సుప్రభాత కవిత : - బృంద
కుశలం అడుగుతూ 
భువనము చేరుతున్న 
గగనపు చాచిన హస్తం 
భువికి కాదా చిర నేస్తం!

నేలకు తాకిన దినకరు 
కిరణపు చరణం కడుగ
కెరటము పంపిన కడలికి 
దొరికెను కాదా  చెలిమి తీరం!

కనుమల  సాగే ఏటికి 
కలలు తీరగ నేటికి 
కనుల ముందు దీపమై 
నిలిచెను  కాదా  వెలుగై!

శిలగా నిలిచిన గిరి 
శిఖరపు అంచున చేరిన 
తొలి వెలుగుల సందేశం 
ఇలకు కాదా ఇనుని అనుగ్రహం!

కలతకు నెలవైన ఎదకు 
కమ్మని కబురేదో అంది 
కలకల నవ్వే కన్నుల 
కొలనున విరిసెను కాదా కమలం!

గడచిన చీకటి రాత్రిని 
తలవక సాగిన నడకకు 
గెలవక తప్పని పయనపు 
విలువను చెప్పును కాదా వేకువ!

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు
Popular posts