ఉమర్ ఖయ్యామ్---జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కలిగే ఆనందమే మధువు అని ఉమర్ ఖయ్యామ్ మాట. ఆయనకు ఈ లోకం ఒక మధుశాల. ఈ క్రమంలోనే ఆయన " గ్లాసుని మధువుతో నింపు! గడిచిపోయిన వాటి గురించిన విచారాలను, రేపటి గురించిన భయాలను మనసులోంచి కడిగెయ్యాలి. ఈ క్షణాన్ని, నిశ్చల నిర్విచార సమాధిలో నిలుపగల ఉజ్వల మధువుతో నింపు! రేపు నేను ఎన్నో ఏళ్లను కలిపేసుకున్న నిన్నటిలో కలిసిపోతానేమో ఎవరికి తెలుసు?'' అంటాడు. జీవితం పట్ల ప్రేమ, మరణాన్ని గురించిన వైరాగ్యం ఈ రెండూ ఖయ్యామ్ రుబాయీల్లో సమాంతరంగా సాగిపోతాయి. ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను తెలుగులో ఎందరెందరో అనువదించారు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు 1934లో "పానశాల" శీర్షికన అనువదించారు. ఆయన అనువాద రుబాయిలకు ఎంతటి పేరొచ్చిందో అంతకు రెట్టింపు ఆయన పారసీక సాహిత్యాన్ని గురించీ, ఉమర్ ఖయ్యామ్ గురించి రాసిన ఉపోద్ఘాతానికీ లభించింది. ఇంగ్లీషులో ఉమర్ ఖయ్యామ్ రుబాయిలను ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ 1859లో అనువదించారు.ముప్పయ్ ఎనిమిదేళ్ళ క్రితం నాటి మాట. మా నాన్నగారు కూడా "ఉమర్ ఖైయామ్" పేరిట తెలుగు చేసిన పుస్తకం అచ్చయ్యింది. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు అప్పటికి యాభై ఏళ్ళ క్రితం సంస్కృతంలో రాసిన ఉమర్ ఖైయామ్ పుస్తకాన్ని కర్రా ఈశ్వరరావుగారు మా నాన్నగారికి ఇచ్చి తెలుగులోకి అనువదించమన్నారు. అది చదివిన మా నాన్నగారికి మొదట ఉబలాటమూ వెరపూ కలిగాయి. అసాధ్యమనే అనుకున్నారు. కానీ గురువుగారైన నారాయణదాసుగారి సంస్కృత పుస్తకాన్ని తెలుగులోకి అనువదిస్తే ఎంతో కొంత పేరొస్తుందనే ఆశతో సరిగ్గా ఇరవై రోజుల్లో పూర్తి చేశారు. దరిదాపుగా డెబ్బయ్యోపడిలో అంటే 1932 ప్రాంతంలో పారశీకం అభ్యసించి నారాయణదాసుగారు ఉమర్ ఖయ్యామ్ కవితకు అనుగుణంగా సంస్కృతం రూపుదిద్దిన కావ్యమిది. సంస్కృతం, తెనుగు భాషలలో వారికున్న వైదుష్యానికి ఇది చలివేంద్రం. అటువంటి ఉత్కృష్ట స్థాయినున్న కావ్యాన్ని తెలుగు చెయ్యడానికి ప్రోత్సహించిన కర్రా ఈశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పుకున్నారు నాన్నగారు. (కర్రా ఈశ్వరరావుగారు నారాయణదాసుగారికి సమీపబంధువు. దాసుగారు వరుసకు తాతగారవుతారు) దాసుగారు ఉమర్ ఖయ్యామ్ ను ప్రశంసిస్తూ సంస్కృతంలో రాసిన వ్యాసంతో సహా మా నాన్నగారు తెలుగులోకి అనువదించారు. కార్యంతో కారణాన్ని గ్రహించినట్టే కావ్యంతో కవిని విమర్శించి తెలుసుకోవాలన్నది దాసుగారి మాట. మాననీయుడైన పారసీకవి ఉమరుడు అమరసింహునకు సమకాలికుడైన ప్రసిద్ధ కవిచంద్రుడిగా అభివర్ణించారాయన. తాగి తాగి మళ్ళీ మళ్ళీ తాగు. నేల మీద తెలివి తప్పి పడే దాకా తాగు. అలా తాగటం మూలాన జీవన్ముక్తుడవవుతావు. సందేహం లేదు" అనే లోకోక్తి తత్వం తెలుసుకుని భక్తియోగియైన భాగవతోత్తముడు ఉమర్ మహాకవి శుష్క కర్మిష్ఠులు, ఛాందసులు, అరసికులు కర్మబాహ్యుడని ఆ భాగవతోత్తముణ్ణి ఆక్షేపిస్తారు. అందువల్లనే ఆ మహాత్ముడు తన కావ్యంలో ఆదంభాచారులను శ్రోత్రియులమని తమను తాము పొగుడుకునే ఆ మూర్ఖులను సంగీత సాహిత్య రసం తెలియని ఆ పశుప్రాయులను చిత్తుగా తెగనాడాడని దాసుగారి మాట. మా నాన్నగారి అనువాద పద్యాలను ఒకటి రెండు ఇక్కడ ప్రస్తావిస్తాను.... రమ్ము చెలికాడ! మనము మోదమ్ముతో గ డించినట్టి నదెల్ల లెక్కించవలెను వలదు రేపటి దిగులు ఈ వసుధ వీడి పోక ఉన్నంతదనుక మున్ పోయినట్టి ఏడు వేలేండ్ల పెద్దలకు ఈడు మనము. (పద్యం 21) నామది అదెంతైన ని న్గాన బోదు నా మది తలంపులోన కన్పడవు నీవు నీ స్వరూప మొకింతేని నే నెరుంగ నిను వినా ఎవ్వడెరుగును నీదు గొప్ప(పద్యం 37) ఈ పుస్తకానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారులు బుజ్జాయిగారు ముఖచిత్రాన్ని చిత్రించారు. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు