చిన్నోడి పెద్ద మనసు (కథ) -సరికొండ శ్రీనివాసరాజు - శ్రీహరి చాలా పెద్ద స్థలంలో ఉండడానికి తగినంత ఇల్లు కట్టుకొని చాలా స్థలాన్ని చెట్లకు కేటాయించినాడు. రకరకాల పూలచెట్లు, పండ్లచెట్లు, కూరగాయల చెట్లను బాగా పెంచేవాడు. శ్రీహరి ఇంటికి సమీపంలో శ్రీహరి ప్రాణ స్నేహితుడు వేంకటేశం కూడా శ్రీహరిలాగానే చాలా పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని మిగతా స్థలంలో రకరకాల చెట్లను పెంచుతున్నాడు. శ్రీహరి ఇంట్లో తోటమాలి రామయ్య పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అయితే చాలామంది తోటమాలులతో పోల్చితే రామయ్య తీసుకునే జీతం చాలా తక్కువ. అయినా ఏ మాత్రం అసంతృప్తి పడకుండా అందరి కంటే ఎక్కువ పని చేసేవాడు. ఇటీవల రామయ్య అనారోగ్యానికి గురి అయ్యి చాలా రోజులు పనికి రాలేదు. ఆ జబ్బు నయం కావడానికి చాలా ఖర్చు అయింది. తిరిగి చాలా రోజుల తరువాత పనిలోకి చేరాడు. అయితే మూడు వందల రూపాయలు అదనంగా పెంచమని బతిమాలినాడు. శ్రీహరి దంపతులు ససేమిరా అన్నారు. రామయ్య అదేపనిగా బతిమాలాడు. "ఎంత పొగరు నీకు? నువ్వు కాకపోతే వేరే పనివాళ్ళు దొరకరనా నీ ఉద్దేశం? రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు." అని శ్రీహరి దంపతులు అన్నారు. అయితే మరునాడే రామయ్య పనిలోకి వచ్చాడు. పాత జీతానికే పని చేస్తా అన్నాడు. చేర్చుకున్నారు. శ్రీహరికీ ఇద్దరు పిల్లలు. శ్రావణి 8వ తరగతి చదువుతుండగా శ్రీరాం 5వ తరగతి చదువుతున్నాడు. శ్రావణి ఇంటివద్దనే బుద్ధిగా చదువుకుంటుంది. స్నేహితుల ఇళ్ళకు వెళ్ళడం తక్కువ. శ్రీరాం సాయంత్రం అంతా స్నేహితుల ఇళ్ళలో బాగా ఆటలు ఆడి, ఇంటికి వస్తాడు. ఒకరోజు శ్రావణి వాళ్ళ నాన్నతో "నాన్నా! తమ్ముడు నువ్వు ఇచ్చే పాకెట్ మనీతో తన స్నేహితులతో కలసి చెడు అలవాట్లకు ఖర్చు చేస్తున్నాడు. వాడు ఏమీ కొనుక్కోకుండా దాచుకుంటున్పాడని నీకు అబద్ధం చెబుతున్నాడు." అని చెప్పింది. చాలాసేపటి తరువాత ఇంటికి వచ్చిన శ్రీరాంనం నిలదీశారు తల్లిదండ్రులు. అక్కడే ఉన్న తోటమాలి రామయ్య పరుగు పరుగున వచ్చి నిజం చెబుతాడు. అంతకు ముందు రామయ్య జీతం పెంచమని అడిగింది ప్రత్యక్షంగా చూశాడు శ్రీరాం. తన స్నేహితుడు మంజునాథ వాళ్ళ నాన్న వేంకటేశం తన ఇంట్లో పనిచేస్తున్న తోటమాలికి ఇచ్చే జీతం చాలా ఎక్కువ. అయితే ఆ తోటమాలి రంగయ్య రామయ్య అంత శ్రద్ధగా పనిచేయడు. కానీ రామయ్య చేసేపని మంచిగా అనిపించింది శ్రీరాంకు. ఆరోజు రామయ్య జీతం పెంచమని అడిగి, శ్రీహరి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇంటికి బయలుదేరాడు. శ్రీరాం అప్పుడే తాను బయటికి వెళ్ళి ఆడుకొని వస్తానని తల్లిదండ్రులతో చెప్పి, బయటికి వెళ్ళాడు. రామయ్యను కలసి తన పాకెట్ మనీలో ప్రతి నెలా 300 రూపాయలు ఇస్తానని వచ్చి పని చేయమని బతిమాలాడు. అయితే శ్రీరాం మూడు వందల రూపాయలు రామయ్యకు ఇవ్వడం శ్రావణి చూసింది. శ్రీరాం చేతి నిజం చెప్పించాలని శ్రావణి అబద్ధపు చాడీలు చెప్పింది. కానీ రామయ్య నిజం చెప్పినాడు. అప్పుడు శ్రీరాం తాను ఆ పని ఎందుకు చేయవలసి వచ్చిందో చెబుతాడు. ప్రాణ స్నేహితుడు అయిన వేంకటేశం తన తోటమాలికి మంచి జీతం ఇస్తున్నాడు. తాను పిసినారి తనంతో ప్రవర్తిస్తున్నాడు. తన కొడుకుకు ఉన్న ఉదారబుద్ది తమకు లేనందుకు సిగ్గుపడ్డారం శ్రీహరి దంపతులు. కొడుకును మెచ్చుకుని రామయ్య జీతం బాగా పెంచినారు.


కామెంట్‌లు