వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
108. షట్చక్రోపరిసంస్థితా (అష్టాక్షరీ)
నూట ఎనిదవ నామ మంత్రము:
ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః
షట్ = ఆరు; చక్ర = మూలాధార మొదలగు చక్రరములు; ఉపరి = పైన; సంస్థితా = ఉన్నట్టిది; మూలాధారా మొదలైన ఆరు చక్రముల పైన ఉన్నది.
మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అను ఆరు చక్రముల పైన ఉన్న సహస్రార పద్మము లో స్వస్వరూప దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను "షట్చక్రోపరిసంస్థితా" అని కీర్తించి తరించారు. ఆజ్ఞా చక్రంలో కనిపించీ కనిపించకుండా ఉన్న దేవి, తన పూర్ణ రూపాన్ని చూపించి అనుగ్రహిస్తున్న పరాత్పరికి నమస్కారము.
సాధకుడు, తన సాధనా మార్గ ప్రయాణంలో, మూలాధార చక్రంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలను సుషుమ్న మార్గములో సహస్రార పద్మమును చేరుకుంటాడు. ఈ సహస్రార పద్మము, బ్రహ్మరంధ్రానికి కొంచెం క్రింద ఉంటుంది. ఆ సహస్ర దళ పద్మము యొక్క ఎడమ చెవిలో ఉన్న చంద్రమండలం మధ్యలో అమృత సాగరంలో, శ్రీమన్నగరంలో, మణిద్వీపం లో వున్న త్రికణంలో శంభుని తో కూడిన కుండలినీ శక్తి దర్శనం ఇస్తోంది.
మణిద్వీపం లో, చింతామణి గృహంలో ఉన్న అమ్మ పంచబ్రహ్మ సింహాసనం మీద కూర్చుని ఉంది. ఈ పంచబ్రహ్మ సింహాసనం ఆరు చక్రములు, మూడు గ్రంధులకు పైన ఉన్నది. కనుక, శ్రీమాత "షట్చక్రోపరిసంస్థితా" అయ్యింది.
బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు ఐదుగురు కూడా శ్రీమాత యొక్క సేవకులే. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరలు నలుగురూ అమ్మ సింహాసనానికి నాలుగు కోళ్ళు గా ఉన్నారు. ఇక సదాశివుడు, సింహాసనం పైన మెత్తని పరుపు లాగా అమరి, పరమేశ్వరి సేవలో ఉన్నాడు. ఈ విధంగా ఏర్పడిన సింహాసనం పైన కూర్చున్న అమ్మ, తన నుండి వెదజల్లపడుతున్న ఎర్రని కాంతుల వెలుగులో, సదాశివతత్వాన్ని కూడా ఎర్రగా మార్చేసి, శివా శివుల అర్థనారీశ్వర తత్వాన్ని మరొక్కసారి చూపిస్తూ, జగన్మాత, తాను "షట్చక్రోపరిసంస్థితా" అని చెప్పకనే చెప్పింది.
ఈ విధంగా ఆరు చక్రములను, మూడు గ్రంధులనూ దాటి, బ్రహ్మరంధ్రానికి క్రింద, ఏ సాధకుడు, తనను ఏ వేళలో పిలుస్తాడో, ఆ తత్క్షణమే అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి