సోసియబుల్ వీవర్!: - - యామిజాల జగదీశ్
 

దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించే పక్షులివి.
ఈ పక్షులు నిర్మించుకునే గూటికో ప్రత్యేకత ఉంది. అంతేకాదు అది చూస్తుంటే చిత్ర విచిత్రమన్పిస్తుంది. 
అపార్ట్ మెంట్ ఇళ్ళ గురించి మనందరికీ తెలుసు. నగరాలలో స్థలం కొరత కారణంగా ఎత్తయిన కట్టడాలు పునాదులేసుకున్నాయి.
కొందరు యజమానులు వాటిల్లో ఉంటే ఇంకొందరు అద్దెలకిచ్చుకుంటారు.
మనుషుల్లా Sociable Weaver అని పేరు గడించిన ఈ పక్షులు కూడా అపార్ట్ మెంట్ జీవితాన్నే ఎంపిక చేసుకోవడం విశేషం.
కానీ ఈ పక్షులు అద్దెలు వసూలు చేయవు. అన్ని పక్షులు ఒక్కటిగా కలిసి ఈ గూటిని కడతాయి. 
అనంతరం తాము నివసించడానికి ఆ గూటినే కేంద్రంగా చేసుకుంటాయి. అంటే అది వాటి నివాసస్థావరమన్న మాట.
చెట్లు, ఫోన్ స్తంభాలు ఇలా ఎత్తయిన చోట్ల సువిశాలంగా గూళ్ళను కట్టుకుంటూ చూపరులను ఆకర్షిస్తాయి. 
ఏడున్నర మీటర్ల (25 అడుగులు) వెడల్పున పాక, ఒకటిన్నర మీటర్ ఎత్తు ఉండేలా ఈ పక్షులు గూటిని నిర్మిస్తాయి. 
ఇందులో మూడు వందల గదులుంటాయి.
అన్ని పక్షులూ ఈ గూటిలోకి ప్రవేశించి అన్నీ కలిసి బయటకు రావడానికి ఒకే ప్రవేశద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అంటే అందులో నుంచే రాకపోకలన్నీ ఉంటాయి. పైగా ఇంకో విచిత్రమేమిటంటే ఒక్కో గదిలో ఒక్కో జంట నివసిస్తాయి. అవి ఎంతో సఖ్యంగా ఉంటాయి. వాటిని చూసి ఐకమత్యంగా ఎలా ఉండాలో మనిషి నేర్చుకోవాలంటే అది అతిశయోక్తి కాదు.
అందుకే అంటాను...
విచిత్రమైన గూడు! విశేషమైన జీవనం!
కామెంట్‌లు
Popular posts