196.మనోబలముంటే ఎంత కష్టమైనా దాటొచ్చు::బెలగాం భీమేశ్వరరావు-9989537835.

2014 సంవత్సరం అక్టోబరు రెండవ వారం!తూర్పు మధ్య బంగాళాఖాతంలో పెను తుఫాను
ఏర్పడింది. ఆ తుఫానుకు హుధుద్ నామకరణం
చేశారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఉత్తరాంధ్ర జిల్లా
లను అతలాకుతలం చేసింది. ప్రత్యేకించి విశాఖ
నగరం మీద పగబట్టింది.ఆ తుఫాను ధాటికి
చెట్లన్నీ నేల కూలిపోయాయి. భవనాలు నాశన
మయ్యాయి.మంచి నీటి సరఫరా ఆగిపోయింది.
సెల్ టవర్లు కూలిపోయాయి. ఫోన్లు పని చేయలేదు.విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పరిశ్రమలు ఆగిపోయాయి.వైద్య సేవలు నిలిచి
పోయాయి. వేలాది విద్యుత్ స్థంభాలు నేల 
కొరిగాయి.ఇనప స్థంభాలు వంకరటింకరగా 
వంగిపోయాయి.పేదల ఇళ్ళు నేలమట్టమయ్యాయి.కాయగూరలు, పాలు
నిత్యావసర దినుసులు కరువయ్యాయి.ప్రజల
కష్టాలు చెప్పనలవి కానివయ్యాయి.తుఫాను
తగ్గేక మా చిన్నమ్మాయి గాయత్రి ఇంటికి
వెళ్ళినప్పుడు విశాఖను చూశాను. అందమైన
విశాఖ అందవిహీనంగా కనిపించింది. తుఫాను
రోజుల్లో ఆ నగరం ఎలా ఉండి ఉంటుందో
ఊహించగలం.పూర్వం మునీశ్వరులు ప్రశాంతంగా
తపస్సు చేసుకొనే వనాలను రాక్షసులు దాడి చేసి
ఇలాగే పాడు చేసి ఉండేవారేమో అన్న ఆలోచన
కలిగింది. ఆ ఆలోచన నుంచి పుట్టేదే "హుధాసుర
గర్వభంగం"అనే గేయకథ!బాలభారతం పత్రికకు
పంపేను. నెలలు గడిచాయి గాని పత్రికలో రాలేదు. నేనే ఫోన్ చేసి హుధుద్ తుఫాను వచ్చి
యేడాది కావస్తుంది ఈ యేడాది లోపు గేయకథను
ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను.మర్నాడు బాలభారతం నుంచి ఫోన్
వచ్చింది. గేయకథ చాలా పెద్దదిగా ఉంది.అచ్చులో
ఒక పేజీకి సరిపోయినట్టు కుదించి పంపండని
చెప్పారు.వర్తమానానికి సందేశమిచ్చేలాగ ఉండాలన్నారు. సంపాదకవర్గం కోరిన రీతిలోనే గేయకథ తయారు చేసి పంపేను.
2015 సెప్టెంబర్ నెలలో ప్రచురించారు. ఇక
గేయకథలోకి వెళ్దామా!//ఉత్తరాంధ్ర ప్రాంతమందు/
'విశాఖ'యను నగరు కలదు/పచ్చదనం తోడ నగరు/అలరుచుండె శోభిల్లుతు//సంద్రతీర
సొగసులతో/పచ్చనైన కొండలతో/ముచ్చటైన రోడ్ల
తోను/ముద్దుగాను నగరు ఉండె//ఆ చక్కని నగరంబును/అసురుడొకడు చూచెనంత/అసూయతో ఆ నగరును/పాడు చేయ తలచెనంత//వెనువెంటనె ఆ అసురుడు/
హుధాసురుని రూపమెత్తె/ప్రభంజనం సృష్టించీ/
నగరమును చుట్టుముట్టె//పచ్చదనము అందమంత/చూస్తుండగ మట్టి కలిసె/చక్కనైన
నగరమంత/కకావికల మవ్వసాగె//రహదారులు
విచ్చిపోయి/రాకపోక లాగిపోయె/విద్యుత్ స్థంభములన్ని/మెలితిరుగుతు కూలిపోయె//
ప్రళయమొచ్చె ననుకొనుచు/బిక్కుబిక్కుమనిరి
జనులు/వింత ధ్వనులు వినిపించగ/భయభ్రాంతులు చెందె ప్రజలు//పాడుపడిన నగరు
చూచి/హుధాసురుడు తృప్తి చెందె/నాశమయిన
నగరు ఇంక/బాగవదని మురిసి వెడలె//
హుధాసురుడు వెళ్ళగాను/ప్రజలందరు జట్టు
అయిరి/పాలకులకు తోడుగుండి/శ్రమపడుటకు
సిద్ధపడిరి//జబ్బులు వ్యాపించకుండ/శుభ్రపరచె
నగరమంత/పచ్చదనం ప్రతిష్ఠించ/మొక్కలెన్నో
నాటెనంత//ప్రాంతభేద మరయకుండ/చేయి చేయి కలిపిరంత/క్రమముగాను కష్టములను/
గట్టెక్కెను జట్టుగాను//కొన్ని నాళ్ళు దాటగానె/
ప్రకృతంత చిగురించెను/కనులవిందు చేయునట్లు/పచ్చగాను శోభిల్లెను//పొగరు హెచ్చి నగరు చూడ/అసురుడొచ్చె ఒక దినమున/తేరు
కొన్న నగరు చూచి/దిమ్మ తిరిగె ఆ క్షణమున//
ఉక్కు గుండె జనుల ముందు/ఓడెను ఆ అసుర
గుణము/జోహారులు ప్రజల కనుచు/వెన్ను చూపె
హుధాసురుడు//ఐక్యతతో మనముంటే/అసుర 
క్రీడ అంతరించు/మనోబలము తోడుగుంటె/
మనకు జయము సంతరించు//ఇదండీ హుధాసుర గర్వభంగం గేయకథ తయారయ్యే
రీతి!(సశేషం)