న్యాయపతి కామేశ్వరిగారి పేరు విననివారుండరు. ఈమెను రేడియో అక్కయ్య గాను ఈమె భర్త న్యాయపతి రాఘవ రావును రేడియో అన్నయ్యగానూ పిలుస్తుంటారు. న్యాయ పతి కామేశ్వరి గారు తల్లికి తొలి సంతానంగా 1908 డిసెంబర్ నెలలో విజయనగరంలో జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్ల అంటే చాలా చులకనగా చూసేవారు. ఇంట్లో అందరూ ఆడపిల్ల పుట్టిందని బాధపడుతూ ఉండగా అమ్మమ్మ మాత్రం సరదా పడింది. కామేశ్వరి తల్లిగారు కూడా తన కూతురును ఎంతో గారాబంగా పెంచారు. బడిలో వేసే వరకు ఆటపాటలు నేర్పేవారు. ఆడపిల్ల పుట్టడం తాతయ్యకు ఇష్టం లేదు. అమ్మమ్మ వీధి బడిలో బడిపంతులు చేత అక్షరాభ్యాసం చేయించింది. బడి పంతులు గారు కామేశ్వరి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుని చదువు చెప్పేవారు. వీధి బడిలో ఒకటో తరగతి చదివారు. విజయనగరంలో గల బాలికల పాఠశాలలో చదువుకు చేరి అందులో నాలుగవ తరగతి వరకు చదివి ఉత్తీర్ణులయ్యారు. కామేశ్వరిగారి దొడ్డమ్మ ప్రోత్సాహంతో విశాఖపట్నంలో
ఎస్ ఎస్ ఎల్ సి చదివారు. విజయనగరం మహారాజా కళాశాలలో ఆడపిల్లలను చేర్చుకోవడానికి అంగీకరించిన తరువాత అక్కడ కళాశాలలో ఆమె బి ఏ లో చేరి ఉత్తీర్ణులయ్యారు. ఆ కళాశాలలో చదువుతున్నప్పుడే బరంపురం నివాసి అయిన న్యాయపతి రాఘవరావు అదే మహారాజా కళాశాలలో చదువుతూ ఉండేవారు. కళాశాల లో వీరిద్దరూ విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారింది. కామేశ్వరిగారు బి.ఇడి శిక్షణ పొంది ఉపాధ్యాయినిగా ఉద్యోగంలో చేరాలనే అనుకున్నారు. కానీ ఇంటి వద్ద ఆర్థిక పరిస్థితులు బాగులేక చదవ లేకపోయారు.నూజివీడు ఎస్టేట్ యొక్కజమిందారి ణికి ఇంగ్లీషు భాషను నేర్పేటందుకు అక్కడ చేరారు. అక్కడ ఆమె ఉద్యోగంలో ఉండగానే 1934లో న్యూజివీడులో ఆమె ప్రేమించిన వ్యక్తి న్యాయపతి రాఘవరావుతో వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులిద్దరూ ఉద్యోగాన్వే షణలో పడి మద్రాసు వెళ్ళారు. రాఘవరావు గారికి హిందూ దిన పత్రికలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం లభించింది. రాఘవ రావు గారి ప్రోత్సాహంతో కామేశ్వరిగారు మద్రాసులోని విల్లింగ్టన్ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసుకుని అక్కడ ఉండే మైలాపూర్ లోని నేషనల్ గర్ల్స్ హై స్కూల్ లో 1937 నుండి 1945 వరకు ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఇంతలో ఆ పాఠశాల కమిటీ వారు ఆంగ్లము కాక తమిళ భాషలో కూడా బోధన అమలు పరచాలని నిర్ణయం చేశారు. తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమిళ భాషకు ప్రాధాన్య తనివ్వడం కామేశ్వరి గారికి నచ్చలేదు. ఆమె వెంటనే ఆ ఉద్యోగానికి ఆమె రాజీనామాచేశారు. వీరికి పిల్లలు కూడా కలుగలేదు. ఆ కారణంగా బాలలంతా తమ పిల్లలు గానే భావించేవారు. మద్రాసులో గల తెలుగు పిల్లలకు తెలుగును బోధపరచి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయడమే ఇద్దరు భార్య భర్తల ఆశయంగా ఉండేది. ఆ కారణంగా తెలుగు పిల్లలను మాతృభాషలోనే విద్యావంతులను చేయడానికి ఎంతో కృషి చేశారు. పిల్లలు చదువుకోవటానికి '' బాల" బొమ్మల మాసపత్రికను తెలుగులో 1945లో ప్రారంభిం చారు. ఆ పత్రికకు న్యాయపతి రాఘవరావుగారు సంపాద కులుగాను న్యాయపతి కామేశ్వరిగారు ఉప సంపాదకులు గాను ఉండేవారు. ఆ పత్రికలో పిల్లలకు ఉపయోగపడే రచనలను “ అక్కతో ఐదు నిముషాలు ” అనే శీర్షికన కామేశ్వరిగారు వ్రాసేవారు. ఆమె ఆడపిల్లలను విద్యావంతు లను చేసేందుకు తన సొంత డబ్బులు ఖర్చు చేసి, వీధి వాడా తిరిగి ఆడవారికి మాతృత్వం, పిల్లల పెంపకం, ఆడపిల్లల చదువు గురించిన అవగాహన కార్యక్రమాలు అనేకం నిర్వహించేవారు. ఈ సమస్యలను వారు అర్థం చేసుకునేందుకు తానే స్వయంగా సాంస్కృతిక కార్యక్రమా లను రూపొందించి అనేక ప్రదర్శనలు ఇచ్చేవారు.1939లో ఆకాశవాణిలో ఆటవిడుపు అనే పేరుతో ఆదివారం నాడు పిల్లల కార్యక్రమాలను ప్రారంభించారు.వివిధ కార్యక్రమా లను నిర్వహించడం దుర్గాబాయి దేశ్ముఖ్ నుండి నేర్చుకు న్నారు. ఇలా న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరి గార్లు రేడియోలో పిల్లల కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం వలన వీరికి " రేడియో అక్కయ్య" "రేడియో అన్నయ్య''గా పేరువచ్చింది. కామేశ్వరి గారికి ఏ కార్యక్రమా న్ని నిర్వహించమని ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా నిర్వహించేవారు. 1940 ల్లోనే మద్రాసులో గల తెలుగు పిల్లలను ఒక సంఘంగా ఏర్పాటు చేసి తెలుగు భాష,
విజ్ఞానం, మనో వికాసం కలిగించే కార్యక్రమాలను
నిర్వహించేవారు. 1947లో ఈ సంఘాన్ని రిజిస్టర్ చేసి
" ఆంధ్ర బాలానంద సంఘం " గా ఏర్పాటు చేసి తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించేవారు. దుర్గాభాయ్ దేశముఖ్ గారు బాలానంద సంఘం నిర్వహణకు కొంత డబ్బును సమకూర్చేవారు. తాను ఏర్పాటు చేసిన సంఘానికి ఆర్థిక పరిపుష్టికి కామేశ్వరిగారు అనేక పథకాలు సిద్ధం చేసి వాటిని అమలు జరిపే వారు. రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు, రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి గారు కలసి ఈ సంఘ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రేడియో నాటికలను ప్రసారం చేయడానికి అప్పటికప్పుడే కామేశ్వరి గారు నాటికలు రాసి పిల్లలచే కొద్దికాలం వ్యవధిలోనే ఆ సంభాషణలను చెప్పించి ఉత్తమనటులుగా తీర్చి దిద్దేవారు. ఆ రోజులలో సినీ నిర్మాతలు కామేశ్వరిగారిని సంప్రదించి ఉత్తమ బాలనటులను వారి సినిమాలలో నటింపచేసేవారు. ఆంధ్ర బాలానంద సంఘము ద్వారా న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుmoగారలు నిర్వహించిన కార్యక్రమాలు బాలల సమగ్ర అభివృద్ధికి దోహదపడి పిల్లలను బాగుపరచారు. ( సశేషం )
బాలసాహిత్యం--- 38(1)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలిఫోన్ 7013660252
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి