ఉపాధ్యాయపర్వం-19: రామ్మోహన్ రావు తుమ్మూరి

నాకిప్పటికీ సందేహమే.అలా జరగాల్సి ఉంది కనుక అలా ప్రవర్తిస్తామా?అలా ప్రవర్తించడమ వల్లనే అలా జరుగుతుందా? బుద్ధిః కర్మానుసారిణీ అని మన వాళ్లు ఎన్నడో చెప్పారు.అలా అయితే బుద్ధి ని దోషి గా నిలబెట్టడం సరికాదు.కర్మానుగత ప్రభావమే మంచికైనా చెడుకైనా అనేకంటే ఎలాంటి మార్పుకైనా దారితీస్తుందని. దానికి మనకు కావలసినన్ని ఉదాహరణలున్నాయి.ఒక బోయవాడు  వాల్మీకి గావటం,ఒక వెర్రివాడు కాళిదాసు కావడం,నరేంద్రుడు వివేకానందుడు కావడం వంటివి చాలా ఉదాహరణలుగా దొరుకుతాయి.అలాగే పతనం చెందిన మచ్చులు కూడా కోకొల్లలు. దానినే ఆంగ్లభాషలో Change is the law of life.నాకు ఈ వాక్యం మీద గురి కాస్త ఎక్కువే.
నా జీవన గమనంలో దాని ప్రమేయం కూడా ఎక్కువే.తొమ్మిది పది నెలల పాటు సాగిన బియ్యెడ్ ట్రెయినింగ్ కొత్త వాతావరణంలోకి  నెట్టింది. తమ్ముడింటికి రెండు మూడు ఫర్లాంగుల దూరంలోనే వరంగల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది.కాలేజీకి నడిచి వెళ్లి వచ్చేవాణ్ని.లెసన్ ప్లాన్లు,రికార్డులు తయారు చేసుకోవడం మొదలైనవి మామూలే.మ్యాథమ్యాటిక్స్ లెక్చరర్ సమ్మారెడ్డి గారి మొదటి పీరియడ్ నాకింకా బాగా గుర్తుంది.అందర్నీ లేపి పరిచయాలు చేసుకొమ్మని అడిగారు.ఆ తరువాత మీ కిష్టమయిన టీచరు గాని లెక్చరరు గాని ఎవరు? అని అడిగారు. ప్రశ్న అరికడితేనే ఆగిపోతే చాలా మంది ఏవో నాలుగైదు పేర్లు చెప్పేవారేమో అప్పటికెవరు గుర్తొస్తే వాళ్ల పేర్లు.కానీ ఆయన ఎందుకో కూడా చెప్పాలి అనేసరికి అందరూ సైలెంటైపొయ్యారు.
అప్పుడాయన ఏదో ఒక రూల్ నంబరు చెప్పి ఆ నంబరు గల విద్యార్థిని లేపి అడిగారు.ఇక తప్పదని ఏ రూల్ నంబరుని పిలిస్తే వాళ్లు లేచి చెప్పారు.
నాది రూల్ నెం. 8. నా నంబరు పిలుస్తారో లేదో అనుకుంటూనే ఒక వేళ పిలిస్తే ఎవరి పేరు చెప్పాలి,అతని గురించి ఏం చెప్పాలి అనడానికి నా వద్ద సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి.The ever best teacher in my life is Laxmirajam sir,my science teacher in school.ఆ తరువాత చెప్పాల్సి వస్తే ఇద్దరు ముగ్గురున్నారు. 
కొంచెం సేపు కాగానే నన్ను పిలవటం జరిగింది.లేచి సమాధానం చెప్పాను.మిగతా విద్యార్థుల్లా తడబడకపోవటం ఆయన గమనించారు.అప్పటికే వేయాల్సిన నాటకాలన్నీ స్టేజీల మీద వేసిన వాణ్ని కనుక నా సమాధానం సమ్మారెడ్డిగారికే కాదు, మిగతా విద్యార్థులందరికీ నచ్చింది.అసంకల్పితంగానే అందరూ చప్పట్లతో అభినందించారు. ఓ రకంగా ఆ రోజే చాలామంది దృష్టిలో పడటంతో 
అతి త్వరలోనే చాలామంది మిత్రులయ్యారు.వారంతా ఇప్పుడక్కడ ఉన్నారో? బియ్యెడ్ ట్రెయినింగ్ లో మరచి పోలేని అనుభూతిని మిగిల్చిన విషయం సోషల్ ఫారెస్ట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్లు.హంటర్ రోడ్ లో ఇప్పడున్న జూ ప్రాంతమంతా అప్పుడు మైదానంలా ఉండేది.దగ్గర దగ్గర వారం రోజుల పాటు మొక్కలు నాటాము.అక్కడే కలిసి భోజనాలు చేసాం. చాలా సరదాగా గడిపాం.అయితే మా అందరికీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మాత్రం మిమిక్రీ హరికిషన్.అప్పటికి అతను అంత పాపులర్ కాలేదు కాని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు.బాగా ఎంటర్టెయిన్ చేసేవాడు.నన్ను బాబాయ్ అని పలుకరించటం మరచిపోలేదు.ఆ తరువాతి కాలంలో ఆయన చాలా పెద్ద ఆర్టిస్టు అయ్యారు.అనేక టీ.వీ.షోస్ లో పాల్గొన్నారు.పాపం ఇటీవల ఆయన పోయారు. బార్న్ టాలెంట్ ఆయనది.ఏ ప్రిపరేషనూ లేకుండా అనేక మంది ధ్వన్యనుకరణ చేసేవాడు. చాలా గొప్ప స్థాయికి చేరుకున్నాడు.దురదృష్టం ఏమిటంటే తాగటం అతని బలహీనత.ఆదే ఆయన ప్రాణాలను 57 వయసు లోనే బలితీసుకుం ది. ముందే చెప్పాను గదా ‘సహసా విదధీత నక్రియాం’అని. నేనుండే ఇంటి దగ్గరే అతనూ రూం తీసుకుని ఉండే వాడు.అక్కడే కాగజ్ నగర్ మిత్రులుండే వారు.మేమందరం ఎన్నో సాయంత్రాలు అతనితో గడిపాం. అంటే తాగుతూ అని కాదు.అతని మిమిక్రీ వింటూ.చాలా మంచి మనిషి.స్నేహశీలి.చాలా సరదాగా కలివిడిగా ఉండేవాడు.అందుకే మంచీ చెడు పడుగు పేకల్లాగా కలగలిసి ఉంటాయి అని అంటారేమో.నా గురించి ఏ చెడు ఎవరు చెప్పుతారో  నేను చెప్పలేను గదా!(సశేషం)


కామెంట్‌లు