అడిదము సూరకవి, బాల భాస్కరుని కుమారుడు. ఈయన తండ్రి దగ్గర చందస్సు అలంకార శాస్త్రము వ్యాకరణాన్ని నేర్చుకున్నట్లు తెలియుచున్నది. వీరిది పండిత వంశమే.గాని సూరకవి తిట్టు కవులలో పేరు మోసిన వాడు. విజయనగర సంస్థాన ప్రభువైన పూసపాటి విజయ రామ మహారాజు ఆశ్రితుడు. ఈయన సహజ పాండిత్యము గలవాడు. సూరకవి చాటు పద్యములు మరియు తిట్టు పద్యములు చాలా చెప్పినాడు. ఈయన రాసిన గ్రంథములు అన్నింటిని రామచంద్రపురం రామలింగేశ్వరునికి అంకితం చేశాడు. ఈయన వ్రాసిన గ్రంథములలో కెల్ల "చంద్రమతి పరిణయము"అను నామాంతరం గల "కవి జనరంజనము" మిక్కిలి ప్రసిద్ధిచెందినది. ఇది మూఢ విశ్వాసములతో నిండిన చిన్న ప్రబంధము. దీని లక్షణములను బట్టి " పిల్ల వసుచరిత్రము"అని వాడుకలోనికి వచ్చినది. ఇతని గ్రంథములు అన్నియు దేవాంకితము చేయుట చేత కవి కాలాదులు నిర్ణయించుట శక్యము కాకున్నది.ఇతని రచనలు అనుసరించి ఇతడు గోదావరి మండలంలోని వాడైనట్లు కనబడుచున్నది కానీ ఇతడు విజయనగరం సంస్థానం లోనే పూసపాటి విజయరామరాజు గారి కాలంలో ఉండినట్లు, ఇతని చాటుపద్యములు, సంఘటనలు, భాషా శైలి మొదలగు వాని వలన తెలియుచున్నది. ఈయన రాసిన కృతులు చాలా ఉన్నవి. వానిలో "కవి జన రంజనము, చంద్రాలోకము, కవి సంశయన విచ్ఛేదము, రామలింగేశ శతకము, ఆంధ్రనామ శేషము, శ్రీ రామ దండకం ముఖ్యమైనవి. ఇతడు తెలుగు వాఙ్మయములోని అనేక శాఖలలో తన నేర్పు చూపాడు. ఇతడు వరకవి, ఆశు కవి అయినప్పటికీ తిట్టు కవిగానే ప్రసిద్ధుడు ఈయన ఘడియకు అనగా 24 నిమిషములలో 100 పద్యములు చెప్పగల దిట్ట. సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం”ఆతని నైజం అనితెలుస్తుంది. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు అల్లడం ఆయనకు ఆయనే సాటి అని అంటారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితులఆదరణ పొంది నేటికి నిలి చాయి. సూరకవి సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం – గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక/ మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి/ బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక/ కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద./ చేవ వుంటే బాధుల్లాఖానుమీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచాడు. ఒకసారి సూరన విజయరామరాజుగారి సభలో ఈపద్యం చదివాడు. రాజుగారి కీర్తిని మెచ్చుకుంటూ. చెప్పినది. ఉ. రాజు కళంకమూర్తి, రతిరాజు శరీర విహీనుండంబికా/ రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవర్తి వి,/ భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాఁలుడె రాజు గాక, యీ/ రాజులు రాజులే పెనుతరాజులు గాక ధరాతలంబునన్./ చంద్రుడికి మచ్చ, మన్మథుడికి శరీరమే లేదు, శివుడికి కట్ట బట్టల్లేవు, సింహం గుహల్లో నివాసం, వీళ్లందరూ రాజులేమిటి, విజమరామరాజు మాత్రమే నిజంగా రాజు ఈ భూమ్మీద అంటాడు సూరకవి. పైపద్యం ఆశువుగా చదివినప్పుడే సూరన కవితా ప్రౌఢిమకి మెచ్చి విజయరామరాజు ఆయనకి కనకాభిషేకం చేయించారు. ఆ తరవాత, ఆనాటి ఆనవాయితీ ఏమో మరి, సభలోని వారు సూరన ఆ బంగారునాణేలను తీసుకుంటాడని ఎదురుచూశారు. అయితే సూరన తనకి జరిగిన సత్కారానికి మాత్రం సంతోషం వెలిబుచ్చి వూరుకున్నాడు. ఆ ధనం వైపు కన్నెత్తి అయినా చూడ లేదు. రాజుగారు ఆనాణెములు నీవే అని స్పష్టం చేసారు.దానికి సమాధానంగా సూరన, మీదయవల్ల ఇంతవరకూ “స్నానము చేసిన యుదకమును పానము చేయలేదు” అని జవాబిచ్చాడు. (డబ్బు నీళ్లలో వాడడం అన్ననానుడి ఇలాగే వచ్చిందేమో,అనిపిస్తుంది) చినవిజయరామరాజు సూరన వ్యక్తిత్వానికి ముగ్ధుడయి, ఆయనకి తగినవిధంగా సత్కరించి పంపించాడు.చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం లోకి వచ్చారు. సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆ ఆజ్ఞని మనసున తలంచక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నాడు..మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, . సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మనఅబ్బాయిమీద రాయరేం” అని అడిగిందట. అందుకు సూరకవి తన సహజధోరణిలో... క. బాచా బూచుల లోపల/ బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్/ బూచంటే రాత్రి వెఱతురు/ బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్/ అని చదివాడట. తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ. సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట. అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజధోరణిలో ఆశువుగా చెప్పినపద్యం. క. అదపాక మామిడాకులు/ పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే/ ముదమొప్ప విక్రమార్కుఁడు/ అదపాకా అత్తవారు ఔనే పాపా./ ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అని అన్నారట! ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవప్రదంగ మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు. ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయరామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం. ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా/ కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ/ కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప/ ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా./ కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చుకోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు. సూరకవి వెంటనే, క. చిన్నప్పుడు రతికేళిని/ నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్/ వన్నెసుమీ ‘రా’ కొట్టుట/ చెన్నగునో పూసపాటి సీతారామా! "పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వంచెప్పినప్పుడు, యుద్ధంచేసేటప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు."అంటూ రాజుగారిని సమాధాన పరిచాడు. సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి. ఆయన తెలుగు భాషలో ప్రత్యేక స్థానం అలంకరించి శాశ్వత కీర్తి నొందెననుట నిర్వివాదాంశం (50 వ భాగము)-బెహరా ఉమామహేశ్వరరావు-సెల్ నెంబర్:9290062336
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
మాతృభాష కవిత; -ప్రతాప్ కౌటిళ్యా,, సునీత పాలెం, నాగర్ కర్నూలు జిల్లా
• T. VEDANTA SURY
రచయిత్రి శ్రీమతి అనూరాధకు సత్కారం
• T. VEDANTA SURY
కాళోజీ;- కె.గాయత్రి-10వ,తరగతి-జి.ప.ఉ.పా రామంచ-జిల్లా:సిద్దిపేట
• T. VEDANTA SURY
ప్రియమైన నాయినమ్మ; - స్వరూప్,
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి