విరాట పర్వము పంచమాశ్వాసము- 194 వ రోజు
అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట
అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు " ఉత్తరకుమారా ! రధాన్ని వారి వైపు పోనివ్వు " అన్నాడు. అర్జునుడు తమవైపు రావ్సడం చూసి అశ్వథ్థామ " కర్ణా ! అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించ గలిగిన సమర్ధుడవు నువ్వే " అని కర్ణుని పరహాసంగా ముందుకు తోసాడు. కర్ణుడు " నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు " అన్నాడు. అర్జునుడు కౌరవవీరు లందరినీ మట్టి కరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసి పోయి తొలగి పోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునితో " అర్జునా! నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తుంది కనీసం నీళ్ళు త్రాగ కుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారధ్యం చేయలేను " అన్నాడు. అర్జునుడు " ఉత్తర కుమారా! ఓపిక పట్టు ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధం ఔతున్నట్లు ఉంది. రథం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను. భయపడకు " అన్నాడు. సుయోధనుని వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులి వలె సుయోధనునిపై విరుచుకు పడ్డాడు. బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై రెండు బాణాలు వేసాడు. అర్జునిని నుదిటిపై రెండు బాణాలు వేసాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునుపై శరపరంపరను వేసాడు అర్జునుడు. సుయోధనుకి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభ స్థలంపై పిడికిలితో కొట్టాడు. ఆదెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రథంపై ఎక్కాడు. అర్జునుడు మరలా సుయోధనుని గుండెలను గురి పెట్టి పది బాణాలను వేసాడు. సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చి వారందరిని అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెను తిరిగాడు. అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో " అర్జునుడు తరుము కొస్తుండగా సుయోధనుడు పారి పోతున్నాడు. మనం అతనిని కాపాడాలి " అన్నాడు. కర్ణుని మాటలను భీష్మ ద్రోణ, కృపాచార్యులు లెక్క చెయ్య లేదు. సుయోధనుడు దీనంగా " అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలి పోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందు తున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా? " అన్నాడు. అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి " ఏమిటి సుయోధనా ! అలా పారి పోతున్నావు. ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్న వాడిని ఒంటరిని నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనా వాహినితో వచ్చావు మిత్రులు సాయం ఉన్నారు ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వరా ఇక నీవు హస్థినా పురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు. మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్టుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధనా నా మాట విను యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు; గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు కాని వెను తిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారి పోవడమేమిటి చీ సిగ్గుగా లేదా? " అని అధిక్షేపించాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి