చల్లదనం పేరుతో విషం: - సయ్యద్ సల్మా-B.LI.SC.,M.A.,M.ED-భద్రాచలం
శీతల పానీయాల మాయలో పడకు సుమా…
చల్లదనమనే పేరుతో
వ్యాధులనే తాగుతున్నామనే నిజం గుర్తుందా…?
గొంతుకి క్షణిక హాయి కోసం
దేహానికే శిక్షలు వేయడం ఎందుకు…?
రుచిపచి కోసం
ఆయుష్షునే తాకట్టు పెట్టడం అవసరమా…?
రంగులు మెరిసే సీసాల్లో
ఆరోగ్యం ఉండదు…
రసాయనాల తీపిలో
నిశ్శబ్దమైన ప్రమాదాలే దాగి ఉంటాయి.

చెదపురుగులా లోలోపల
కాలేయం, గుండె, మూత్రపిండాలను కొరుకుతూ
నెమ్మదిగా శరీరాన్నే
శూన్యంగా మార్చేస్తున్నాయి.

ఈరోజు అలవాటైన నిర్లక్ష్యం
రేపటి ఆసుపత్రి బిల్లుగా మారదా…?
క్షణిక రుచుల కోసం
జీవితాంతం మందులు మింగడం న్యాయమా…?
సహజమైన వాటిలో అందం, ఆయుష్షు దాగి ఉంది…
పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు,
మజ్జిగ, చెరుకురసాల్లో
ప్రకృతి పరిమళించే ఆరోగ్యం నిండి ఉంది.

సబ్జా–నిమ్మరసం చల్లదనంలో
శరీరం సేదతీరదా…?
ప్రకృతి ఇచ్చిన ప్రతి చుక్కలో
జీవానికి కావాల్సిన శక్తి ఉండదా…?

పెద్దలు కూడా మారారు…
ప్రకృతి పానీయాల విలువనే మరచిపోయారు…
నిశ్శబ్దంగా విషాన్నే నాలుకలకు అందిస్తూ
చిన్న వయసులోనే పిల్లలను వ్యాధులకు బలి చేస్తున్నారు.

సహజమైన వాటిని వదిలి
శక్తి క్షీణించే వాటినే చేరదీస్తున్నాడు మనిషి…
అభివృద్ధి పెరిగిందని చెప్పుకుంటూ
పరిపక్వతను మాత్రం కోల్పోతున్నాడు.
ఆరోగ్యమే మహాభాగ్యం…
ఆరోగ్యమైన శరీరమే అసలైన సంపద.

మారండి… మారండి…
సహజ శీతల పానీయాల విలువ తెలుసుకోండి…
ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి…
రేపటి తరాలకు
వ్యాధులు కాదు…
ఆరోగ్యమైన జీవితాన్ని అందించండి…




కామెంట్‌లు
Popular posts