భిక్ష - దీక్ష (కథ) --- నారంశెట్టి ఉమామహేశ్వరరావు--సిద్ధార్థుడు రాజ్యాన్ని, సంసారాన్ని విడిచిపెట్టి బుద్ధుడై ధర్మప్రచారం ప్రారంభించాక పటిష్టమైన ఆశ్రమ వ్యవస్థ ఏర్పడింది.బుద్ధుడి బోధనలను ఇష్టపడి అనేక మంది దీక్ష స్వీకరించి శిష్యులై బుద్ధుడి బోధనలను ధర్మప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ కొందరు కొత్తవారు వచ్చి బుద్ధుడి దగ్గర దీక్ష పొందేవారు. అర్హులైన వారికి మాత్రమే దీక్ష ప్రసాదించేవాడు తప్ప అనర్హులను చేరనిచ్చేవాడు కాదు బుద్ధుడు.ఒకసారి ఒక సంపన్న యువతి బుద్ధుని దర్శించుకుని దీక్ష ఇమ్మని , శిష్యురాలుగా స్వీకరించమని వేడుకుంది. ఆమెను పరిశీలించి ‘కొన్ని రోజులు తరువాత దీక్ష చేస్తాను. నీలో ఉన్న దుర్గుణాలను ముందు దూరం చేసుకో” అని పంపించేశాడు బుద్ధుడు.సంపన్న యువతి నిరాశగా వెనుదిరిగింది. బుద్ధుడి మీద కోపం పెంచుకుని అదను కోసం చూసింది. కాలం గడుస్తోంది. ఒక మాసం తరువాత బుద్ధుడు భిక్ష కోసం వీధుల వెంట తిరుగుతూ సంపన్న యువతి ఇంటి ముందు నిలబడి “భిక్షాoదేహి” అని యాచించాడు.సంపన్న యువతి మేడ మీద నుండి బుద్ధుణ్ణి చూసి “నా పాదాల దగ్గరకే వచ్చాడు కదా భిక్ష కోసం “ అని గర్వంగా అనుకుంది.భిక్ష తీసుకుని బుద్ధుని ముందుకు వెళ్ళింది. బుద్ధుని వైపు, చేతిలోని భిక్షాపాత్ర వైపు ఏహ్యభావంతో చూసి “ఏమయ్యా సన్యాసి ! భిక్షా పాత్ర ఇంత మట్టి గొట్టుకుని ఉంటే భిక్ష ఎట్లా వేయమంటావు ?” అని ఈసడించుకుంది. బుద్ధుడు నవ్వుతూ “భిక్ష సంగతి తరువాత చూద్దాం. మనసులో ఇంత మాలిన్యం ఉంటే దీక్ష ఎట్లా ఇచ్చేది” అన్నాడు.సంపన్న యువతికి తల తిరిగి పోయింది. ఒక్కసారి ఆమెకు అంటిన గర్వపు పొరలు తొలగిపోయాయి. బుద్ధుడు తనని పరీక్షించడానికే భిక్ష కోసం తన ఇంటి ముందు నిలబడ్డాడని అర్ధమైంది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది.దీక్ష తీసుకోవాలనుకునేవారు కోపం, ద్వేషం, అహంకారం , దురాశ మొదలగు చెడుగుణాలను వదిలించుకోవాలని తెలుసుకుంది.


కామెంట్‌లు