బాలసాహిత్యం--58: శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 7013660252

ప్రముఖ బాల సాహిత్య రచయిత బెలగాం కేశవరావు గారు విజయనగరం జిల్లా పార్వతీపురం తాలూకా పార్వతీపురం లో జన్మించారు. వీరు రాజేశ్వరి, గంగారాం దంపతులకు 13 డిసెంబర్ 1959లో జన్మించారు. వీరు ప్రముఖ బాల సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన బెలగాం భీమేశ్వరరావుగారు, ప్రముఖ బాల సాహిత్యవేత్త అయిన బి.వి. పట్నాయక్ గారి యొక్క సోదరులు. ఒకే ఇంటి నుండి ముగ్గురు బాల సాహిత్య వేత్తలు జన్మించడం, బాలసాహిత్య లోకానికి ఎనలేని సేవలు చేయడం  సాహితీలోకం  గర్వించదగ్గ విషయం. వీరి తండ్రి గారైన కీర్తిశేషులు గంగా రామ్ గారు పార్వతీ పార్వతీపురం మున్సిపాలిటీలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేసే వారు. గంగారంగారు ఉపాధ్యాయులు  అవడంచేత పిల్లల చదువుల పట్ల వారి బాల్యము నుండి శ్రద్ధ వహించేవారు. తండ్రిగారి కృషి వలన కుటుంబంలో ఉన్న సంతానమంతా మంచి విద్యావంతులయ్యారు. కుటుంబమంతా  ఐకమత్యతతో మెలిగి ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. కేశవరావుగారు 1964 నుండి 1969 వరకూ ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ పార్వతీపురం మున్సిపాలిటీ వారి  వీధి బడిలో  చేరి చదువుకున్నారు. కేశవరావు గారి తండ్రి ఉపాధ్యాయులవడం చేత తండ్రిగారితోనే తను పాఠశాలకు వెళ్లేవారు. తండ్రి గంగారాం గారు మాతృభాషపై పట్టు సాధించే విధముగా పిల్లలను బాల్యం నుండి తీర్చిదిద్దారు. కేశవ రావు గారు ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ (1969 నుండి 1974 వరకూ ) పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల బ్రాంచ్ హై స్కూల్ లో చదివారు. అలానే ఇంటర్మీడియట్ 1974 సంవత్సరం నుండి 1976 వరకూ పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. కేశవరావుగారి తండ్రి, అన్నదమ్ములు ఉపాధ్యాయులు కావడం చేతనే వీరికి ఉపాధ్యాయ శిక్షణ పై ఆసక్తి కలిగింది.1977- 78 సంవత్స రంలో శ్రీకాకుళం జిల్లా ఉమరవిల్లిలో ఉపాధ్యాయ శిక్షణ పొందడం జరిగింది . అక్కడ ఉపాధ్యాయ శిక్షణ పొందే 
సమయలోనే ప్రాంతీయ పక్ష పత్రిక " నాగావళి " లో తన రచన “ ఎక్కడ?”  అనే గేయం 1978 నవంబరులో  ప్రచురితమైంది. అప్పటినుండి కొన్నాళ్లుగా కేశవరావు గారి రచనలు నాగావళి పత్రికలో ప్రచురింపబడ్డాయి. మొదటిగా సాంఘిక కథలను, కవితలను “ శ్రీ కేశ్ " అనే కలం పేరుతో రాసేవారు. ఆంధ్ర సచిత్ర వార పత్రిక, యువ, జయశ్రీ, ఆంధ్రప్రభ, సాక్షి పత్రికల్లో ప్రచురితం అయ్యేవి. వీరి సోదరుడు బెలగాం భీమేశ్వరరావుగారి బాలసాహిత్యం స్పూర్తితో 1982 వ  సంవత్సరం నుండి బాల సాహిత్యం వైపు దృష్టి మళ్ళించారు.  బాల సాహిత్యం లో మొదటి సారిగా విశాఖపట్నంలో  మ.సూ.న గారి సంపాదకత్వంలో వెలువడిన " శుభోదయం" లో జాతిపిత బాల గేయం ప్రచురింపబడింది. అప్పటినుండి బాల రంజని, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, చిన్నారి,  ఈనాడు హాయ్ బుజ్జి, ఆంధ్రజ్యోతి లిటిల్స్, భక్తి సమాచారం, శ్రీవాణి పలుకు,  బాలల విజయం,  వార్త,  ప్రజాశక్తి, విశాలాంధ్ర వంటి పత్రికలలో సుమారు రెండు వందల వరకు రచనలు ప్రచురితమయ్యాయి. 2010 మే నెలలో “ రూమ్ టు రీడ్” జాతీయ సంస్థ హైదరాబాద్ వారు ఆరు సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లల మనస్తత్వాన్ని తగ్గట్టు కథారచనల  పోటీలో “ శంకరం తెలివి” అనే కథకు కేశవరావుగారు తృతీయ బహుమతి పొందారు. ఈ కథకు బహుమతి పొందినందుకుగాను ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతి పది పదిహేను వందల రూపాయలు అందజేశారు. పార్వతీపురం మండలం అడ్డాపుశీల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండేటప్పుడు సర్వశిక్ష అభియాన్, విజయ నగరంవారు నిర్వహించే "బాలల విజయం"  పిల్లల పత్రిక కార్యశాలకు మండలం తరపున తరచుగా వెళ్లడం జరిగేది. 2014 మే నెలలో శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి ఆధ్వర్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ బాలల కథల సంకలనంలో  " కష్టం విలువ" అనే కథకు చోటు దక్కింది. 2015 జూలై నెలలో గోదావరి మహా పుష్కరాల సందర్భముగా బాలసాహిత్య వేత్తలకిచ్చే  పురస్కారాన్ని పొట్లూరి హరికృష్ణ గారిచే విజయనగరం జిల్లా పరిషత్తు హాలులో అందుకోవడం జరిగింది. 2018 సెప్టెంబర్ 5 న కేశవరావుగారు జిల్లా కలెక్టర్ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జరిగింది. 2018 నవంబర్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ ఆర్గనైజేషన్ వారిచే గురుదేవోభవ అవార్డు విశాఖ పౌర శాఖ గ్రంథాలయంలో అందుకున్నారు. ఇలా ఎన్నో పురస్కారాలు కేశవరావు గారు పొందారు. 2019 సెప్టెంబరు 24న కేశవరావుగారి కథల సంపుటి “ దెబ్బకు ఠా.... దెయ్యాల ముఠా ”  పుస్తక రూపంలో వచ్చింది. దీని ఆవిష్కరణ హైదరాబాద్ గానసభ ఆడిటోరియంలో ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ గారిచే  సన్మానం కూడా జరిగింది. ( సశేషం )