మన జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ కొన్ని సమస్యలు మనసులో ఉండిపోతాయి, అవి మన ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కాల్చేస్తాయి. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి, బాధపడాలా,పారిపోవాలా,లేక ఎదుర్కోవాలా.
రామాయణంలో హనుమంతుడు మనకు ఒక గొప్ప సొల్యూషన్ ని ఇచ్చాడు. సీతమ్మను వెతుకుతూ లంకకు వెళ్లిన హనుమంతుడు తన ధైర్యం, తెలివితేటలతో రావణుడి సభలో నిలబడ్డాడు. కోపంతో ఊగిపోయిన రావణుడు హనుమంతుడి తోకకు నిప్పంటించమని ఆజ్ఞాపించాడు. శత్రువులు అవమానించాలనుకున్నారు. కానీ హనుమంతుడు ఆ అవమానాన్ని అవకాశంగా మార్చుకున్నాడు.
తోకకు నిప్పు అంటగానే కూర్చొని ఏడవలేదు. “నాకు నిప్పు పెట్టారా" అని బాధపడలేదు. అదే నిప్పుతో లంక వీధుల్లో తిరుగుతూ లంకను దహనం చేశాడు. తనకు వచ్చిన కష్టాన్ని శత్రువు నాశనానికి ఆయుధంగా మార్చుకున్నాడు.నేటి జీవితంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.ఎవరైనా విమర్శించారా, ఆ విమర్శను మీ ఎదుగుదలకు ఇంధనంగా మార్చండి.ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేశారా,మీ ప్రతిభతో సమాధానం చెప్పండి.విఫలమయ్యారా,ఆ అనుభవాన్ని విజయానికి పునాదిగా మార్చండి.జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక నిప్పులాంటిదే. అది మనల్ని కాల్చేయవచ్చు లేక మనలోని బలాన్ని వెలిగించవచ్చు. నిర్ణయం మనదే.
హనుమంతుడు మనకు నేర్పింది ప్రతీకారం కాదు, పరివర్తన. శత్రువు ఇచ్చిన నిప్పునే తన విజయానికి సాధనంగా మార్చుకున్నాడు. అదే జీవన నైపుణ్యం.అందుకే జీవితం మనపై నిప్పులు చెరిగినప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట ఒక్కటే
"కాలితే కాలిపోవద్దు, కాలితే కాల్చేయటమే"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి