మద్రాసులో గల తెలుగు పిల్లలకు బాలానంద సంఘం 1950లో మద్రాసులో బాలల మహాసభలు ఏర్పాటు చేసారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత1954లో కర్నూల్ లోనూ 1955లో గుంటూరులోనూ, ఆంధ్రప్రదేశ్ అవతరిం చాక 1957లో హైదరాబాదులోనూ బాలల మహాసభలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మహా సభల నిర్వహణలో న్యాయపతి కామేశ్వరిగారి శ్రమ చెప్పలేనిది. 1956లో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదుగా ఏర్పడింది. 1956లో న్యాయపతి కామేశ్వరి గారు న్యాయపతి రాఘవరావుగారు హైదరాబాదు తరలివచ్చి " ఆంధ్ర బాలానంద సంఘం" ప్రధాన కార్యాలయం నారాయణ గూడలో ఏర్పాటు చేసారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర బాలానంద సంఘానికి ప్రారంభోత్సవం చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో న్యాయపతి కామేశ్వరి గారు స్త్రీల కార్యక్రమాలకు ప్రయోక్తగా పని చేసేవారు. ఆకాశవాణి హైదరాబాద్ క్యాంపస్ లో పనిచేస్తున్న కామేశ్వరిగారు ఇటు రేడియోకు అటు పత్రికలకు, రంగస్థలానికి అనేక నాటికలు, కథలు,గేయాలు రాసేవారు.చాలా మంది బాలలను నటులగానూ, కళాకారులుగాను తీర్చిదిద్దారు. అనేక పల్లె ప్రాంతాలలో రేడియో మహిళా మండలలు ఏర్పాటు కావడానికి కృషి చేశారు. పేద మధ్యతరగతి మహిళల అభ్యున్నతికి పాటుపడిన స్త్రీ న్యాయపతి కామేశ్వరి గారు. ఆనాటి కేంద్ర ప్రసారశాఖ మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రశంసలను కూడా ఈమె అందుకున్నారు.బాలలతోను, స్త్రీలతోను కలగలుపుగా తిరిగి వారి యోగక్షేమాలను చూసేవారు. బొమ్మల కొలువు లు ఉత్సవాలు విహార యాత్రలు నిర్వహించేవారు. ప్రతి ఒక్కరూ ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జేజేలు కొట్టేవారు. ఆమె రచనలు సామాజిక స్పృహ కలిగించేవిగా ఉంటాయి. ఈనాటికీ ఆమె రచనలు సజీవమే!
న్యాయపతి కామేశ్వరిగారి రచనల శైలిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కథలు విన్న బాలలకు ఇట్టే అర్థమైపోతాయి. ఈమె రాసిన కథల్లో " అనగనగా ఆకలి కథ, ఇల్లు ఇరకాటం, ఆ చంద్రం, దోమ కోతి, తాత అవ్వ కథ, అమ్మమ్మ బహుమానం, " కోతి చేష్టలు", నాలుగు ఏనుగుల కథలు ముఖ్యమైనవి. కామేశ్వరిగారు వ్రాసే నాటికలలో ఉన్న పాత్రలు అన్నీ ఆడపిల్లల పాత్రలే ! " ఇద్దరు లలితలు" అన్న నాటికలో నానమ్మ, లలిత, లలిత తల్లి, పని మనిషి , పక్కింటి పిన్ని , బడి టీచర్ లాంటి పాత్రలన్నీ స్త్రీ పాత్రలే. ఈ నాటికలో అన్నీ స్త్రీ పాత్రలే రాయడానికి కారణం " స్త్రీ పాత్ర లేని నాటికలు మాకు కావాలని మగ పిల్లలు అడుగుతారు. మగ వేషంలో లేని నాటికలు కావాలంటూ ఆడపిల్లలు అడుగుతారు. కేవలం ఆడపిల్లల పాత్రలతోనే కావాలనే కోరికే ఈ " ఇద్దరి లలితలు" నాటిక రాయడానికి ప్రేరణ కలిగింది" అంటారు కామేశ్వరి గారు. పిల్లలను చేరదీసి మంచి అలవాట్లు ఏవో, చెడు అలవాట్లు ఏవో కామేశ్వరి గారు విడమరిచి చెప్పేవారు.ఆంధ్ర బాలానంద సంఘం కార్యక్రమాల కోసం తన సొంత భవనాన్ని దారాదత్తం చేశారు. కామేశ్వరి గారి ఆశయాల మేరకు మర్రి చెన్నారెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో జవహర్ బాల భవన్ ఏర్పాటు చేశారు. మండలి వెంకట కృష్ణారావు గారు విద్యాశాఖమంత్రిగా ఉన్నప్పుడు కామేశ్వరరావుగారి కోరిక మేరకు ఆంధ్ర ప్రదేశ్ బాలల అకాడమీ స్థాపన జరిగింది.1975లో తొలి అంతర్జాతీయ తెలుగుమహాసభలు జరిగిన సందర్భంగా బాలసాహిత్యానికి చేసిన సేవలకు గాను ఆమెను ఘనంగా సత్కరించడమేగాక 1978లో “బాలబంధు” బిరుదుతో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారు సత్కరించారు.1981లో కామేశ్వరిగారు రచనలను అన్నింటినీ కలిపి “ భోగి పళ్ళు ” అనే సంకలనంగా తెచ్చారు. బాలానంద మహోద్యమానికి భర్త న్యాయపతి రాఘవరావుగారికి సర్వవిధాలా సహకరించిన కామేశ్వరి గారు తన 72వ ఏట 1980 అక్టోబర్ 1 తేదీన స్వర్గస్తు లయ్యారు. బ ( సశేషం )
బాలసాహిత్యం ---38(2)-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ 7013660252
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి