ఎల్లకాలం మోసం చేయలేం( సంయుక్త అక్షరాలు లేని సరదా కథ) డా.ఎం.హరి కిషన్ - కర్నూలు. - 94410 32212

ఒక ఊరిలో ఒక కోతి వుండేది. అది చిన్నప్పటి నుంచే మనుషుల నడుమ పెరిగింది. దాంతో దానికి అన్నీ మనుషుల బుద్దులే వచ్చినాయి. ఒకసారి ఆ కోతి పక్కనే వున్న అడవిలోనికి పోయింది. దానికి జంతువులను భయపడిచ్చి పళ్ళు, కాయలు సంపాదించాలని అనిపించింది.
ఆ అడవిలో ఒక చిన్న నీటిగుంత వుంది. దానిపైన ఒక పెద్ద చెట్టు వుంది. ఆ చెట్టు మీదకు ఎక్కి కూచోనింది. అడవిలో జంతువులు ఏవయినా నీళ్ళు తాగడానికి ఆ గుంత వద్దకు రాగానే ''ఏయ్‌... ఇది నాది నా అనుమతి లేకుండా ఎవరూ దీనిలో నీళ్ళు తాగకూడదు. అడవికి రాజయిన సింహం దీనిని నాకు అప్పగించింది. నాకు ఏవయినా పళ్ళుగానీ, కాయలుగానీ ఇచ్చి తరువాత నీళ్ళు తాగండి'' అని గట్టిగా అరిచేది.
సింహం పేరు వినగానే అడవి జంతువులన్నీ భయంతో గజగజా వణికిపోయేవి. అనవసరంగా గొడవ దేనికని అది అడిగినట్టే పళ్ళో, కాయలో, దుంపలో ఇచ్చి నీళ్ళు తాగేవి. కోతి అలా వాటిని మోసం చేసి కొంచెం గూడా పని చేయకుండా కులాసాగా కాలం గడపసాగింది.
ఒకరోజు ఒక గుర్రం నీటిని తాగడానికి వచ్చింది. కోతి అలవాటుగా దాన్ని ఆపి ''ఏయ్‌... ఇది నాది. నాకు ఏ పండో, కాయో ఇచ్చి నీళ్ళు తాగు. ఇది సింహం ఆజ్ఞ'' అనింది గట్టిగా.
ఆ గుర్రం చాలా తెలివైనది. అది కొన్నిరోజులు మనుషులతో వుండి వాళ్ళ పద్ధతులు నచ్చక పారిపోయి అడవికి వచ్చింది. అందుకే కోతి మాటలు విని ''ఇదేంది... అచ్చం మనుషుల మాదిరి మాటలాడుతోంది. ఈ భూమి నాది, ఈ చెట్టు నాది అని తిట్టుకోడం, కొట్టుకోడం ఒకరికొరు చంపుకోడం మనుషుల పద్ధతేగానీ జంతువుల పద్ధతి కాదు. అడవిలో అన్నీ సమానమే. అన్నీ అందరివే. ఈ కోతి పక్క వూరి నుంచి వచ్చినట్టుంది. అందుకే అజమాయిషీ చేయాలనుకుంటోంది. దీనికి ఎలాగయినా బుద్ధి చెప్పాలి'' అనుకోనింది.
''కోతిబావా... నా దగ్గర పళ్ళూ కాయలూ ఏవీ లేవు. కావాలంటే నిన్ను నామీద ఎక్కించుకోని అడవంతా అలా సరదాగా తిప్పుతా... ఏమంటావు'' అనింది.
కోతికి ఈ ఆలోచన నచ్చింది. ''హాయిగా కాళ్ళు నొప్పి పెట్టకుండా అడవిని చూడొచ్చు గదా'' అనుకోని సరే అనింది.
గుర్రం కడుపు నిండా నీళ్ళు తాగగానే కోతి దానిపైకి ఎక్కి కూచోనింది. గుర్రం కొంచెం దూరం నెమ్మదిగా పరిగెత్తుతూ, ఒక్కసారిగా వేగం పుంజుకోనింది. ఆ వేగానికి కోతికి కళ్ళు తిరగసాగినాయి. గుర్రం మెడను గట్టిగా పట్టుకొని ''నెమ్మదిగా... నెమ్మదిగా పరిగెత్తు... పడిపోయేటట్టు వున్నాను'' అనింది వణికిపోతూ.
గుర్రం మరింత వేగం పెంచుతా ''కోతిబావా... కాసేపు ఓపిక పట్టు, సింహం గుహ నుంచి బైటకు పోయే లోపల దానిని చేరుకోవాలి'' అనింది.
సింహం పేరు చెప్పగానే కోతి అదిరిపడింది. ''సింహం దగ్గరకా... ఎందుకు'' అనింది భయం భయంగా.
''ఏం లేదు బావా... నీకు అప్పజెప్పినట్టే నాకూ ఏదో ఒక చెరువో, నదో ఇవ్వమని అడుగుతా... అప్పుడు హాయిగా కాలు మీద కాలేసుకోని పనీపాటా చేయకుండా నీలాగే బతికేయొచ్చు'' అనింది.
ఆ మాటలకు దానికి గొంతులో వెలక్కాయ పన్నట్టయింది. సింహం దగ్గరికి పోతే ఇంకేమన్నా వుందా... నా పేరు చెప్పి అడవి జంతువులను ఇన్ని రోజులు మోసం చేశావా అంటూ పంజాతో ఒక్కటి పెరికిందంటే చచ్చూరుకుంటాది. దాంతో గుర్రాన్ని బతిమలాడుతా...
''మామా... ఏమీ అనుకోవద్దు. నేను చెప్పిందంతా అబద్దం. ఏదో బుద్ధి గడ్డి తిని పొరపాటు చేశాను. ఈ ఒక్కసారికి వదిలేయి. ఇంగెప్పుడూ ఈ అడవికి రాను. నన్ను సింహం దగ్గరకి తీసుకోని పోవద్దు'' అనింది కళ్ళనీళ్ళతో. గుర్రం ఒక్కసారిగా ఆగిపోయింది. అది అలా హఠాత్తుగా ఆగిపోయేసరికి దానిపైనున్న కోతి పట్టుతప్పి ఎగిరి ముందున్న చెట్టుకు ఠపీమని కొట్టుకొని ముక్కు పచ్చడైంది.
కోతి ముక్కుతా మూలుగుతా లేచి నిలబడి వెనక్కి తిరిగి చూడకుండానే వూరివైపు పరుగు తీసింది.