తెలుగు సాహిత్యము ప్రబంధ యుగము ‌ దేశమందున నిండయిన సారస్వత సంపద/ సరి భాషలతో తులతూగు నిండు వైభవం/ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్- అని కీర్తి నొందె/జగతిన సాటిలేని మేటి మన తెలుగు భాష// క్రీ.శ 15వ శతాబ్దం వరకు వెలసిన తెలుగు సాహిత్య గ్రంథాలు కొన్ని స్వతంత్ర కావ్యాలు కూడా ఉన్నాయి. ఆ కాలంలో అనేక గ్రంథాలు సంస్కృత భాష నుండి అనువదింపబడినవే. ఆ తర్వాత కాలంలో అల్లసాని పెద్దనాది కవులు పురాణాలను ఇతివృత్తంగా గ్రహించి అనేక వర్ణాలతో పెంచి ధీరోదాత్త నాయకులను, శృంగార రస ప్రధానము చేసి ఐదు ఆశ్వాసముల వరకు పరిమితము చేశారు.అలంకారికమైన శైలిలో వ్రాయడం ఆరంభించారు. వీనినే ప్రబంధములంటారు రచన సంవిధానమును బట్టి చూడగా ప్రకృతి సిద్ధమైన బంధము ( కూర్పు ) గల ఏ కావ్యమైనా ప్రబంధమని చెప్పవచ్చును. తిక్కన తాను రచించిన భారత భాగమును ప్రబంధమని పేర్కొన్నాడు. ఎర్రన తన న్రుసింహ పురాణము ప్రబంధమని తెలియజేశాడు. నన్నెచోడుడు, నాచన సోమన, శ్రీనాథుడు,పిల్లల మర్రి పిన వీరభద్రుడు మున్నగు వారి రచనలలో ప్రబంధ లక్షణాలు చాలా కనబడుతున్నాయి. కాని ఈ కావ్యాల సంఖ్య ఆ రోజుల్లో ఇతర కావ్యాలసంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ. క్రీ.శ 1500 తరువాత ప్రబంధ కావ్యాలు విరివిగా రచింపబడినందు వలన ఈ యుగానికి (1500-1800)ప్రబంధ యుగం అనే సార్ధక నామం ఏర్పడింది. ఈ కాలాన్ని రాయల యుగము,నాయక యుగము లేక దక్షిణాంధ్ర యుగము అనే రెండు భాగాలుగా విభజించారు.శ్రీ కృష్ణ దేవరాయలు అష్టదిగ్గజములను ప్రసిద్ధ కవులను ఆదరించి వారిచే రసవత్తరములైన మహా ప్రబంధములు రచింపజేసి, తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తి గడించాడు. ఆంధ్ర వాఙ్మయమున తన యుగము స్వర్ణ యుగమై అలరారునట్లు యశో శోభితుడయ్యాడు. ఇతడు క్రీ.శ. 1509 నుండి 1530 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా చరిత్రలో నిలిచిన మహనీయుడు."దేశ భాషలందు తెలుగు లెస్స" అని ఎలుగెత్తి చాటిన సాహితీ శరత్చంద్రుడు సంస్కృతమున భోజ మహా రాజు వలె ఆంధ్రమున ఈయన భాషాభివృద్ధికి మహోన్నత సాహితీ సంపదలందించి ఆంధ్ర భోజుడ ని సార్ధక నామధేయుడయ్యాడు. ఈయన ఆస్థానంలో గల అష్టదిగ్గజములను కవులతో "భువన విజయం" సాహిత్య గోష్టు లేర్పాటు చేసాడు. ఈ గోష్టుల వలన తెలుగు సా హిత్యం నూతన పుంతలు తొక్కింది. తరతరాలకు చెరగని ముద్ర వేసింది. ఈ భువన విజయం (ఉత్సవం) కార్యక్రమం నేటికీ నాటకీయంగా పండితులచే ప్రదర్శింపబడుతూ, తెలుగు వారల మన్ననలు పొందుతుంది.రాయలు పలువురు కవులను పండితులను పోషించుటయే గాక తాను కూడా విద్వత్కవియై సంస్కృతాంధ్రములందు పలు గ్రంథములు రచించాడు. ఈయన "ఆముక్తమాల్యద," అను ఆంధ్ర ప్రబంధము రచించాడు. ఈ ప్రబంధ అవతారికలో మదాలస చరిత్ర,సత్య వధూ పరిణయము, సకల కథా సార సంగ్రహము, జ్ఞాన చింతామణి, రస మంజరి మున్నగు సంస్కృత గ్రంథములను రచించినట్లు చెప్పుకున్నాడు కానీ ఇవి యేవియు ప్రస్తుతం లభ్యమగుట లేదు. శ్రీకృష్ణదేవరాయల కొలువులో అల్లసాని పెద్దన,నంది తిమ్మన,ధూర్జటి,మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు,, పింగళి సూరన, రామ రాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు. అనుఈ యనమండుగురు కవులే అష్టదిగ్గజ ములు.(ఇది 26 వ భాగము) --బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబర్: 9290062336


కామెంట్‌లు