సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -188: ఆ తొవ్వ ఏడికి పోతుందంటే - ఎక్కడికి పోదు నేను పుట్టిన కానుంచి  సూత్తున్న గీ తొవ్వ ఏడికి పోలే గీడనే వుంది అన్నట్టు"
*****
"ఒరేయ్ బుడ్డోడా! తనబ్బిలో దాశిన సున్నుండలన్ని ఏమైనైరా? ఒక్కటైనా మిలిగిచ్చకుండా తిన్నావారా?
"అన్నీ తిన్లేదవ్వా! డబ్బాల ఇంకున్నయి."
" ఎన్నున్నయిరా?గట్ల ఎవలికి బెట్టకుండ గుటుకు గుటుక్కున మింగితే ఎట్లరా? మిలిగినోళ్ళు తినొద్దా శెప్పు?
నిజ్జంగా అవ్వా! నామీదొట్టు. నీమీదొట్టు. సత్తె పమాణంగ శెప్తున్న అడుగున ఉన్నయి అవ్వా!"
 మంచిగ అడుగుతున్న శెప్పు.దానెడు శేత్తె గట్ల కాళీ జేసినవేరా బుడ్డోడా?"
" ఎన్ని త్యేపల జెప్పాలె అవ్వా! అన్ని కాళీ జెయ్యలే అడుగున ఉన్నయనీ!"
 " ఓష్నీ! గీని తెల్వి బంగారం గాను. అన్ని గట్లెట్ల తిన్న ముచ్చెటి నేనడుగుతుంటే -అడుగున ఉన్నయి గద అంటుండు ఎంత ముద్దుగా!"
 ఎన్కటి కెవడో ఒకాయన్ని "ఆ తొవ్వ  ఏడికి పోతదని అడిగితే - నేను పుట్టిన కానించి సూత్తున్న గీ తొవ్వ ఏడికి పోలె  గాన్నే ఉంది" అన్నడంట. గట్లుంది నువ్వూ నీ యవ్వారం.!"
 "డబ్బా అంత కాలీ జేసినవేరా అని నేనంటే అడ్గున ఉన్నాయి కదా అంటున్నడు సూడు."
 "గీ దీన్నే శానతనం అంటరు. తెల్విగ ఇవతలోల్లని బురిడీ కొట్టిచ్చుడంటే గిట్లనే మరి."
 "అవునవ్వా!;గీనికి గీ నడ్మల మస్తు ఎచ్చులు ఎక్వయినయి. ఏది మాట్లాడినా గిట్లనే మాట్లాడుతుండవ్వా! గానికి బొమ్మలు గీస్కుంట నంటే కొత్త పెన్సీలు ఇచ్చినవ్వా!" "దాని పనైపోయినంక మల్లియ్యిరా " అంటే ఇంగో అని శిటికెనేలు అంగుళమంత పెన్సీలు ఇచ్చిండవ్వా!"
 "గదేందిరా వారీ! అంటే "పెన్సీలు తీసుకున్న. ఇచ్చిన్నా లేదా అని దబాయిత్తుండవ్వా!"
 "నిజ్జంగానే భూలచ్మీ! గా దారి ముచ్చెటొతికెనే ఉంది గీని ఎచ్చిడి."
 "అవ్వా! గదేందో నాకు సమజైతలే మల్లో పాలి శెప్పవా?
 ఒకూల్లెకి కొత్తాయన వొచ్చిండు. గట్ల తొవ్వ పొంటి పోతూ పోతూ ఇగ్గో మన బుడ్డోడి లాంటోన్ని సూశిండు.  ఆ కొత్తాయన తాను పోవాల్శిన ఇంటి కోసం తొవ్వ ఏడికి పోతదని అడిగిండు. ఊల్లె తొవ్వలు ఎట్లుంటయి తెల్సు కద!ఒక తొవ్వల పోతే ఊల్లె గుడివొత్తది.ఇంకో తొవ్వల పోతే దొరోల్ల గడీ వొత్తది... గిట్ల శెప్పాలె గద. గజ్జెప్పకుండ "తొవ్వ ఏడికి పోలె నేను పుట్టిన కానించి సూత్తున్న గాన్నే ఉంది"అని పరాష్కాలాడిండన్న మాట. గట్ల శెప్తరా తప్పు గదా!
 "తొవ్వ యాడికి బోదు ‌గది గా కొత్తాయనకు మాత్తరం తెల్వదా ఏంది !అడుగుట్ల తొందర్ల  ఆ తొవ్వ పొంటి పోతే అని అడక్క గట్ల అడిగిండు. గా దానికి గీడు అట్ల శెప్తడా! దినదినాం  గీ నడ్మల బడివొతికె అయితుండు.
 "మాంచి శింత బరిగె తెచ్చి ఈపు ఇమానం మోత మోగిత్తె గని గిస్మంటి మాటలు మాట్లాడ్డం మానేత్తడు.
"అవ్వా! తప్పయింది ఇంకో పాలి గిట్లనను" అన్కుంట తన ముందు తలొంచుకున్న బుడ్డోడిని దగ్గరకు తీస్కొని ఇంకో త్యేప ఎప్పుడూ శెయ్య బాకని యితవు శెప్పింది అవ్వ.
 గదండీ సంగతి '' ఆ తొవ్వ యాడికి పోతదంటే -ఎక్కడికి పోదు నేను పుట్టిన కానించి సూత్తున్న గాన్నే ఉంది అన్నడంట"అంటే గిదే మరి.

కామెంట్‌లు