అప్ డేట్ అవ్వాలా: --వసుధారాణి.

చిన్నప్పుడు మా ఇంట్లో నాకు చాలా ఇష్టమైన చోటు మా వసారాలో దక్షిణం వైపు వుండే కిటికీ పక్క చోటు .తరువాత ఎక్కువ ఇష్టం  వెలుపలగా  అదే వైపు వసారా చూరు.కళ్ళ ముందు చూసినంత మేరా పొలాలు.ఆకుపచ్చని దుప్పటి క్రమంగా రంగులు మారుతూ నాకు తెలియని వయసులో నేను చేసిన ధ్యానం అలా ఆ పచ్చ రంగుల దుప్పటి కప్పుకోవటం.
బడిలో ఇష్టమైన చోటు చిన్న క్లాసుల్లో కింద కూర్చోవటమే కనుక మొదటి లైన్ తలుపు పక్కకి ఆఖరి పిరియడ్ లో చేరేదాన్ని.మిగిలిన ముందు పిరియడ్ లు అన్నీ వెనుక లైన్ లోనే.సాధారణంగా చాలా వరకు మధ్యాన్నం చివరి క్లాసుకు ఎప్పుడూ రావణబ్రహ్మ కథలు చెప్పే ఓ మాస్టారు వచ్చేవారు.కథలు చాలా ఇంట్రస్టుగా చెప్పే వారు విలన్ సెంటిమెంటు అంతగా పండించిన కథలు మళ్ళీ వినలేదు.
ఇల్లు ,బడి తరువాత ఊళ్ళో మాకు ఇష్టమైన ప్లేసులు వయసును బట్టీ , మారిన బడులను బట్టీ మారాయి కానీ ఎప్పుడూ (ఇప్పటికి కూడా) ఇష్టమైన చోటు గాంధీపార్కు.అసలు ఊళ్ళు అన్నింటిలో నెహ్రూకి,గాంధీకి అన్నేసి పార్కులు ఎందుకో , వాళ్ళు అన్ని పార్కులు ఏమి చేసుకుంటారో అర్ధం అయ్యేది కాదు.
చిన్నప్పుడు నేనూ, మా సావిత్రి అక్కయ్య కూతురు చిన్నారి,కిషోర్ చాలా సాయంత్రాలు గాంధీ పార్కులో ఆటలాడుతూ గడిపాము.పార్కు వెనకాల ఉన్న రైల్వే ట్రాక్,దానిపైన మేము ఆడుకునే టైమ్ లో వెళ్లే రెండు ప్యాసింజర్ రైళ్ళు. ఒక్కొసారి మా పంట పండితే గూడ్స్ రైలు కూడా.అందరు పిల్లలూ చేసినపనే రైల్లో వెళ్లే వాళ్ళకి టాటా చెప్పటం చేసేవాళ్ళం.
హైస్కూల్ కి వచ్చాక ఇష్టమైన చోటు గ్రౌండ్ లో ఉన్న రాళ్ళ కుప్ప పైన శిఖరాగ్రాన మనం ,అక్కడి నుంచి వరుసగా నే చెప్పే ఉత్తుత్తి కబుర్లు వినే స్నేహితురాళ్ళు.
పొలం వెళ్ళినప్పుడు ఎత్తుగా వుండే  మా పొలం తూరుపుగట్టు మీద మొదట్లో కాస్త చిన్నగా ఉండి నాతో పాటుగా ఎదిగిన నల్లతుమ్మ చెట్టు కింద చోటు. మరిచిపోలేని అనుభూతులకు ,భావోద్వేగాలకు సాక్ష్యం ఆ చోటు.రాణిలా, బేలగా,శ్రమజీవిగా, యజమానిగా,నిస్పృహగా ,ఆశాజనకంగా ఎన్ని భావాలో!
 సేద్యంలో కలిగే సాధక బాధకాలన్నీ ఆ నల్లతుమ్మ నీడలోనే.
ఆ తరువాత ఎన్ని ప్రదేశాలు తిరిగామో,కొత్త కొత్త ఆవిష్కారాలు ఎన్ని చేశామో. ప్రతి చోటూ ఒక చెలిమిని చూపింది,ఒక కలిమిని కలిగించింది.తినే గింజలమీదే కాదు  కంటిరెప్పపాటులపై  కూడా మన పేరిట దృశ్యాలు ముందే రాసివుంటాయేమో  అందుకే కొన్ని చోట్లు మనల్ని కూర్చోపెట్టేస్తాయి. 
ఆరడుగుల నేల చాలు అనుకునే వేదాంతం రావాలంటే ఎన్ని ప్రదేశాలను అంటుకుని వదిలేయాలో ? పట్టుకోవటం సనాతనం ,వదిలేయడం పురాతనం. కొంపదీసి నేనేమన్నా అప్ డేట్ అవ్వాలా?


కామెంట్‌లు