గుర్తింపు.--వసుధారాణి.---మా ఉమక్కయ్య పెళ్ళికి మా ఇంటికి సున్నాలు వేశారు. అప్పుడు నేను ఐదవతరగతి చదువుతున్నా.ఇంక చూడాలి నా ఆనందం. పడమటి వైపు గోడ నా భావప్రకటనా వేదిక అయిపోయింది.నీళ్లు కాచుకునే పొయ్యిలో కట్టెల్ని ఆర్పి అవి చల్లారాక బొగ్గుల్ని తీసుకుని గోడమీద నా పేరును ఎన్ని రకాలుగా రాయొచ్చునో అన్ని రకాలుగా రాసి చూసుకునే దాన్ని.R. వసుధారాణి, R.V.Rani, VR, RVR ఇలా తెలుగులో ,ఇంగ్లీష్ లో కలిపి రాతలో, పొడక్షరాల్లో రాసుకుని చూసుకునే దాన్ని.అప్పటికి ఆ రెండు భాషాల్లోనే రాయటం వచ్చు.DD లో వయోజన విద్యా కార్యక్రమాలు చూసి లాంతరు పట్టుకుని చీకట్లో బడికి వెళ్లి హిందీలో సంతకాలు పెట్టిన వాళ్ళను చూశాక నా పాండిత్యాన్ని కూడా కాస్త పెంచుకుని.హిందీలో కూడా వసుధారాణి అని రాసుకునేదాన్ని.మరీ కళాపోషణ ఎక్కువైన రోజున ఆదిమానవుల గుహల్లో వుండే బొమ్మల్లా సూర్యుడు,చంద్రుడు అనిపించే ఓ గుండ్రం చుట్టూ చిన్న చిన్న గీతలు,కాస్త వంపుగా ఓ అరసున్నా.మరీ ఇంకా కళకే అంకితం అయిపోవాలన్న ఫీలింగ్ కలిగిన రోజున ఓ సున్నాలోపల కళ్ళు,ముక్కు,నోరు ,పక్కకి రెండు గీతలు,కిందకి రెండు గీతలు అబ్బాయి బొమ్మ.తలకి రెండు చిన్న గీతలు అటూ ఇటూ గీస్తే అమ్మాయి బొమ్మ.మళ్ళీ ఇంత గొప్ప కళాకారిణి ఎవరా? అని ప్రజలు తెలుకోలేక పోతారేమోనని ఆర్ట్ బై R. వసుధారాణి అనికూడా రాసుకునేదాన్ని.ఇలా పడమటి గోడంతా మా ఉమక్క పెళ్ళై అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ మొదటి పండగకి వచ్చేలోపు నా కళాఖండాలతో నింపివేశాను.తరవాత తూరుపు గోడవైపుకి నా సెటప్పు మార్చిన తరువాత కానీ ఇంట్లో వాళ్ళకి అర్ధం కాలేదు.ఆ రోజు మా అమ్మ తిట్టిన తిట్లు ఇంకా గుర్తున్నాయి.ఎంత గుర్తు అంటే ఇప్పటికీ నేను ఎవరికైనా చెక్కు ఇచ్చేటప్పుడు సంతకం పెట్టకుండా ఇచ్చేటంత.అప్పటికి అలా నా సంతకాల యజ్ఞం మానినా.నా పేరు,నా సంతకం గొప్ప విలువైనవి అని మా గొప్ప నమ్మకం ఉండేది నాకు.ఇప్పటికీ పెన్ను,పేపరు కనపడితే నాకు తెలియకుండానే వసుధారాణి అని రాసేసుకుంటుంటా.తరువాత ఎక్కడో ఏదో పుస్తకంలో చదివితే తెలిసింది క్రియేటివ్ బుర్ర ఉన్న వారు,గుర్తింపును కోరుకునే వారు ఇలా తమ పేరును రాసుకుంటూ ఉంటారని.ఈ గుర్తింపు పాకులాటలో నాలా సైలెంటుగా సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఫర్వాలేదు కానీ , SSN కాలేజీలో ఒక అబ్బాయి వుండే వాడు పేరు మర్చిపోయా . మేము మాత్రం అతన్ని వద్దంటే పాటలు అనే వాళ్ళం.ఎక్కడ పదిమంది గుమిగూడినా,ఏచిన్న కార్యక్రమం అయినా నేను పాట పాడతా అని పాడేవాడు.పైగా మంచి హిట్టు పాటలకు సొంత పారడీ పాడి చంపేవాడు.మా దురదృష్టం ఏమిటంటే మా ఉమ్మక్క పెళ్ళి సంబంధం ఊళ్ళో నే కుదిరింది.ఈ అబ్బాయి వాళ్ళు మా బావగారి బంధువులు ఇక చూసుకోండి మా కష్టాలు.ఆఖరికి మా ఉమక్క కొడుకు సమీర్ బాలసారె లో కూడా 'పదిమందిలో పాట పాడినా అది అంకితం ఎవరో ఒకరికే'అన్న పాట పాడినట్లు గుర్తు.పొలం పనులకు మా రూపెనగుంట్ల వెళ్లటం మొదలు పెట్టిన తరువాత నెమ్మదిగా నాకు ఓ విషయం అర్ధం అయ్యింది. చిన్న ఊరులో ఉన్నప్పుడు మనం అందరికీ తెలిసిపోతాము కనుక మనం చేసే పని వల్ల మనకి మంచో,చెడో ఏదో ఒక గుర్తింపు దానంతట అదే వస్తుంది అని.మాట ఖచ్చితంగా వుంచుకోవటం, ఆప్యాయంగా పలకరించటం, నిజాయితీగా ఉండటం ఇవన్నీ నేను నా నేలతల్లి నుంచి నేర్చుకున్నాను.గుర్తింపు అన్నది ఒక విషయమే కాదు అని తర్వాత నెమ్మదిగా గుర్తించాను.


కామెంట్‌లు