బాల సాహిత్యం -36-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి--ఫోన్ 7013660252

చక్రపాణి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు బాల సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసిన వారు. మనందరికీ “ చక్రపాణి”  బి ఎన్ రెడ్డి ( బి.నాగిరెడ్డి ) గారు అంటే బాగా తెలుస్తుంది. దీనికి కారణం వీరిరువురు కలిసి విజయ వాహిని అనే సంస్థను స్థాపించి ధర్మపత్ని, స్వర్గసీమ, పాతాళ భైరవి,  మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, షావుకారు, అప్పు చేసి పప్పుకూడు లాంటి పదిహేను సినిమాలు ఇద్దరు కలిసి తీశారు. ఇద్దరూ కలిసి తెలుగు తమిళము కన్నడ ఒరియా హిందీ భాషలలో మొత్తము 35 సినిమాలు తీశారు. వీరు తీసిన కన్నడ సినిమా “ మదువే మది నోడు” కు జాతీయ ఫిల్మ్ అవార్డు వచ్చింది. వీరి తెలుగులో చేసిన మాయా బజార్, గుండమ్మ కథలకు బెస్ట్ ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.మనకు తెలిసిన చక్రపాణి పూర్తి పేరు  ఆలూరు చక్రపాణి లేక ఆలూరు వెంకట సుబ్బారావు. చక్రపాణి గారు 1908 ఆగస్టు 5న గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగరంలో జన్మించారు. ఇతని తల్లి వెంకమ్మ , తండ్రి గురవయ్య. అతనికి తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు అని నామకరణం చేశారు. ఐతానగర్ లో ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత తెనాలి తాలూకా హైస్కూలులో విద్యనభ్యసించారు. హైస్కూలు విద్య కొనసాగుతున్నపుడే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆ కారణంగా కళాశాల విద్యను అభ్యసిం చ   లేకపోయారు. కళాశాల విద్యలేక పోయినప్పటికీ హిందీలో భాషా పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచుకున్నారు. హిందీ భాషలో ఉన్న కథలను తెలుగు భాషలోకి తర్జుమా చేసేవారు. తన రచనలను  " చిత్రగుప్త" " వినోదిని" అనే పత్రికలకు పంపేవారు. ఆ పత్రికలు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకా అనేకమైన రచనలు చేసేవారు.వ్రజనందనశర్మ అనే హిందీ పండితులు చక్రపాణి గారికి హిందీలో గల భాషా పరిజ్ఞానానికి మెచ్చుకుని ఎంతో ప్రోత్సాహాన్ని అందజేశారు. వెంకట సుబ్బారావుగారు రచనలు చేసి పత్రికలకు పంపే టప్పుడు వెంకట సుబ్బారావు అని కాకుండా "చక్రపాణి " అని మారుపేరును వ్రాసి పంపమన్నారు. ఆ కారణంగా ఆనాటినుండి వెంకట సుబ్బారావు గారు చక్రపాణి అనే మారుపేరు (పెన్ నేమ్)తో  తన రచనలను పంపేవారు. సుబ్బారావు గారికి తిరుపతి రాయుడు అనే మేనమామ ఉండేవారు.ఇతను పెద్ద భూస్వామి. వీరికి సాహిత్యమంటే మహా అభిలాష. ఇతరులచే సాహిత్య  గ్రంధాలను చదివించి వినేవారు. ఆ కారణంగా తన మేనల్లుడి అభిరుచులు నచ్చి తన కుమార్తెను రంగమ్మను ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు కలిగారు. ఇంతలో చక్రపాణిగారికి టీబీ సోకింది. హాస్పిటల్లో చేరారు. అక్కడ ఒక బెంగాలీ బాబు తో పరిచయం అయ్యింది. అతని దగ్గర బెంగాలీ భాష నేర్చు కున్నారు. బెంగాల్ నుంచి వాచకాలు, ఉపవాచకాలు పిల్లల కథల పుస్తకాలను తెప్పించి బెంగాలీ భాష  అభివృద్ధి పరుచుకున్నారు. చక్రపాణి గారికి గ్రహణ శక్తి ఎక్కువ. చక్రపాణి గారు “ యువ” అనే పత్రికను కూడా స్థాపించాడు. ఇందులో శరత్ బాబు నవలలు, రామ్ చౌదరి, పరశురాం, రవీంద్రనాథ్ ఠాగూర్,  మైత్య లాంటి వారి రచన లను అనువదించి ప్రచురించే వారు. చలం రచనలను 23 ప్రచురించారు. అంతేకాకుండా కొడవటిగంటి కుటుంబరావు ధనికొండ హనుమంతరావు, శిష్ట్లా, దాసరి సుబ్రహ్మణ్యం మొదలైనవారి రచనలను ప్రచురించేవారు. చక్రపాణి గారు తెనాలి నుండి విహారి అనే మాసపత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో యువకుల రచనలను అధికంగా ప్రచురించే 
వారు. ఇదిలా ఉండగా కొంతకాలానికి చక్రపాణిగారి మామ గారు ,  అతని భార్య ఒకరి తరువాత కొద్ది కాలం వ్యత్యాసం
లో  చనిపోయారు. దీంతో అయన ఒంటరి వారయ్యారు. తన ఇద్దరి కొడుకులను పెంచి పెద్దచేయవలసిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. చక్రపాణి అత్తగారు ఇద్దరు పిల్లలను చేరదీశారు. రెండో పెళ్లి చేసుకోమని స్నేహితులంతా కోరారు గానీ అందుకు అతను అంగీకరించలేదు.1940లో చక్రపాణి గారు తన మకాంను మద్రాసు మార్చేశారు. అక్కడ బి. నాగిరెడ్డి గారితో పరిచయం ఏర్పడింది. దానితో చక్రపాణి గారి జీవితం పెద్ద మలుపు తిరిగింది. నాగిరెడ్డి గారు ఒక  ప్రెస్ ఆఫీస్ కూడా నడిపేవారు. నాగిరెడ్డి గారు చక్రపాణి గారి ఆధ్వర్యంలో "ఆంధ్రజ్యోతి"అనే మాస పత్రికను స్థాపించారు. కొన్నాళ్ళకు చక్రపాణి నాగరెడ్డి పరిచయం ప్రాణ స్నేహం గా మారింది. ఆంధ్రజ్యోతి మాసపత్రిక నిర్వహించడంలో  రచయితలు  చలం, గోఖలే, కొడవటిగంటి కుటుంబరావు, నార్ల వెంకటేశ్వరరావు, శ్రీ శ్రీ కప్పగంతులు. సత్యనారాయణ, మునిమాణిక్యం, మల్లాది రామకృష్ణ మొదలగు వారి సహకారంతో పత్రికను నడిపారు. 1947 జూలైలో చంద మామ మాసపత్రికను ప్రారంభించారు.  ఇది బాలల మాసపత్రిక అయినా పెద్దలు కూడా చదివేవారు. చంద మామకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. భారత, భాగవత, రామాయణ కథలకు , భట్టి విక్రమార్క కథలకు, సూక్తి కథలకు ప్రాధాన్యత నిచ్చేవారు. చక్రపాణి గారు ప్రతీ కథను చదివి, తిరిగి వ్రాసి ప్రచురించేవారు. అంతగా కష్టపడి రంగురంగులతో బొమ్మలు వేయించి పాఠకులకు అందిం చేవారు. చందమామ ను చూసే పిల్లలు ఎంత ఆనందాన్ని పొందుతారోచందమామ పుస్తకాల్లో చదివిన బాలలు కూడా అంతే ఆనందాన్ని పొందుతారు.  ఆ కారణంగా చక్రపాణి గారు చందమామ కథలు పుస్తకాన్ని అంత అందంగా తయారు చేసేవారు. చందమామను తొలుత తెలుగు తమిళ భాషల్లో ప్రారంభించ తరువాత ఇతర భాషల్లో కూడా ప్రచురించేేేవారు. యువ మాస పత్రిక 1959లో హైదరాబాద్లో ప్రారంభించారు. పత్రికా రంగంతో పాటు నాగిరెడ్డితో కలసి సినిమాలను కూడా తీయడం ప్రారంభించారు. వీరు తీసిన సినిమాలు చాలా విజయవంతం అయ్యాయి. చందమామ పత్రిక ఎలా విలువలతో కూడుకున్నదిగా నిలచిందో వారు నిర్మించిన సినిమాలు కూడా అంతటి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. తాను చేపట్టిన అన్ని రంగాల్లోనూ విజయం సాధించిన వ్యక్తి " చక్రపాణి".  చివరి దశలో తీవ్ర  అస్వస్థ  తకు గురియై 1975 సెప్టెంబర్ 24న చెన్నైలో  స్వర్గస్తు  లయ్యారు.( సశేషం )