ఇదో భాగోతం: - నేను మద్రాసు బ్రాంచ్ వార్త ఆఫీసులో పని చేస్తున్న రోజులు. అణ్ణానగర్లో ఆఫీసు. తోట భావనారాయణగారు ఇన్ చార్జ్ మాకు. నేను‌, బొల్లంరాజు, రాజా శ్రీహరి సహ ఉద్యోగులం. ఓ ఆదివారం మిగిలిన వారి కంటే నేను ముందు వెళ్ళి ఆఫీస్ తలుపులు తెరిచాను. సిస్టం ఆన్ చేసిన కాస్సేపటికే ఓ కోయరాజు వచ్చాడు. తనకు తిరుపతి "వార్త" కార్యాలయ మేనేజర్ తెలుసునంటూ మాటలు మొదలుపెట్టి తన దగ్గర ఫోటోలు చూపించాడు. సినీ ప్రముఖులతోనూ, కొందరు రాజకీయ నాయకులతోనూ తను తీయించుకున్న ఫోటోలన్నీ చూపిస్తూ ఏ ఏ సందర్భాలలో అవి తీసిన ఫోటోలో వివరించాడు. అనంతరం జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను అంటూ కుర్చీలలో కాకుండా నేలమీద కూర్చుందాం అన్నాడు కోయరాజు. సరేనని మేనేజర్ కూర్చునే క్యాబిన్లో నేలమీద కూర్చున్నాం. నా పేరు, ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నదీ అడిగితే చెప్పాను. తర్వాత ఓ ఏటవాలు బల్లలాంటిది ఉంటే కావాలన్నాడు. సిస్టమ్ పక్కనే మేం స్క్రిప్ట్ పెట్టుకునే ఓ ఏటవాలు బల్ల ఉంటే తెచ్చిచ్చాను. అది నా ముందు పెట్టి నా వేలికున్న ఉంగరం తీసిమ్మన్నాడు. ఇచ్చాను. దాన్ని ఏటవాలు బల్ల అగ్రభాగంలో ఉంచాడు. చూడు చూడు దొరా అది కిందకు జారకుండా అక్కడే ఉంటే మీకు రోజులు బాగున్నట్టేనని, జారితే ఎదురయ్యే కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తానన్నాడు. అలా అనడంతో ఉంగరంవైపే చూస్తున్నాను. ఒకటి రెండు క్షణాల తర్వాత అది నెమ్మదిగా కిందకు జారసాగింది. అది చూసి మనసులో ఏదో ఆందోళన. అప్పుడతను "దొరా! నువ్వీ ఉంగరం ఇక పెట్టుకోకూడదు. నాకిచ్చేసే. నీకెదురయ్యా కష్టాన్ని ఎలా దాటాలో చెప్తాను" అన్నాడు.అప్పుడు నేనన్నాను "ఇదిగో ఏదైతే అదేఏ అవనివ్వు. ఈ ఉంగరం మాత్రం మీకివ్వలేను. ఇది మా అత్తగారి గుర్తుగా దాచుకున్న ఉంగరం. ఇవ్వడం కుదరదు గాక కుదరదు అని అతని చేతిలోంచి తీసేసుకుంటే అప్పుడా ఉంగరానికి కట్టిన సన్నని దారం కనిపించింది. ఆ దారాన్ని అతనెప్పుడు నా కళ్ళు కప్పి కట్టాడో తెలీలేదు. "ఉంగరం ఇవ్వకుంటేసరి. ఓ రెండు వందల రూపాయలు ఇవ్వు" అన్నాడు. "అబ్బే నా దగ్గర అంత డబ్బులేదు" అంటూ జేబులోంంచి డబ్బు బయటకు తీసి లెక్కపెట్టి అరవై ఆరు రూపాయలున్నాయి" అన్నాను." సరే. అయితే ఆ అరవై ఆరు రూపాయలూ ఇచ్చేసే" అని నుదుటి దగ్గర.చెయ్యి పెట్టి కళ్ళు మూసినట్లు మూసి తెరచి నాకర్థంకాని మాటేంటో చెప్పాడు. ఆ సమయంలో ఏదో భయంలాంటిది కలగడంతో డబ్బులిచ్చేసాను. అవి తీసుకుని వెళ్ళిపోయాడు మరొక్క మాటకూడా చెప్పకుండా. అతను వెళ్ళిన ఓ అరగంటకు శ్రీహరి, బొల్లంరాజు వచ్చారు. వాళ్ళతో కోయరాజు విషయం చెప్పాను. మేమొస్తామని తెలుసు కదా? కాస్సేపు అవీ ఇవీ మాట్లాడి ఉండనిస్తే అతని విషయం చూసేవాళ్ళం కదా అన్నారిద్దరూ. కోయరాజుని చూసి భయపడటమేంటీ అన్నారు. ఆరోజు తర్వాత మరెప్పుడూ ఆ కోయరాజు మళ్ళా కంటపడలేదు.ఇదీ కోయరాజు సంఘటన.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు