శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానములో గల అష్టదిగ్గజములలో ధూర్జటి మహాకవి ఒకడు. ఈయన కాళహస్తి పుర నివాసి, అపర శివభక్తుడు. ఈయన రాయల కాలంలో దాదాపుగా 1520-30 సంవత్సర కాలమునందున్న వాడని చెప్పవచ్చును.ఇతడు "కాళహస్తి మహత్యం" అనే నాలుగు ఆశ్వాసములు గల పుస్తకమును, "కాళహస్తీశ్వర శతకము"ను రచించి శ్రీకాళహస్తీశ్వరునకు అంకితమిచ్చాడు. ఈయన కవనము సలక్షణమై చాలా మధురముగా ఉండును. ఇతని కవిత్వ మాధుర్యమునకు ఆశ్చర్యపడి రాయలు ఒక నాడు సభలో కూర్చుండి ఆస్థాన కవుల ముందు "స్తుతమతి యైన ఆంధ్ర కవి దూర్జటి పలుకులనీ యతులిత మాధురీ మహిమ" అని ప్రశంసించారట! ఈయన వ్యక్తిత్వం గురించి ఒక సందేహం కలగక తప్పదు. ఈయన కవిత్వం పరిశీలించి చూడగా వేశ్యా రసికత్వం కలవాడని తెలుస్తుంది.అఖండ శివ పూజా దురంధరుడయినా, ఈ మహాకవి కి ఇట్టి దుర్గుణము ఎలా కలిగినదని ఆశ్చర్యం కలుగక తప్పదు. తదుపరి కాలంలో తన పూర్వ జీవిత మున గడిపిన పరిస్థితులకు ఆయన పశ్చాత్తాప పడినట్లు మనకు అర్థమవుతుంది. అంత్య దశలో ఈయన వైరాగ్య జీవితం గడిపినట్లు కూడా తెలుస్తుంది.శా: రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం/బాసీ పాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి, వాంఛాలతల్/కోసి కోయదు నా మనం బకట! నీ కుం బ్రీతిగా సత్క్రియల్/ చేసీ చేయదు దీని త్రుళ్ళడపవే శ్రీ కాళ హస్తీశ్వరా//భావం: ఈశ్వరా! నా మనసు చంచలము. ఇది స్త్రీ సౌఖ్యములను పూర్తిగా విడనాడదు. పుత్రులు, మిత్రులు, సంపదలు వీని మీది భ్రమను పూర్తిగా విడనాడదు. కోరికలను పూర్తిగా చంపుకోదు. నీకు ప్రీతిగా సత్కార్యములు చేయుటకు కూడా ఇచ్చగింపదు. అట్లని సంపూర్ణముగా నిన్ను మరచి ఆ విషయములందే కూరుకుపోదు. ఈ చంచలమైన మనసుకు స్థిరత్వం ప్రసాదింపుము. ఈ మహాకవి రాజులిచ్చే సంపదలను కూడా తృణీకరించాడు. ఆయనకు రాజులపై గల భావాన్నిఈ పద్యం ద్వారా తెలియజేశాడు.శా:-రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు నం/భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మ వ్యథా/బీజంబుల్ తదపేక్ష చాలు, బరి త్రృప్తిం బొందితిన్ జ్ఞానల/ క్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా// భావం:-ఈశ్వరా! రాజులు ఐశ్వర్య మదోన్మత్తులు కనుక వారి సేవ నరకం వంటిది. వారు దయతో నిచ్చిన పరిచారికలు, పల్లకీలు, గుర్రాలు, భూషణములు మున్నగునవి సంసార బంధములు పెంచి దుఃఖము కలిగించును. వీటినన్నిటిని అనుభవించి తృప్తిపడినాను. ఇంక వీనిపై వ్యామోహము చాలు. జ్ఞాన సంపదను, దాని వలన కలిగే మోక్షమును నాకు ప్రసాదింపుము.ఈయన వ్రాసిన కొన్ని పద్యాలు సామాజిక దృక్పథంతో కూడి ఉంటాయి. కొడుకులు లేరని బాధపడవలదని చెబుతూ ఈ క్రింది పద్యం చెప్పాడు. ఈ పద్యములో గల భావము, ఈనాటి సమాజానికి కూడా వర్తిస్తుంది, అదే విశేషం. మ: కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై/కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగతుల్/ పడసెన్? పుత్రులు లేని శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్ల్చె/డునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా//భావం:- అవివేకులు కొందరు కొడుకులు పుట్టలేదని ఏడుస్తూ ఉంటారు. ధృతరాష్ట్రునకు నూరుగురు కొడుకులు పుట్టలేదా? వారి వల్ల అతనికి ఏ గతి పట్టింది? పుత్రులు లేని శుక మహర్షికి ఏమైనా దుర్గతి లభించిందా? లేదే, పుత్రులు లేనంత మాత్రాన మోక్ష పదవి రాకుండా ఉండదు.ఈశ్వరుని యందు భక్తికి మంత్రములు మూలము కాదు. సకల జీవులు కూడా ఈశ్వరుని స్మరించి తరించాలని, ఈ పద్యం ద్వారా దూర్జటి కవి తెలియజేశారు. శా: ఏ వేదంబు బఠించె లూత భుజంగంబే శాస్త్రముల్ సూచె దా/ నే విద్యాభ్యసనం బొనర్చె గరి చెంచే మంత్ర మూహించే బో/ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు నీ పాద సం /సేవాశక్తి యె కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా//.భావం:-ఈశ్వరా! ప్రాణి కోట్లకు మోక్షము గలుగుటకు మీ పాదములను సేవించు భక్తియొక్కటియే కారణమగును గాని చదువులెన్ని చదివినను మోక్షమును కలిగునా? ఎంతమంది చదివినవారు లేరు? వారందరికీ జ్ఞానము గలిగినదా? మోక్షము కలిగినదా? మీ దయచే మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివినది? పాము ఏ శాస్త్రములు పఠించినది?ఏనుగు ఏ విద్యలు నేర్చినది? ఎరుకల వాడు ఏ మంత్రము జపించినాడు? వీరంతా ముక్తి పొందుటకు చదువులే కారణమైనవా?ధూర్జటి మహాకవి వ్రాసిన "శ్రీ కాళహస్తీశ్వర శతకము"భక్తి శతకము అయినప్పటికీ ఇందులో పద్యాలు అనేక ఆర్థిక, సామాజిక అంశాలు నేటికీ వర్తిస్తున్నాయి. అందుకే ఈ శతకము ఇప్పటికీ సజీవమై అలరారుతున్నది. ఒకప్పుడు ఈ పద్యాలు నాలుగవ తరగతి నుండి కంఠస్థం పద్యాలుగా ఉండేవి. నాటి బాలలు స్వచ్ఛంగా చదివేవారు.మరల ఆ రోజులు వస్తే బాగుంటుంది కదా! (ఇది 30 వ భాగము) -బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:-9290061336


కామెంట్‌లు