శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 109
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
88. మూలమంత్రాత్మికా (అష్టాక్షరీ)
89. మూలకూటత్రయ కళేబరా (దశాక్షరీ)
ఎనభై తొమ్మిదవ నామ మంత్రము - 
  ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః
"మూలమంత్రాత్మికా" అనే అమ్మ యొక్క అష్టాక్షరీ నామంలో మూడు భాగాలుగా ఉన్న అమ్మ యొక్క సూక్ష్మ శరీరమును గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు, ఈ "మూలకూటత్రయ కళేబరా" అనే దశాక్షరీ నామంలో, అవే ముందు చెప్పబడిన మూడు భాగాలను, స్థూల శరీర భాగాలుగా ఉన్న పరమేశ్వరి రూపాన్ని చూసి, వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "మూలకూటత్రయ కళేబరా" అని కీర్తించారు. అలా మూల మహా మంత్రములోని మూడు భాగాలనూ, తన శరీర అవయవాలుగా కలిగిన అమ్మలగన్నయమ్మకు నమస్కారము.
"వాగ్భవ కూటమి" లో అమ్మ ముఖపద్మ సౌందర్యాన్ని, "కామరాజ కూటమి" లో పరాత్పరి యొక్క మెడ నుండి నడుము మధ్యలో వున్న సౌందర్యాన్ని, "శక్తి కూటమి"లో జగజ్జనని సుందరమైన నడుము ఆధోభాగాన్ని, సూక్ష్మ రూపంలో ఊహించుకుని, దర్శించున్నాము. ఈ మూడు కూటములు కలిసి ఏర్పడిన నామాన్ని "పన్చదశాక్షరీ మహామంత్రము" అని చెప్పారు వశిన్యాది వాగ్దేవతలు. ఏ మంత్రాన్ని అయినా మూడు భాగాలుగా విభజించగలిగితే, అలా విభజించబడిన మూడు భాగాలనూ, మూడు కూటములుగా చెప్తారు, విజ్ఞులు.
అలా మూడూ కూటములుగా ఉన్న పన్చదశాక్షరీ మహామంత్రము లోని మూడు భాగాలనూ తన స్థూల శరీర అంగాలుగా కలిగివుంది, అమ్మ. అలా మూడు భాగాలనూ కలిపివున్న పన్చదశాక్షరీ మహామంత్రమే, "మూలకూటత్రయ మంత్రము". అలా "మూలకూటత్రయ మంత్రము" నే స్థూల శరీరం గా కలిగివున్న పరమేశ్వరి, "మూలకూటత్రయ కళేబరా" అని పిలువబడింది.
"పన్చదశాక్షరీ మహామంత్రం" లేదా "మూలకూటత్రయ కళేబరా" మంత్రం యొక్క జపం, తపస్సు చేస్తూ, సాధనలో ఉన్న సాధకునికి, ఆయుషు, పుష్టీ, వశీకరణం, విద్య, కీర్తి లభిస్తాయి. సంపత్ ప్రమాదమూ, భోగప్రదమూ, సౌఖ్య ప్రమాదమూ, సర్వాభీష్ట ప్రమాదమూ అయి, కవిత్వ రచనా నైపుణ్యం కూడా కలుగజేస్తుంది. పన్చదశాక్షరీ మహామంత్రం శ్రీమాత సుక్ష్మ రూపము, కదా! ఆ రూపాన్ని మనం ఉపాసన చేయాలి అంటే, పూర్వజన్మ సుకృతం చేసుకుని అయినా ఉండాలి. లేదా, స్వయంగా ఆదిశంకరులు అయినా అయి ఉండాలి. ఇంత గాఢత ఉంది కనుకనే, "గురుముఖతః మంత్రోపదేశం" జరగాలి, అని నొక్కి చెప్పారు భాస్కరరాయల వారు.
ఇంతటి మహిమాన్వితమైన "వాగ్భవ కూటమి", "కామరాజ కూటమి", "శక్తి కూటమి" మరియూ "మూలకూటత్రయ కళేబర" మంత్ర విశేషాలను మనం చదువుకుని తెలుసుకోగలిగాము అంటే, పరమేశ్వరి యొక్క అనుగ్రహం పుంఖానుపుంఖాలుగా ఉండడం వలననే సాధ్యం అయ్యింది. ఇంతటి, దయనూ, కరుణతో కూడిన తన చల్లని చూపులను మనపై ప్రసరింపచేస్తున్న శ్రీమహారాజ్నికి శత సహస్ర నమస్కారములు చేసుకుందాము.
"గురుముఖతః మంత్రోపదేశం" పొందిన తన సాధకులు ఎప్పుడు పిలుస్తారు, వెంటనే వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి సంసిద్ధయై ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు 
ఓం మూలకూటత్రయ కళేబరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు
Popular posts