఆనాడు నేను కొన్ని డబ్బుల కోసం ఆశపడి మాట తప్పి ఉంటే ఈరోజు ఈ గౌరవం దక్కేది కాదు. మనిషికి ఉండాల్సింది ఆస్తిపాస్తులు కాదు, ఆడిన మాటపై నిలబడే ధైర్యం. మనం ఇచ్చే మాట మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ధనం లేకపోయినా పర్వాలేదు కానీ మాట తప్పినవాడు ఎప్పటికీ ధనవంతుడు కాలేడు."
మాట విలువ: - సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి