సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తింపబడుతున్న మహిళలు సమాన అవకాశాల కోసం, సమాన గుర్తింపు కోసం, సమాన వేతనం కోసం పోరాటాలు జరుపుతున్నారు. ఒకప్పుడు పురుషుల కంటే అధిక స్థాయిలో ఉంది. మాతృస్వామ్య వ్యవస్థలో కొనసాగిన భారతదేశ మహిళ జీవన స్థితిగతులు మధ్యలో క్షీణ దశకు చేరుకున్నాయి. విద్యా ఫలాలు మహిళల చేతికి అందనీయకుండా వంటింటికే పరిమితం చేసి, వారి మాటలకు విలువ లేకుండా చేశారు. కందుకూరి, రాజారామ్మోహన్ రాయ్ వంటి ఎందరో సంఘసంస్కర్తల పోరాటంతో శ్రీ పునర్వివాహం, సతీ సహగమనం, బాలికా వివాహాలకు కాలం చెల్లటం వంటివి
జరిగాయి. స్త్రీలు కూడా విద్యను, వేదాల్ని అభ్యసిస్తే తప్పులేదనే అభిప్రాయాలకు వచ్చారు. కాలానుగుణంగా ఎన్నో పోరాటాల ఫలితంగా సమాజంలో మార్పులు వస్తున్నాయి. మగ సంతానం ఉంటేనే పున్నామ నరకం నుండి తప్పిస్తాడనే భావం, తలకొరివి పెట్టే కొడుకును కనేదాకా పిల్లల్ని కనాలనే ఆలోచనల్లో మార్పు సంభవించి ‘‘ ఆడపిల్లలైనా పరవాలేదు ఆపరేషన్ చేయించుకుంటాం’’ అనే దంపతుల ఆలోచన దాకా పరిణమించింది.
వరకట్నాల సమస్యలతో ఎందరో స్త్రీలు అనేక బాధలననుభవించి, తల్లిదండ్రుల గుండెల మీద కుంపట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించడం కోసమే మహిళకు ఆర్ధిక స్వావలంబన అవసరమని తెల్చి చెప్పారు. ఆర్థికంగా ఎదగాలంటే? చదువు తప్పనిసరి. కాబట్టి బాలికలను బడికి పంపాలి చదువు చెప్పించాలి. ఉన్నత ఉద్యోగాలు చేయించాలి అనే నినాదాలు బయలుదేరాయి. ప్రభుత్వాలు బాలికా విద్యను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయి. ఒకప్పుడు ఇంటికి అందునా వంటింటికి పరిమితమైన ఇల్లాలు ఈనాడు చట్ట సభల్లోనూ, విధాన సభల్లోనూ కూర్చుని పరిపాలన దిశగా దూసుకుపోతున్నారు. ఒకనాడు అతి తక్కువ అక్షరాస్యతా శాతంతో ఉన్న మహిళల చదువు ఈనాడు ఎంతో ముందుకు దూసుకుపోతున్నది. అమెరికా సైతం ఆడపిల్లలను ఒంటరిగా పంపడానికి వెనుకాడడం లేదు. ముందు బాగా చదువుకోండి తరువాతే ఇంటి పనులు, పెళ్ళిళ్ళు అంటూ తల్లిదండ్రులే తేల్చి చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులను ఆదరించే విషయంలోనూ అమ్మాయిలు వెనకాడడం లేదు. తల్లో, తండ్రో మరణిస్తే కొడుకు లేడనే బాధ పడకుండా కర్మకాండలు చేయడానికి సైతం ఆడపిల్లలు ముందుకొస్తున్నారు. ఏ పనిలోనైనా ముందుకు దూసుకు వెళ్ళాడమే గానీ, వెనకడుగు వేసే ప్రసక్తి లేదనే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళుతున్నారు.
భారతీయ మహిళలు విద్య, ఉద్యోగం, రాజకీయం, కళలు, ఆటలు వంటి అన్ని రంగాలలోనూ ముందుకు వెళుతున్నారు. ‘‘ ముదితల్ నేర్వగ రాని విద్య గలదె ముద్దార నేర్పించినన్’’ అన్న సామెత ప్రకారం... ఆవకాశం ఇచ్చి ప్రోత్సాహిస్తే, అంతరిక్షంలోకైనా దూసుకుపోతామని తెలియజెప్పుతున్నారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లు బైక్, కారు వంటి వాహనాలు నడపడం ఒకనాడు మగవారి పని అనుకునేవారు. ఆ దశ మంచి ముందుకు వచ్చి నేడు పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఆడపిల్లలు బండ్లు నడుపడంలో ముందు వరుసలోనే ఉంటున్నారు. ఈనాడు కష్టతరమైన ఉద్యోగాలలో సైతం మా భాగస్వామ్యం ఉండాలని ఆశపడుతున్నారు నేటి యువతరం. ఇంకా చెప్పాలంటే ‘‘ ఆడవారు ఈ పనిలో పెద్దగా రాణించలేరు ’’ అన్న పనిలోనే చేరి, శభాష్ అనిపించుకోవాలనే తాపత్రయం ఎక్కువగా కనిపిస్తున్నది. సవాళ్ళను స్వీకరించటమే ఎక్కువగా ఇష్టపడుతూ మహిళా ప్రగతి సాధించాలనుకుంటున్నారు. కెరీర్ మీద ధ్యాస ఎక్కువగా నిలిపి పెళ్ళిళ్ళు, పిల్లల్ని కనటం లాంటి పనుల్ని వెనక్కి నెట్టేస్తున్నారు. ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళి, ముప్పై ఐదేళ్ళ తర్వాత పిల్లలు అనుకుంటూ ప్లాన్ చేస్తున్నారు. వయస్సు మీరిన తర్వాత, గర్భం దాల్చినందు వల్ల లోపాలు కలిగిన పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహిళల వివాహ వయస్సు ఎక్కువై పోవటం వల్ల చాలా మందికి పిల్లలు పుట్టటం లేదు. ఇన్ ఫెర్టలిటీ సెంటర్లు ఈనాడు వీధివీధినా దర్శనమిస్తున్నాయంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు పగలు, రాత్రి డ్యూటీలతో విశ్రాంతి లేకుండా పనిచేయడంతో వంధ్యత్వ సమస్యలు వస్తున్నాయి. ఒకనాడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లంటూ విపరీత ప్రచారాలు సాగించిన ప్రభుత్యాలు, ఇకముందు పిల్లల్ని సకాలంలో కనమని ప్రోత్సాహించాల్సి వస్తుంది. బహుశా సకాలంలో పెళ్ళి, పిల్లలు అనే నినాదాలు వినాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితిలో ప్రతి పౌరుడు హక్కుల గురించి మాట్లాడటమే తప్ప, బాధ్యతల గురించి పట్టించుకోవటమే లేదు. మహిళలు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. మగవారితో సమానంగా అన్ని పనులు చేయగలుగుతున్నారు అంటే మెచ్చుకోలుతో పాటుగా, వాళ్ళు చేసే లంచగొండితనం, దొంగతనం, హత్యాలు వంటి వాటిని సైతం స్వీకరిస్తున్నారు. చాలా ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళలే ప్రధాన అధికారులుగా ఉంటున్నారు. లంచాలు దాతుకుతున్నాయంటే మహిళలు ముందుకు వచ్చి తీసుకుంటున్నారు. జైళ్ళకు వెళుతున్నారు. నీతి, నిజాయితీలకు తిలోదకాలు వదులుతున్నారు. ఒకప్పుడు మహిళలు ఉద్యోగాల్లో ఉంటే సక్రమంగా పనులు జరుగుతాయనే పేరు ఉండేది. ఇప్పుడు ఆ పేరును పోగొట్టుకుంటున్నారు. తమ నిజాయితీకి మచ్చ తెచ్చుకుంటున్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పెట్టిన ఆస్థి హక్కు కూడా ఈ మధ్య పెడదారులు తొక్కుతుంది. తండ్రి ఆస్థిలో మగ పిల్లలతో పాటు, ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తి హక్కులు ఇవ్వాలని, 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. పుట్టింట్లోనూ, అత్తింట్లోనూ నిరాదరణ ఉన్న పరిస్థితుల్లో ఈ ఆస్థి హక్కు ఎంతో ఊరటనూ భరోసాను కల్పించింది. కానీ ఇందులోనూ లొసుగులు వస్తున్నాయి. భారీగా కట్న, కానుకలిచ్చి పెళ్ళి చేసిన తరువాత కూడా, అన్నదమ్ముల దగ్గర ఏమీ మిగలని పరిస్థితుల్లో కూడా ఆత్యాశలకు పోయి, అన్నదమ్ముల్ని కోర్టులకు లాగే ఆడపిల్లలున్నారు.
ఆస్థుల కోసం అన్నదమ్ములతో యుద్ధాలు చేసే అక్క చెల్లెళ్ళు... తల్లిదండ్రులను చూసుకోవటంలోనూ వంశ మర్యాద కాపాడటంలోనూ వెనకడుగు వేస్తున్నారు. హక్కుల కోసం కొట్లాడి తెచ్చుకునేవారు బాధ్యతలను విస్మరించడం అన్యాయం. ఒకనాడు అన్యోన్యంగా ఉండే అన్న చెల్లెళ్ళ బంధం ఈనాడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. మేనమామలు జరపాల్సిన మర్యాదల గురించి ప్రశ్నించే ఆడబిడ్డలు తమకు రావాల్సిన వాటిని సాధించుకుంటున్నారు. గానీ, ఆడపిల్లగా సగం హక్కును పొందిన అమ్మాయి బరువు బాధ్యతల్లోనూ సమానంగా ఉండాలి కదా! వాటిని, మేనత్తగా జరపాల్సిన వాటిని మరిచిపోయినట్లుగా నటిస్తున్నారు.
చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. తల్లిగా తమ పాత్రను సైతం తగ్గించుకుని, కెరీరే వైపు చూపు నిలుపుతున్నారు. డబ్బు, కెరీర్ కన్నా పిల్లల పెంపకం చాలా ముఖ్యం. భావిభారత పౌరుల్ని తయారు చేసే పని మహిళలకు వచ్చినందుకు గర్వించాలి. సహనం, క్షమకు పేరున్న తన రూపాన్ని మార్చుకుని నిర్లక్ష్య ధోరణ వైపు దూసుకుపోతున్నది. ఓర్పు, సున్నితం ఆడవారి లక్షణాలని పడిన పేరు నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాల పేరుతో విపరిత ధోనణులకు అలవాటు పడుతున్నారు. తల్లే తొలి గురువు స్థానాన్నుంచి కనీసం పాలిచ్చి పెంచే తల్లిగా కూడా మిగలడం లేదు.
పాత సంప్రదాయపు కట్టు బాట్ల నుంచి బయటపడాలి. గాని విశృంఖలత్వానికి అలవాటు పడకూడదు . పిల్లలు, కుటుంబం గురించి మహిళలు అర్థం చేసుకున్నంతగా పురుషులు అర్థం చేసుకోలేరు. బంధాలు, బాంధవ్యాల గురించి స్త్రీలు పట్టించుకున్నంతగా మగవారు పాటించలేరు. మగ వారితో సమానంగా చదువు ఉద్యోగాలు మాత్రమే ఉండాలి గానీ, అవినీతి అక్రమాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పనిలో ప్రతి వ్యక్తిలో మంచి లక్షణాలను మాత్రమే ఎంచుకుని పాటించే వివేచన మహిళలకు ఉంది. వారి మనస్సాక్షిని గుర్తించి, మహిళలు మంచి ప్రగతి వైపు అడుగులు వేయాలని సమాజం కోరుకుంటోంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి