నల్లగొండ కథలకు పుట్టినిల్లు. ఉమ్మడి జిల్లాలో విస్తృతమైన కథా సాహిత్యం వెలువడింది. ఆనాటి బండారు అచ్చమాంబ మొదలు నిన్న మొన్నటి సాగర్ల సత్తయ్య వరకు వైవిధ్యభరితమైన కథాసాహిత్యం వెలువడింది. కథలను పిల్లలు బాగా ఇష్టపడతారు. అమ్మమ్మ చెప్పే కథలతో శ్రవణ నైపుణ్యం పొందుతారు. గొప్ప వ్యక్తిత్వం కూడా కథల వినికిడి తోనే రూపొందుతుంది.
సాహిత్యంలో కథా ప్రక్రియ గొప్ప స్థానాన్ని పొందింది. జిల్లాలో పిల్లల కోసం అనేక కథలను పెండెం జగదీశ్వర్ రచించి బాలసాహిత్యంలో ధ్రువ తారగా వెలుగొందాడు . జిల్లాలో కనుమరుగవుతున్న బాలసాహిత్యాన్ని బాలలే రచించిన కథలతో ఇటీవల ఉప్పల పద్మ సంపాదకత్వంలో నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం వెలువడింది. ఇందులోని కథలన్నీ పిల్లలు రాశారు. మొత్తం 45 కథలున్నాయి. ఇందులో ఒక్కొక్క కథ ఆణిముత్యం లాంటిది. ఇందులోని కథలకు చిత్రాలను ప్రముఖ చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ అలాగే ప్రముఖ కార్టూనిస్ట్ వడ్డేపల్లి వెంకటేష్, ప్రముఖ జర్నలిస్ట్ పాటి మోహన్ రెడ్డి,చెంచల వెంకట రమణ, చిరంజీవి చిలుకూరి హరి నందన కథానుగుణంగా బొమ్మల్ని అందించారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
అయితే ఈ కథల పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది యూఎస్ఏ లోని ఓహియోలో తొమ్మిదవ తరగతి చదువుతున్న రిషి వర్షిల్ నెలకుర్తి గొప్ప దాతృత్వాన్ని అందించాడు. తాను స్వయంశక్తితో సంపాదించిన డబ్బు తన వయసు పిల్లలకు ఉపయోగపడాలని విశాల దృక్పథంతో ఈ పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం అందించాడు. వయసు చిన్నదైనప్పటికీ ఉన్నతంగా ఆలోచించి బాల సాహిత్య చరిత్రలో నిలిచిపోయే మహత్కార్యాన్ని కి పూనుకున్నాడు. ఆ వయసు పిల్లలకు ఆ మాటకొస్తే అందరికీ కూడా ఆదర్శనీయుడు.
పుస్తక పఠనం..... సృజనకు సోపానం అంటూ ఈ పుస్తకానికి తన చిన్న చేతులతో పెద్ద సాహిత్య వ్యాసాన్ని ముందుమాటగా అందించాడు. పుస్తకాలు విజ్ఞాన సంపద మరియు మానవతా విలువలు ఒక తరం నుండి మరొక తరానికి అందించబడతాయి అంటాడు. ప్రతి తర్వాతి తరం సమాజ శ్రేయస్సు కోసం మునుపటి తరం నిర్దేశించిన పునాదిని ఉపయోగిస్తుంది. ప్రతి ఒక్కరికి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఉండాలి అంటాడు.
ఈ కథల పుస్తకానికి "బాలల కథలు నాగార్జున సాగరం" అనే ముందుమాటను ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ రాశాడు. ఈ కథలు నల్లగొండ జిల్లా పిల్లలు చేస్తున్న గట్టి వాగ్దాన సంతకాలే కాదు తెలంగాణ నేలమీంచి మొలకెత్తుతున్న కథల చార్మినార్ లు. ఈ కథలన్నీ మన పిల్లల ఆలోచనలకు వారి వారి ఊహలకు చక్కగా అద్దం పడుతున్నాయి అంటాడు.
ఈ పుస్తకంలోని కథలు అన్ని వైవిధ్యభరితంగా ఉన్నాయి. చిలుకూరి హరి నంద రాసిన 'ఉపాయం', సాగర్ల శ్రీవర్ధన్ రాసిన 'మట్టి గణపతి', గాలి రమ్య రాసిన 'మార్పు' పాటి భానుజ రాసిన 'స్నేహం గొప్పతనం', దోటి వినేశ్ రాసిన స్నేహం కథలు కథా పఠనం పట్ల ఆసక్తిని పెంచుతాయి. ఈ కథలను చదవడం వలన హృదయానందమే గాక హృదయ సంస్కరణ జరుగుతుంది. నైతిక విలువలు కూడా అలవడతాయి. పిల్లలు రాసిన కథలు కావడంతో పిల్లలకు సులభంగా అర్థమవుతాయి. వాళ్ల మానసిక స్థాయి వాళ్లే రాయడం వలన పట్టణం పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల సాహితీవేత్త పెండెం జగదీశ్వర్ కు ఈ పుస్తకాన్ని అంకితమివ్వడం సముచితంగా ఉంది. ఆదిత్య స్థాయి కూడా పెరిగింది. అందుకు ఈ పుస్తక సంపాదకురాలు ఉప్పల పద్మ అభినందనీయురాలు. బాలల ప్రపంచం ఆమెకు జేజేలు పలుకుతోంది.
నల్లగొండ జిల్లా పిల్లల కథల బండి-- --- పెరుమాళ్ళ ఆనంద్-- 9985389506
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి