హాయ్ ..! నా పేరు రిక్. నా తండ్రి పేరు డిక్. మా పేర్లు ఇoత హాస్యoగా ఉన్నా, నా జీవితం అంత వినోద భరితo కాదు. తల్లి ప్రేవు మెడకు చుట్టుకుపోయి పుట్టటం వల్ల, మెదడుకు సరైన ఆక్సిజన్ అందక నేను సెరెబ్రల్ పాల్సీ తో పుట్టాను. నడవలేను, మాట్లాడలేను. (ఫోటో 1). ‘ఈ కుర్రాడు జీవితాంతం ఉడకబెట్టిన కూరగాయలాగా బ్రతకాల్సిందే’ అని డాక్టర్లు చెప్పినప్పుడు, మా అమ్మ ఆ వాస్తవాన్ని అంగీకరించటానికి ఇష్టపడలేదు. అట్ట మీద ఇసుక పోసి అక్షరాలను నేర్పించటానికి రాత్రింబవళ్ళు కష్టపడింది. ఆ విధంగా ఆల్ఫాబెట్లు నేర్చుకున్నాను. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువుపై గుర్తులు పెడుతూ, నాకు కాస్త జ్ఞానం నేర్పటానికి ప్రయత్నించింది. పదకొండేళ్ల వయసులో, ఇతరులతో కమ్యూనికేట్ చేసేందుకు కంప్యూటర్ సాయంతో, మొదటిసారి వికలాంగుల స్కూల్‌కు వెళ్లాను. ఆ సమయంలో టెలివిజన్‌లో ‘ఐరన్‌-మేన్ మారథాన్ రేస్’ అనే పోటీ చూశాను. ప్రపంచంలో అతి కష్టమైన ఈ రేస్ ప్రొద్దున్న 7:00 కు మొదలై అర్ధరాత్రి కి ముగుస్తుంది. మొదటగా సముద్రoలో 4 కిలో మీటర్లు ఈదాలి. ఆపై 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. ఆ తరువాత 42 కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం 17 గంటల్లో మూడూ ముగించేయాలి. "నాన్నా, నేనీ పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. హెల్ప్ చేస్తారా?" అని తండ్రిని అడిగాను. ఆయన కళ్ళు పెద్దవి చేసి నావైపు విచిత్రంగా చూసి, ‘నువ్వా’ అనలేదు. ‘తప్పకుండా’ అన్నారు. ముప్పై ఏడేళ్ల నా తండ్రి రన్నర్ కాదు. సిమెంట్ బస్తాను చక్రాల కుర్చీలో పెట్టుకుని సంవత్సరం కఠిన సాధన చేసారు. చివరకు మారథాన్ పోటీలు వచ్చాయి. నన్ను బోట్లో కూర్చోపెట్టి, ఆ బోటు తాడు తన నడుముకు కట్టుకుని సముద్రoలో 4 కిలోమీటర్లు లాగారు. రెండు గంటలు పట్టింది. (ఫోటో 2). అలసట తగ్గక ముందే, తన సైకిల్‌తో పాటు నా సీటర్‌ను లాగుతూ 180 కిలోమీటర్లు 9 గంటల్లో పూర్తిచేశారు. తరువాత చక్రాల బండిలో కూర్చోపెట్టి నెట్టుతూ 42 కిలోమీటర్లు 7 గంటల్లో పరిగెట్టారు (photo 3).ప్రజల హర్ష ధ్వానాల మధ్య రేస్ ముగిసిoది. “నాకు కాళ్ళు లేవన్న విషయాన్ని మర్చిపోయి, నేనే ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్టుంది నాన్నా!" కళ్ళనీళ్ళతో అన్నాను. ఆయన నా భుజం చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయంగా నొక్కారు. వరల్డ్ రికార్డ్ లో పేరు శాస్వతంగా నిలిచిపోయింది. (“ప్రేమ ఒక కళ” పుస్తకం నుంచి. పిల్లలకి ఈ వాస్తవ కథ చెప్పండి)- యండమూరి వీరేంద్ర నాథ్


కామెంట్‌లు