మా అమెరికా అనుభవాలు...: - పోణంగి బాల భాస్కర్






 Visit of Washington DC
-------------------------------------
2018 మార్చి 31వ తేదీ ఉదయం 9 గంటలకు బయలుదేరి వాషింగ్టన్ DC కి వెళ్ళాము.  14th స్ట్రీట్ లోని రోనాల్డ్ రీగన్  బిల్డింగ్ & ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, North Lobby లో కారు పార్క్ చేసి, నడుచుకుంటూ అక్కడ ప్రాంతాలను చూడటానికి వెళ్ళాము. 
ఈ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. పైనుంచీ సూర్యకిరణాలు పడుతున్నప్పటికీ, పక్కల నుంచీ చలిగాలి ఎక్కువగానే ఉంది.  ఈ రోజు Week End తో పాటు Spring Break కావడం అలాగే National Cherry Blossom Festival ఆలస్యంగా ప్రారంభం కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో అటూ ఇటూ తిరుగుతూ కనబడ్డారు. 
ముందుగా వైట్ హౌస్ చూద్దామని బయలుదేరాము. అక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి. వాహనాలను అనుమతించలేదు.  అందరూ నడిచే వెళ్ళాలి. వైట్ హౌస్ వెనకాల రోడ్డు మీదనే  కొంతమంది స్కేటింగ్ హాకీ ఆడుతున్నారు. వైట్ హౌస్ అంటే - అది అమెరికా అధ్యక్షుని అధికార నివాసం.  చుట్టూ భద్రతా వలయం కట్టుదిట్టంగా ఉంది. అక్కడ ఫోటోలు తీసుకున్నాము. అక్కడనుంచి వరుసగా - 
Washington Monument, 
World War -II Memorial, 
Constitution Gardens, 
Lincoln Memorial, 
Vietnam Veterans Memorial 
మొదలైనవి చూశాము. 
Washington Monument చుట్టూ పెద్ద పాచిక మైదానం ఉంది.  అక్కడ Kites Festival జరిగింది. రంగురంగులతో, రకరకాల ఆకారాలతో, వివిధ పరిమాణాలలో ఉన్న గాలిపటాలు పట్టుకుని పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు. కొంతమంది నిపుణులు ఎగురవేసిన గాలిపటాలు అందరినీ విశేషంగా ఆకర్షించాయి. 
చాలా మంది Mats, Chairs, Camp Kits, Tents తమతో వెంట తెచ్చుకున్నారు. సకుటుంబ సమేతంగా ఆనందంగా భోజనాలు చేశారు. ఇక్కడ విశాలంగా ఉన్న పచ్చిక మైదానంలో గాలి పటాలు ఎగురవేస్తూ రాత్రి దాకా ఉల్లాసంగా గడిపారు. వారినందరినీ చూస్తుంటే ఎంతసేపైనా ఆ ప్రదేశం విడిచి రాబుద్ధి కాలేదు.  మేము కూడా అక్కడ ఒక బెంచి మీద కూర్చుని, ఇంటినుంచి తెచ్చుకున్న ఫలహారాలు తిని, మిగిలిన ప్రదేశాలు చూడటానికి బయలుదేరాము. 
Washington Monument మరియు Lincoln Memorial ఎదురెదురుగా ఉన్నాయి. ఎంత దూరం నుంచి చూసినా ఈ రెండూ మనకు స్పష్టంగా కనబడుతూనే ఉంటాయి.   ఈ రెండింటికీ మధ్యలో మిగిలినవన్నీ ఉన్నాయి.  
World War II Memorial దగ్గర ఒక వైపున PACIFIC పేరుతో, రెండో వైపున ATLANTIC పేరుతో రెండు పెద్ద పెద్ద బురుజులు నిర్మించారు.  వాటికి ఇరువైపులా అమెరికాలోని వివిధ రాష్ట్రాల పేర్లతో ఆయా రాష్ట్రాలకు చెందిన అమరవీరులను స్మరించే విధంగా స్మారక చిహ్నాలను నిర్మించారు. మరోవైపున అమరులైన సైనికవీరులను గుర్తు చేసుకుంటూ "The Price of Freedom" పేరుతొ బంగారు రంగు నక్షత్రాలను ఒక పెద్ద గోడ మీద అందంగా అమర్చారు.  ప్రతి వంద మంది అమరవీరులకు ఒక్కొక్క బంగారు నక్షత్రం చొప్పున మొత్తం 4,048 Gold Stars ను fix చేశారు.  
ఈ మూడింటికీ మధ్య వృత్తాకారంగా ఒక పెద్ద కొలను నిర్మించారు. అందులో నీటిని పైకి విరజిమ్ముతూ రెండు పెద్ద పెద్ద Fountains కనులవిందు చేశాయి.  
World War II Memorial మరియు Lincoln Memorial మధ్యలో పెద్ద Water Pool ఉంది. అది కేవలం మోకాలు లోతు మాత్రమే ఉంది. నీళ్లు చాలా స్పష్టంగా శుభ్రంగా ఉన్నాయి.  వెడల్పు పెద్ద ఎక్కువగా లేదు కానీ చాలా పొడవుగా ఉంది. అందులో సూర్య కిరణాలు పడుతూ మెరుస్తూ ఉంటే దాని పక్కన నడుస్తూ ఉంటే అలసట తెలియలేదు. 
Cherry Blossom ఇప్పడికే రావాలి కానీ, ఇంకా పూర్తిగా అన్ని చెట్లూ పుష్పించలేదు. అక్కడక్కడా కొన్ని చెట్లు మాత్రమే రంగురంగుల పూలతో దర్శనమిచ్చాయి.  
అలా, అలా నడుచుకుంటూ Lincoln Memorial దగ్గరకు చేరుకున్నాము. ఇక్కడ లింకన్ భారీ విగ్రహాన్ని ఎత్తైన భవనంలో పెద్ద స్టేజి లాంటి గట్టు మీద ప్రతిష్టించారు.  ఆ విగ్రహం చూడడానికి సుమారు 50, 60 మెట్లు పైకి ఎక్కాలి. పైదాకా ఎక్కలేని వారికోసం లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది.  అక్కడ నుంచి చూస్తే -  
Washington Monument,  
World War II Memorial, 
Water Fountains,  
Constitution Gardens, 
Vietnam Veterans Memorial 
మొదలైనవన్నీ చక్కగా కనబడ్డాయి. 
అక్కడ నుంచి నెమ్మదిగా కిందకి దిగి, నడుచుకుంటూ,  Vietnam Veterans Memorial Wall దగ్గరకి వచ్చాము. అక్కడ ఒక నల్లని పొడవైన గ్రానైట్ గోడ మీద, అమరవీరుల పేర్లు వరుసగా తీర్చి దిద్దినట్లు చెక్కారు. అక్కడ కొంతమంది తమకు తెలిసిన వారి పేర్ల కోసం వెతకడం కనబడింది.  అలా గుర్తుపెట్టిన కొన్ని పేర్ల దగ్గర వారు పుష్పగుచ్చాలు ఉంచి, శ్రద్ధాంజలి ఘటించారు. వారు విషణ్ణవదనంతో కనబడ్డారు.  వారు మనకి తెలియకపోయినా వారిని అలా చూడగానే ఒక విధమైన విచారం నన్ను ఆవహించింది. 
అక్కడ నుంచీ చిన్నగా నడుచుకుంటూ  Constitution Gardens లో ఉన్న మరి కొన్ని Memoriyal విగ్రహాలను, స్మారక చిహ్నాలను చూస్తూ వచ్చి Constitution Avenue దగ్గర Cab తీసుకుని U.S.Capital Building దగ్గరకు వచ్చాము. ఇది అమెరికా పార్లమెంటు భవనం. అప్పటికే సాయంత్రం నాలుగున్నర కావడంతో లోపలికి వెళ్లి చూడడానికి అవకాశం లేకపోయింది. అందువల్ల భవనం చుట్టూ తిరిగి ఫోటోలు తీసుకున్నాము.  ఇది చాలా ఎత్తైన భవనం. మరెంతో సుందరంగా ఉంది.  చూస్తున్నకొద్దీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది. 
అలాగే U.S.Capital చుట్టుపక్కల ఉన్న 
US Supreme Court, 
Thomas Jefferson Building 
తదితర ప్రదేశాలు, భవనాలు చూసిన అనంతరం మళ్ళీ CAB తీసుకుని మా కారు పార్క్ చేసిన Ronald Reagan భవనం దగ్గరికి వచ్చాము.  
మొత్తం మీద దాదాపు 10 కిలోమీటర్ల మేర నడిచాము. అయినా అలసట అనిపించలేదు.  ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకుని ఆనందంగా ఇంటికి వచ్చాము.
🌸🌷🌸






కామెంట్‌లు
Popular posts