స్వాతంత్య్ర భారత పార్లమెంటు తొలి సమావేశాలు న్యూ ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో 1952 మే 13న ప్రారంభమైన చారిత్రక ఘట్టానికి 74 ఏండ్లు పూర్తయి 75 వ వసంతంలోకి ప్రవేశించి అమృతోత్సవం ( ప్లాటినం జూబ్లీ ) సంబరాలు జరుపుకొనే తరుణంలో నాటి మధుర స్మృతులను నెమరువేసుకుందాం.
మహాత్మా గాంధీ నేతృత్వంలో సుదీర్ఘ కాలం పోరాడి భారతమాతను బ్రిటిష్ వారి దాస్యశృంఖాలనుండి విముక్తి గావించినా ... రాజ్యాంగ రచన, ఆమోదం, స్వాతంత్ర్య భారతదేశ తొలి ఎన్నికలు ముగిసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలోకి రావడానికి సమారు నాలుగేళ్ల సమయం పట్టింది.
రాష్ట్రపతి, లోక్ సభ, రాజ్యసభలతో కూడిందే పార్లమెంటుగా భారత రాజ్యాంగం పేర్కొంది. ఐదేండ్ల కాలవ్యవధికి భారతావనిలోని అర్హతగల ఓటర్లు ఎన్నుకున్నదే లోక్ సభ. రాష్ట్ర, అసెంబ్లీలు గల కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు నిర్దేశిత సంఖ్యలో ఎన్నుకోవడం ద్వారా మరియు వివిధ రంగాలకు చెందిన 12 మంది సభ్యులను రాష్ట్రపతి నేరుగా నియమించడం ద్వారా ఏర్పడేదే రాజ్యసభ.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, బి ఆర్ అంబేద్కర్, విజయలక్ష్మీ పండిట్, జగ్జీవన్ రామ్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ, సుచేత కృపలానీ, కె కామరాజ్ , రాజ్ కుమారీ అమృత్ కౌర్, గుల్జార్ లాల్ నందా, కందాల సుబ్రహ్మణ్య తిలక్, ఆర్ వెంకట రామన్, వి వి గిరి వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు తొలి పార్లమెంటు సభ్యులు. 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 489 మంది సభ్యులకు గాను 398 మంది ఎన్నికయ్యారు. వీరిలో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి 364 , అజయ్ ఘోష్ నాయకత్వంలోని కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 16, నరేంద్ర దేవ్ నాయకత్వంలోని సోషలిస్టు పార్టీ 12 స్థానాల్లో గెలుపొందగా మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. 17, 32, 12, 343 మంది ఓటర్లుగా గుర్తించగా 44.7 శాతం పోలింగ్ నమోదైంది. వివిధ కారణాల వలన మిగిలిన స్థానాలకు ఉప ఎన్నికల ద్వారా భర్తీ చేసారు. దీని మూలంగా వివిధ మాధ్యమాల్లో తొలి లోక్ సభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల సంఖ్య రకరకాలుగా పేర్కొన్నారు. గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ లోక్ సభ మొదటి స్పీకర్ గా సమర్ధవంతంగా పనిచేసి సభలో అనేక ఉత్తమ సాంప్రదాయాలను నెలకొల్పారు. లోక్ సభ లో ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా ఫ్రాంక్ అంథోనీ, ఎ ఇ టి బారో నియమితులయ్యారు.
రాజ్యసభ ఏర్పాటు విషయంలో రాజ్యంగ సభ్యుల మధ్య, తదనంతర కాలంలో రాజకీయ పండితులు, నాయకులు మధ్య ఏకాభిప్రాయం లేదు. అయినా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభగా దీనిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గా మొదట నామకరణం చేసి తదనంతరం 1954 ఆగష్టు 23న రాజ్యసభగా మార్చారు. పెద్దల సభగా, ఎగువ సభగా ఈసభను గౌరవిస్తారు. ఆరేండ్ల కాలపరిమితితో రాష్ట్రాల నుండి ఈ సభ్యులను ఎన్నుకొంటారు. అయితే రెండేళ్లకోసారి మూడవవంతు మంది సభ్యులు తొలగిపోతారు. ఆ స్థానాలకు ఎన్నికలు జరిగి కొత్త సభ్యులు వచ్చేలోగా రెండింట మూడు వంతుల సభ్యులు సభలో ఉంటారు. అందుచే రాజ్యసభ శాశ్వతసభ. రాజ్యసభకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన 12 మందిని రాష్ట్రపతి నియమిస్తారు. ఉప రాష్ట్రపతి ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాజ్యసభకు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. తాత్వికుడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయాలకు అతీతుడైన సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి ఉప రాష్ట్రపతి గా రాజ్యసభ నిర్వహిణలో విశేష ప్రతిభ కనబరిచి దశాబ్దం పాటు రాజ్యసభ అధ్యక్షునిగా పనిచేశారు. వివాద రహితునిగా పేరొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనంతరం భారతదేశం రెండవ రాష్ట్రపతిగా సేవలందించిన దార్శనికుడు. రాజ్యసభ ఛైర్మన్ తో పాటు సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ను తమలో ఒకరిని ఎన్నుకుంటారు. మొదటి రాజ్యసభ లో 216 మంది సభ్యులుండగా ఎస్ వీ కృష్ణమూర్తి రావు డిప్యూటీ ఛైర్మన్ గా సేవలందించారు.
6రాజ్యసభ నుండి ఇందిరాగాంధీ, మన్ మోహన్ సింగ్, దేవెగౌడ వంటివారెందరో ప్రధానమంత్రి గా దేశాన్ని పాలించారు.
ఉపరాష్ట్రపతిగా , రాజ్యసభ ఛైర్మన్ గా సేవలందించిన మహనీయులెందరో భారతదేశం అత్యున్నత స్థానమైన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, శంకర్ దయాళ్ శర్మ, కె ఆర్ నారాయణ్, వి వి గిరి తదితరులు. స్వాతంత్ర్యం సిద్ధించిన వేల ప్రజల అవిద్య, అమాయకత్వం, విద్యుత్, రహదారులు, ఉపాధి, సాగుభూమికి నీరు, ఆరోగ్యం తో పాటు అన్ని రంగాల్లో కనీస సౌకర్యాలు మృగ్యం. ఎక్కడ ప్రారంభించి ఎటు సాగాలో తెలియని అగమ్యగోచరంగా ఉన్న స్థితి. ఈ స్థితిలో పంచవర్ష ప్రణాళికలు వంటి దీర్ఘ కాలిక పథకాలు, అంతర్జాతీయంగా ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులలో అమెరికా, రష్యా కూటముల సహకారం తీసుకుని వాటిని సమాన దూరంలో ఉంచడానికి అలీన విధానం వంటి ప్రగతిశీల మార్గాల వైపు పయనానికి , ఆలోచనలకు ఊపిరి పోసింది ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అనేది నిర్వివాదాంశం.
తొలి లోక్ సభ, రాజ్యసభ సభ్యులుగా ఎక్కువ మంది స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తి గలవారు ఎన్నిక కావడం, రాజ్యాంగ సభ అధ్యక్షులు డా.రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి కావడం, బహుముఖ ప్రజ్ఞాశాలి, సోషలిస్టు, లౌకికవాది, ప్రజాసంక్షేమం, దేశ ఔన్నత్యాన్ని కాంక్షించే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా సేవలందించడం , వివిధ పార్టీల నాయకులు పరస్పర సహకారంతో సభను నడిపించడంతో స్వాతంత్ర్య భారత తొలి పార్లమెంటు ఆదర్శంగా నిలిచింది.
-------------------------------------------------------------------------------------------------------------------
చౌధరి రాధాకృష్ణ, గాంధేయవాది
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, శ్రీకాకుళం.








addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి