సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -245: ఆకాశం పొడవు ఆకాశమే ఎరుగు అంటే
****
 "నిజ్జంగా గా మడిషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవ్వా! మడిషంటే గట్లుండాలె. ఏం తింటడో ఎట్లుంటడో తెల్వదు! యాన్నించి ఆమ్దాని వొత్తదో తెల్వదు. ఊల్లె ఎవలికి కట్టం వొచ్చినా నేనున్న అని ముందుకొత్తడు."
 
 "ఎవలు తమ్మీ!  నీ మన్సుకు గంత గనం నచ్చిండంటే గా మడిషి మాములోడు కాదు శానా గొప్పోడే అయ్యుండాలె."
 "గాయనే అవ్వా! మనూల్లె పెద్ద దేవిడీ ఇల్లుంది సూడు గండ్ల ఓ పెద్దాయన ఒక్కడే ఉంటడట.గా ఇంట్లె ఎన్కట పదిర్వై మంది పనోళ్ళు నౌకర్లు శాకర్లతో ఎప్పుడు సూశినా కళకళ్ళాడుతూ ఉండేదంట. గిప్పుడు అయినోళ్ళు కన్నోళ్ళు అందరూ పట్నంల బత్కుతమని పొలాలు శెల్కలు అమ్ముకొని బోయిండ్రు. గీ పెద్దాయన ఒక్కడే గిది తరాల ఇల్లు.ఇందులోనే నేను జీవిడిశే దనుక ఉంటనని ఎవ్వలు జెప్పినా యినకుండ ఉంటున్నడు.ఒక్క పాలేరు రామయ్య తాత తప్పనిడిశి గా ఇంటి ఆంకల ఎవ్వలు బోరు. గాయన సుత ఎన్కటోలె బయిటికి రాడంట. ఏ ముచ్చెటి అయినా రామయ్య తాతనే. గిప్పటికి సుత రకరకాల వొయ్యిలు ముందేస్కుని సద్వుతడంట. ఊళ్ళే ఎవలికన్న ఆపతి వొచ్చిందని తెలిత్తే రామయ్య తాతతో పైసలు పంపి ఆదుకుంటడవ్వా!"
 నిజమే తమ్మీ!గాయినోళ్ళు శానా గొప్పోళ్ళు శిన్నప్పుడు నా ఈడు ఆడివిల్లలు ఆళ్ళింట్ల ఉంటే అప్పుడప్పుడు ఎల్లేదాన్ని. అమ్మ నాయిన గాళ్ళు పెద్దోళ్ళు.ఎప్పుడు పడ్తే అప్పుడు పోవద్దని శెప్పేది. రాన్రానూ పెద్దయినంక పోవుడు ఆపిన. గా ఇంట్లె ఎవలెవలు ఉంటరో తెల్వదు. గిప్పుడు శెప్పినంక తెల్శింది గా పెద్దాయిన వొక్కడేనని. గింతకీ గాయిన ముచ్చెటి ఎందుకొచ్చింది తమ్మీ!"
గజ్జెప్పనీకే వొచ్చినవ్వా! గా పెద్దాయిన గియ్యాల పొద్దుగాల కాలం జేశిండంట. రామయ్య తాత నెత్తి గొట్టుకుని ఏడ్సుకుంట నా తానికి వొచ్చి శెప్పిండు. గింత దనుక ఎవ్వలూ గా యింటి గడ్ప దొక్కే సాసం జెయ్యలేదంట. గిప్పుడు పిలిత్తే అద్రుకు సత్తుండ్రు.  నా దోత్తుగాళ్ళని దీస్కోని బొయిన. గాయిన కీసల సెల్లుంటే గాయిన సుట్టపోళ్ళు అందర్కి యిష్యం జెప్పి. గాళ్ళకి ఆయిన్ని అప్పగిచ్చి తానం జేసి ఇటొచ్చినవ్వా!"
అయ్యో తమ్మీ! దానమయ్యే దనుకనన్న ఉండొద్దా గట్లెట్ల వొచ్చినవ్?"
 "అవ్వా గా పెద్దాయన గాయిన పెయ్యిని పెద్ద దవాఖానాకి దానమిచ్చిండంట.గాళ్ళు గాయిన్ని జాగర్తగా ఐసు పెట్టెల బెట్కొని బోయిండ్రు. ."
 "అవునా తమ్మీ! నిజ్జంగా గీ లెక్కన సూశినా గా పెద్దాయిన శానా గొప్పోడు తమ్మీ!"
 "అవునవ్వా ఆకాశమంత మన్సున్నోడు. ఇంకేం జేశిండో తెల్సా? గాయిన ఉన్న గా దేవిడీ ఇల్లు, ఆకిలిని  సర్కారు బడికి రాశిండటవ్వా! ఇంకేమేమో ఆత్తిపాత్తులు ఉంటే ఆటన్నిటికి ఈలునామాలు రాశిండంట. గవే ఎవలికో ఎందో గా పెద్ద దినమై వాళ్ళోళ్ళు వొచ్చినంక తెలుత్తదట. ఊల్లె అందరు గిదే ముచ్చటి.ఏం రాశుంటడు.ఏం జేశింటడని" నాకు సుత గదేందో జెల్ది తెలిత్తె బావుండని ఆత్రంగుంది.
 అవును తమ్మీ! ఆకాశం పొడువు ఆకాశానికే  తెలుత్తదని! గా పెద్దాయినోళ్ళ కంటే గాయిన పెద్ద మన్సుతో రాశిన ఈలునామాల వల్లనే తెలుత్తది!"
"అంతే అంటవా అవ్వా! సుబూది అయితనే ఉన్నయి గద గాయిన జేశిన మంచి పన్లు సూత్తుంటే గవి సుత బయటికొత్తనే ఆకాశమంత గొప్పాయిన మన్సు ఎలాంటిదో ఎర్కయితది!"
"గదండీ సంగతి! గొప్పోళ్ళు ఎప్పుడు తమ గొప్పలు శెప్పుకోకుండనే ఆకాశమంత పెద్ద గుణంతో ఉంటారు.గాళ్ళకి ఎవలూ సాటి రారు. గస్మంటోళ్ళు  ఏమాశించకుండ సేశే మంచి పన్లు జూసి మన పెద్దోళ్ళు గిస్మంటి సామెత పుట్టించిర్రు. "ఆకాశం పొడవు ఆకాశమే ఎరుగు అంటే గిదే మరి". 


కామెంట్‌లు
Popular posts