ఇకపై భర్తలదే వంటవార్పు
సమానత్వంపై సుప్రీంకోర్టు తీర్పు
నచ్చి మెచ్చి మెళ్ళో వేసిన
మూడుముళ్ల మంగళసూత్రం
బంగారు గొలుసు కాదు...అది
భార్యా భర్తల బాధ్యతల బంధం...!
పెళ్లి మంటపంలో
అగ్ని సాక్షిగా చేసిన
నాటి పెళ్ళినాటి ప్రమాణాలు...
మరునాడు వాడిపోయే
మల్లె పూదండలు కాదు
భాగస్వామి మేళ్ళో నూరేళ్ళు
మెరిసే బంగారు ఆభరణాలు...
పక్కనే ఉన్న పవిత్రమైన
ప్రేమ విగ్రహాన్ని వదిలి పరస్త్రీ
మోహంతో దిక్కులు చూసే నక్కలు..
ఎంగిలి మెతుకులకాశపడే కుక్కలు..
అనుమానమనే పెనుభూతం
మనిషికి మానని పెనురోగమైతే
ప్రేమపక్షి రెక్కలు విరిగి
సంసారం శవపేటికవుతుంది...!
గంటల తరబడి వంటగదిలో
మంటలతో పోరాడి చేసే
వంటల్ని వంకపెడితే అవమానిస్తే
ముక్కలయ్యేది ఆమె చల్లని మనసే ...!
చెమట బిందువులతో
ఇంటి గడియారాన్ని నడిపించే
ఆమె ఒక నిశ్శబ్ద సూర్యబింబం
కనిపించకనే ప్రపంచాన్ని వెలిగిస్తుంది
బాధలన్నీ దాచుకుని బట్టలుతికి
పిల్లల నవ్వుల్లో తన కన్నీరును దాచి
సంసారమనే యజ్ఞంలో అనునిత్యం
దహించుకుపోయే హోమాగ్ని ఆమె ..!
అట్టి అన్నపూర్ణను గృహదేవతను
జీవితాంతం జీతం లేని నౌకరిగా
వంటింటి కుందేలుగా మార్చడం
మానవత్వానికే మాయని మచ్చ...!
ఎప్పుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
ఇపుడే చెబుతుంది సుప్రీంకోర్టు
భార్య బానిస కాదు భాగస్వామియని..!
వంటగదిలో ఆమె ఒంటరి కాదని...
వంటపని ఇంటిపని భర్త బాధ్యతని...
అంట్లుతోమడం బట్టలుతకడంలో
సమానత్వ గీతం ఆలపించాలని...!
భార్యాభర్తలు అంటే...
రెండు శరీరాలు కాదని...ఒక ఆత్మని...
సంసారమను రథానికి రెండుచక్రాలని...
అదే అర్థనారీశ్వర తత్వమని...
అదే సుఖసంసారానికి శ్రీకారమని...
ఇచ్చింది అత్యున్నత
న్యాయస్థానం తిరుగులేని తీర్పు
తెచ్చింది భార్యా భర్తల
వివాహ బంధంలో పెనుమార్పు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి