సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల భోగోజు సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -239: - ఆశికానికి అత్తనవుతనంటే కూతుర్నిచ్చి పెండ్లిజేయమన్నడట
****
"గిదేందవ్వా! గిస్మంటి ఇచ్ఛింత్రం యాడ్నన్న సూశినవా?" వొయిసు పెర్గినా వొయిసుకు దగ్గ పెద్దిర్కం ఉండదెందుకో? గా యిష్యాన్ని నవ్వుతాలుకి తీస్కోవాల్నా? నాల్గు సప్పరిచ్చినట్టు మాటల్తో ఎగబడాల్నా అర్తం కాట్లే! "
 " ఏమిచ్ఛింత్రం శెల్లే? గంత గుస్సైతున్నవ్! అసలు కతేందో శెప్పకుంటే నాకెట్ల తెలుత్తది? "
 " కాదవ్వా!ఎందుకో గది నవ్వుతాల్కే తీ అన్నా.మన్సెందుకో ఒప్పట్లే.గట్లెందుకనాలె గంత సులకనా ఆడివిల్లంటే అనిపిచ్చింది."
 " అవును శెల్లే! ఆడివిల్లంటే శానా మందిరి సుల్కనగ సూత్తరెందుకో.గట్ల సూశేటప్పుడు,అనేతప్పుడు వాళ్ళింట్లోళ్ళు యాదికి రారో ఏమో! ఎట్లవడ్తే గట్ల మాట్లాడ్తరు. గింతకీ ఏ ఆడివిల్ల ముచ్చెటి శెల్లే? ఎవలేమన్రు?
గదే నవ్వా! గీ నడ్మల ఆశయ్య తాత పెండ్లాం.గిట్లనన్ని ఏమన్కోకు మస్తు కోపమొత్తాంది మరి.వర్సకి తాత గని వొయిసు యాబై నడ్మిట్లకి వొచ్చింది.గీ నడ్మల గా యవ్వ బీపి రోగం పెర్గి తల్కాయల నరాలు శిట్లి సచ్చిపోయింది. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్ళు కొడ్కు పెండ్లిళ్ళు అయి మన్వళ్ళు, మన్వరాళ్ళు సుత ఉండ్రు.
 " మొన్న పెద్దవ్వ మన్వరాలి లగ్గానికి ఎల్లినం గద. గాడ దూరపు సుట్టిర్కం అంట ఒకామె వొచ్చింది.తాత్తో గా మాట గీ మాట మాట్లాడుకుంట వొర్సలేవో తీసి సూత్తె తాత వాళ్ళ నాయినకి శెల్లొర్స అయిద్దంట.గామె వొయిసు ఎంతన్కుంటున్నవ్? గీ తాత బిడ్డ వొయిసు.గామె జర సర్దా మన్షి. అందర్తో మంచిగ కల్శిపోయి మాట్లాడింది."
 "గింతకీ అస్లిషయం ఏంటంటే తాతని బట్కొని  అయితే వర్సకి నేను అత్తనయిత కదా అందట."
అవునని సంబుర పడ్కుంట అక్కడే తిర్గుతున్న గామె బిడ్డను జూశి, నీ బిడ్డనిచ్చి లగ్గం జెయ్యరాదు. వొర్స సుత కల్శింది. మా యామె కాలం జేసింది. నీ బిడ్డను పువ్వుల్ల బెట్టి సూస్కుంట అనబట్టిండు."
 " మొదగాల నవ్వుతాల్కి ఆట బట్టిత్తుండేమో అన్కున్న గనవ్వా! గామెను వొక్క తీర్గ అడుగుడు. ఆత్తిపాత్తులు రాశిత్తననుడు. పాపం గామేమో ఆశికాన్కి అంటే గిట్ల ఎంట బడ్తుండేందని తెల్లబోయింది. పిల్ల సద్వుగాలేదు ఇంకా శిన్న పిల్ల. మీ వొయిసుకు గస్మంటి మాటలు బాగుండవు అంటుంటే ఎన్కట ఆరేండ్ల పిల్లని అర్వై ఏండ్లోళ్ళు సేస్కోలేదా అంటుండవ్వా! గందుల నేనెందుకు దూరాలె అని సూశిన గని రకతం సలసల మస్లిపోయిందన్కో...''
గిదింటుంటే శెల్లే! ఎన్కటి సామెతోటి యాది కొచ్చింది. పెళ్ళాం సచ్చిపోయి కాటికి కాళ్ళు సాస్కున్న ముసలోన్ని "తాతా!వొంటర్గ ఉన్నవు. గీ వొయిసుల తోడొకలు ఉంటె మంచిగుంటది గదా" అంటే  పిల్లనెవరు ఇత్తలేరు పెండ్లి జేస్కుందమంటే"  అన్నడంట. గా అడ్గినాయన తెల్లమొగమేసి" గీ ముస్లోడికి గిదేం మాయ రోగం.తోడంటే ఇంగ పెండ్లమేనా ఏంది! ఆడోళ్ళో మొగోళ్ళనో ఎవల్నన్న ఒకల్ని ఇంట్లె పన్కి తోడుకు పెట్టుకొమ్మని అంటే గీ ముస్లోడి మన్సులో గదుందా అన్కుని బుగ్గలు నొక్కుకుంట ఎల్లిపోయిండంట. గట్లుంది గీ కత శెల్లే!"
" ఆశికానికి అత్తనవుతనంటే కూతుర్నిచ్చి పెండ్లిజేయమన్నడట" అంటే ఏందో అన్కున్న గిదన్న మాట"
"అవునవ్వా! ఇంగ మన్సు ఆగక సాటుకు పిలిత్తే రాయబారం శేత్తనేమో అన్కుంట పంచె ఎగదోస్కుంట వొచ్చిండు. ఇంగ సూస్కో శెడామడా నాల్గు దుల్పిన. కిక్కురుమనకుండా ఎవలికన్న తెలిత్తె పర్వుబోద్దని దండం బెట్టి వోయిండు. గామె నా శేతులు బట్కొని రచ్చించినవని కండ్ల నీళ్ళు బెట్టుకొంది."
 " మంచి పని జేశినవ్ శెల్లే! గస్మంటోళ్ళను ‌సాటుంగ కాదు నేటుగనే అందరిముందు నిలవెట్టి దుల్పాలే.గప్పుడు గని బుద్ధి రాదు."
 గదండీ సంగతీ "  ఆశికానికి అత్తనవుతనంటే కూతుర్నిచ్చి పెండ్లిజేయమన్నడట అంటే గిదే మరి" .
కామెంట్‌లు
Popular posts