సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 భీష్మ పర్వము తృతీయాశ్వాసము- 264 వ రోజు
తొమ్మిదవ రోజు యుద్ధం
తమ్ముల మరణంతో కలత చెందిన సుయోధనుడు దుశ్శాసనుని పిలిచి వెంటనే కర్ణుని, శకునిని పిలుచుకురమ్మని కబురు పంపాడు. దుశ్శాసనుడు కర్ణ, శకునులతో సుయోధనుని వద్దకు వచ్చాడు. ఏకాంతంలో సుయోధనుడు " తాత భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు తటస్థంగా ఉన్నారు. పాండవులను వారు చంపడం లేదు. పాండవ సైన్యం మన సైన్యం అతి వేగంగా తరిగి పోతుంది ఏమి చేయాలి " అన్నాడు. కర్ణుడు రణక్రీడా ఉత్సాహుడై " సుయోధనా ! భీష్ముని రావద్దని చెపితే నేను రణరంగ ప్రవేశం చేస్తాను. పాండవులూ వారి సేనల మదం అణచగలను " అన్నాడు. ఆ మాటలు విని సుయోధనుడు " దుశ్శాసనా ! తాతగారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెబుతాము రా " అని ఇరువురు సుయోధనుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి " పితామహా ! మిమ్మలిని నమ్మి యుద్ధానికి దిగాను. కాని మీరు యుద్ధ రంగమున దేవదానవులను దిక్కరించగల మీరు ఏమీ చేయక ఎనిమిది రోజుల నుండి దిక్కులు చూస్తూ పాండవులను చంపక నిరీక్షిస్తున్నారు. అర్జునిని చంపడం మీకు చేతకాలేదు కాని నా తమ్ములు మాత్రం మరణిస్తున్నారు. కనుక మీరు రణరంగం నుండి తప్పుకుని కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి " అన్నాడు.
భీష్ముని వ్యధ
వాడి బాణాల వలె ఉన్న సుయోధనుని మాటలకు భీష్ముడు నొచ్చుకుని కొంత సేపు మౌనం వహించి గాఢంగా నిట్టూర్చి " సుయోధనా ! అర్జునుడు సామాన్యుడు కాదు. ఖాండవ వన సమయంలో ఇంద్రుని జయించాడు. శివునితో హోరాహోరీ పోరి పాశుపతాన్ని పొందాడు. నిన్ను నీ వారిని గంధర్వుల బారి నుండి రక్షించింది అర్జునుడే. అప్పుడు కర్ణుడు పారి పోయిన విషయం నీకు తెలియనిది కాదు. అర్జునుడు, నిన్ను, ద్రోణుని, అశ్వథ్థామను, కృపాచార్యుని, కర్ణుని సమ్మోహితులని చేసి గోవులను తీసుకు పోయిన విషయం మనమెరిగినదే ! అర్జునిని విజయపరంపర మనము వినే ఉన్నాము. ఏనిమిది రోజులు నా శాయశక్తుల యుద్ధం చేసి నీ నోటి వెంట ఈ మాటలు విన్నాను. నేను ఇప్పుడే చెప్తున్నాను నేను గాండీవిని గెలువలేను. శిఖండిని చంపను వీరిద్దరు తప్ప రణమున ఎవరు ఎదురైనా నేను చంపగలను. నేను పాండవ సైన్యంలో పాంచాలరాజు, మత్స్యదేశాధిపతి, యాదవులు వారి సైన్యములను చెండాడుతాను నీవు నీ తమ్ములు పాడవులను, వారి పుత్రులను వారి సైన్యములను మీ పరాక్రమంతో గెలవండి. ఇక వట్టి మాటలు కట్టి పెట్టి నీ తమ్ములతో పాండవుల మీద ప్రతాపం చూపి విజయం సాధించు. నీకు తగని పని అని తెలిసి పాండవులతో పగ పూనావు. నా మాట లక్ష్యపెట్ట లేదు. అయినా రేపు నా పరాక్రమం చూడగలవు. పరాక్రమం చూపి గెలవాలి కాని ఇలాంటి ములుకుల వంటి మాటలతో విజయాన్ని సాధించ లేవు " అన్నాడు. భీష్ముని మాటలకు మనసులో సంతసించి సుయోధనుడు అక్కడి నుండి వెళ్ళాడు. మరునాటి యుధ్ధం ఆరంభమయ్యే సమయంలో సుయోధనుడు " మహాయోధులారా ! పాంచాలరాజుతో సహా అందరిని సంహరిస్తానని పాండవులను గెలువ గలనని నిన్న రాత్రి భీష్ముడు నాతో అన్నాడు. మనమందరం అతడి మాటను నెరవేరుద్ధాం " అని వ్యంగ్యంగా అన్నాడు. అతడి మాటలకు ఆగ్రహించిన భీష్ముడు కోపాన్ని మనసులో దాచుకున్నాడు. ఇది గమనించిన సుయోధనుడు దుశ్శాసనునితో " మీరు తాతగారి వద్ద ఉండి అతడిని కాపాడండి. అతడికి సాయంగా ఇరవై రెండు వేల రథికులను ఉంచండి " అన్నాడు. తరువాత మిగిలిన వారిని చూసి " మహామహులారా! నిత్యసత్యవ్రతుడైన భీష్ముడు శిఖండితో యుద్ధం చేయనని ప్రతిన పూనిన విషయం తెలుసు కనుక మనం ఆనీచ శిఖండిని భీష్ముని ఎదుటకు రాకుండా చూడాలి " అన్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు
Popular posts