అలకలల్లలాడగగని...! ------------------------------ అలకలల్లలాడగగనీ.... ఇది త్యాగరాజు కృతి. మధ్యమావతి రాగం. రూపక తాళం. అలకలల్లలాడగగనీ - ఆ రాణ్ముని ఎటు పొంగెనో / చెలువు మీరగను మారీచుని మదమణచే వేళ / ముని కనుసైగ తెలిసి శివధనువు విరిచెడి సమయ / మున త్యాగరాజ విను - తుని మోమున రంజిల్లు/ ఈ కీర్తన మా నాన్నగారికి ఇష్టం. ఆయన చాలా సార్లు ఈ కీర్తన ఆలపించడం నేను విన్నాను. వాల్మీకి రామాయణంలో శివధనుర్భంగం ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. క్షత్రియుడి సహజ లక్షణం వీరత్వం. తాటకిని సంహరించినప్పుడు మారీచుడిని వేయి ఆమడల దూరానికి విసిరేసినప్పుడు విశ్వామిత్రుడి కనుసైగనే ఆజ్ఞగా స్వీకరించి శివుడు విల్లును ఎక్కు పెట్టినప్పుడు తన శౌర్యప్రతాపాలను గొప్పగా ప్రదర్శించాడు రాముడు. ఆ సమయంలో అతని ముంగురులు చక్కగా అల్లలాడాయి. ఆ అలకల కదలికల వల్ల వన్నె వచ్చిన రాముడి ముఖారవిందాన్ని చూడటానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. తనకు పట్టిన ఆ అదృష్టానికి విశ్వామిత్రుడు ఎంత పొంగిపోయి ఉంటాడో కదా అని త్యాగరాజు ఈ కీర్తన ద్వారా మురిసిపోయారు. మా నాన్నగారికి సంగీతం మీద పట్టు లేకపోలేదు. విజయనగరంలో ఉన్న రోజుల్లో ఓసారో నాన్నగారు ఆదిభట్ల నారాయణ దాసుగారింటికి వెళ్ళారు. సంగీతం గురించి ప్రస్తావన వచ్చింది. దాసుగారు ఓ మూల ఉన్న తంబూరా తీసుకురా అని మా నాన్నగారితో చెప్పారు. అలాగే అంంటూ నాన్నగారు తంబూరాను దాసుగారికి అందించారు. దాసుగారి శ్రుతి సారించి అర గంట సేపు "సా" అని పట్టు పట్టరా అన్నారు నాన్నగారిని. అప్పుడు నాన్నగారు "బాబోయ్ ! అంతసేపు నా వల్ల కాదు. గుండెలు పేలిపోతాయి" అన్నారు. "ఒరేయ్ పాటకు శ్రుతి ప్రాణం. అది నాభి నుంచి ఉత్పన్నమై రాగ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ వెన్ను నుంచి సహస్ర చక్రానికి వెళ్ళి అక్కడ అమృత స్థాయిగా మారుతుంది. తర్వాత హృదయకోశానికి వచ్చి కంఠాన్ని ఆశ్రయించి ముఖతః నిండుగా బహిర్గతం కావాలి. అనునాసిక కాకూడదు. అలా శ్రుతి పక్వమైతే గానం అమృతత్వాన్ని పొందుతుంది. దానిచే పాడిన వాడూ విన్నవాడూ అమృతత్వాన్ని పొందుతారు. నీకు సంగీతం రాదు. అయినా సంసారతరణ సాధనంగా అమ్మ నీకు ఒక జోలె ఇచ్చింది. అది చాలును. అన్ని జోలెలూ నీకే రావాలంటే ఎలాగ? నువ్వు నారాయణ దాసువా?" అని దాసుగారన్నారు. అయితే నాన్నగారు " శాపం పెట్టారన్న మాట" అని అంటే దాసుగారిలా అన్నారు - "అబ్బే శాపం కాదురా! నీకు సంస్కృతం వచ్చు. సంగీతానికి సంబంధించే శాస్త్రం ఆ భాషలో ఉంది. ఐది ఒకమారు చూడు. దాని స్వరూప స్వభావాలు తెలుస్తాయి. గాయకుణ్ణి దారి తప్పితే చెవులు పట్టి ఆడించవచ్చు. తాళ పద్ధతులు చెప్తాను" అంటూ సప్తతాళాలు వంటివి నేర్పారు. "నీ హృదయంలో చక్కని లయ జ్ఞానం ఉంది. అలాగే గాన స్వరూపస్వభావాలు తెలుస్తాయి. ఇది నా వరమనుకో" అని దీవించారు నాన్నగారిని దాసుగారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు