ఉత్తమ బాల సాహిత్యం పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆలోచనలను రేకెతిస్తుంది. ప్రేమ, విశ్వాసం, నిస్వార్థం, న్యాయం, ఉత్సాహం, గౌరవం, బాధ్యత, సమాజం పట్ల నమ్మకం, విలువలు లాంటి ఎన్నో మంచి లక్షణాలను పెంపోదిస్తుంది. మంచి లక్షణాలను అలవర్చే ప్రాధమిక సాధనమే బాల సాహిత్యం. అయితే… నేటి బాల సాహిత్యం తన ప్రాధమిక స్థాయి నుండి ఎదగవలసిన అవసరం ఉన్నది. పై లక్షణాలు పిల్లలకు అలవర్చడం మాత్రమే కాకుండా పిల్లల మానసిక సమస్యలను పరిష్కరించాలి. “పిల్లలకు శారీరక ఎదుగుదల ఎంత అవసరమో… మానసిక ఎదుగుదల కూడా అంతే అవసరం.” పిల్లలు ఎదిగే కొద్ది… అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. బాల సాహిత్యం వారి సమస్యలకు పరిష్కారం అవ్వాలి, పిల్లల సందేహాలకు, అనుమానాలకు సమాధానాలు ఇవ్వగలగాలి. సమాజంలో జరిగిన, జరుగుతున్నా అసమానతలపై అవగాహన కల్పించాలి, మంచి చెడును వివరించాలి, రాబోయే సమాజం కోసం ఎలాంటి కార్యకలాపాలు చేయాలో వివరించాలి. బాలసాహిత్యం తన పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని బాల సాహిత్యవేత్తలు గుర్తించకపోతే భావి భారతదేశాన్ని అంధకారంలోకి నెట్టేసినట్లే అవుతుంది.“సమాజ ప్రగతికి శాస్త్రీయ రూపం విద్య, కళాత్మక రూపం సాహిత్యం” ఈ రెండింటి సమ్మేళనంగా బాల సాహిత్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. తెలుగు భాషలో బాల సాహిత్యం 1920 ప్రాంతంలో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అంటే బాల సాహిత్యం స్వతంత్రం ముందు, స్వతంత్రం తర్వాత అని విభజించుకోవచ్చు. ఏ సాహిత్యం అయినా… ఆనాటి సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. నాటి సమాజాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతుంది. నాటి బాల సాహిత్యం… నైతిక, వైజ్ఞానిక, వినోదాత్మక వికాసాలను పెంపోదించింది. నేటి బాల సాహిత్యం తన రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నాటి బాలల సమస్యలు వేరు, నేటి బాలల సమస్యలు వేరు, నాటి బాలల ఆలోచనా విధానం వేరు, నేటి పిల్లల ఆలోచనా విధానం వేరు… కాలాన్ని బట్టి అన్నీ మారుతూ వచ్చినప్పుడు బాల సాహిత్యంలో కూడా మార్పులు అధికంగా రావాల్సిన అవసరాన్ని గుర్తించాలి.నాటి బాల సాహిత్యంలో దేవలోకం, దెయ్యాల లోకాలు, మాయాలు, మంత్రాలు, ఊహ సమాజం లాంటివి పిల్లలకు ఉపయోగపడ్డాయి అనడంలో సందేహం లేదు. కాని నేటి పిల్లలు అలా కాదు వారికి ఊహ లోకాల కంటే ప్రస్తుత సమాజాన్ని పరిచయం చేయవలసిన అవసరమే ఎక్కువగా ఉన్నది. లేనిది చెప్పడం కంటే… ఉన్నది చెప్పాల్సిన బాధ్యత బాల సాహిత్యకారులపై ఉన్నది. ప్రాచీనకాలం నుండే గ్రీకులు, రోమన్లు బాలల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బాలల్లో ధైర్య సాహసాలు, జాతీయ భావాలు నెలకొల్పాలని వారి భావన. భయం, భీభత్సం, మూఢవిశ్వాసాలు, పిల్లల మనస్సులో ప్రవేశించకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉన్నది. అలాగే బాల సాహిత్యం ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలి. మరి నేటి బాల సాహిత్యం చేస్తున్నది ఏమిటి? “నాలుగు మంత్రాలు, ఆరు పూజలు”.“పిల్లలు దేవుళ్లతో సమానం.”“పిల్లల వాక్కు బ్రహ్మ వాక్కు.”ఇలాంటి వాక్యాలకు కాలం చెల్లింది. లేనివాటిని, కచ్చితంగా చూపలేనివారిని పిల్లలకు పరిచయం చేయడం వల్ల వారి ఆలోచనా విధానాన్ని చిన్నప్పటి నుండే మార్చేసినవాళ్లు అవుతారు. బాల సాహిత్యం పిల్లలను తప్పకుండా ప్రభావితం చేయాలి… కాని అది తిరోగమనం వైపు కాదు. సమాజంలో రెండు వర్గాలు ప్రధానంగా ఉన్నాయనకుంటే… ఒకటి దేవుడిని నమ్మే వాళ్లు, మరొకటి నమ్మనివాళ్లు… రెండు వర్గాలు వారి వారి అభిప్రాయాలను చర్చలకు పెడుతూనే ఉన్నారు. ఇందులో ఎవరిది విజయం అంటే… దానికి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. దేవుడు ఉన్నడా? లేడా… అనేది ఆలోచించడానికి పిల్లలకు ఆలోచించే వయసు కావాలి… ఆ వయసు వచ్చే వరకు… దేవుడు, దెయ్యాల గురించి ప్రభావితం చేసే సాహిత్యం నుండి పిల్లలను దూరంగా పెట్టాలి.“The interest of child-hood and theYouth are the interest of mankind.అన్నారు అమెరికన్ రచయిత జేమ్స్ ఎలెన్. మానవ జీవితం సజావుగా సాగడానికి బాల్యం, యవ్వన దశ చాలా ముఖ్యమని వారి ఉద్దేశం. ఆ దశలలో ఉన్న వారి సాహిత్యం రాస్తున్న వారు అత్యంత జాగరణతో సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉన్నది.మానవ ప్రగతికి విద్య అవసరం… ఆ ప్రగతికి ప్రతిబింబమే సాహిత్యం. ఈ విషయాన్ని రచయితలు గుర్తించి సాహిత్య సృష్టి చేయాలి. అదే విధంగా పిల్లలను ప్రగతి వైపు నడిపించే సాహిత్యం కావాలి కానీ… తిరోగమన, హేతుబద్దంగా లేని ఆలోచనల వైపు కాదు. ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియాలో… బాల సాహిత్యం పిల్లలకు నాలుగు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పబడింది.1. To understand himself2. To understand others3. To understand his world and4. To understand his aesthetic valuesపిల్లలు తమను తాము అర్థం చేసుకోవడం, ఇతరులను అర్థం చేసుకోవడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, విలువలు తెలుసుకోవడం బాల సాహిత్యం చేయవలసిన పని. మరి నేటి బాల సాహిత్యం పిల్లలకు పైన చెప్పిన విధంగా ఉపయోగపడుతోందా? పిల్లలు తమను తాము అర్థం చేసుకోవాలంటే… పెద్దల వ్యక్తిగత అభిప్రాయాలు సాహిత్యంలో చొప్పించకూడదు… కథల్లో పాత్రల ఎమోషన్స్ ని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి… తమ చుట్టూ ఉన్న నేటి సమాజాన్ని చూపకుండా… ఊహ లోకాలు చూపడం ఎంతవరకు సమంజసం? ఊహ లోకాలు చూపించిన వారు చూపారు… ప్రస్తుత బాల సాహిత్యవేత్తలకు కొత్త ఊహ లోకాలు చూపాల్సిన అవసరం లేదు.బాల సాహిత్యం ఎలా అయితే… తన పరిధిని పెంచుకుందో… అలాగే తన ఆలోచనా విధానాన్ని, పంథాను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక మలుపు తిరగాల్సిన సమయం ఆసన్నమైంది. బాల సాహిత్యాన్ని మూడు రకాలుగా బాలల అకాడమీ విభజించింది.1. శిశు సాహిత్యం (0 నుండి 6 సంవత్సరాల వయసు)2. బాల సాహిత్యం (7 నుండి 10 సంవత్సరాల వయసు)3. కిశోర సాహిత్యం (11నుండి11 సంవత్సరాల వయసు)ప్రస్తుతం ఈ విభజనను మార్చాల్సిన అవసరం ఉన్నది.1. 0 నుండి 3 సంవత్సరాల వయసు (ఎవరైనా చెప్తే వినే దశ)2. 3 నుండి 6 సంవత్సరాల వయసు (తమకు తాముగా చదువుకునే దశ)3. 7 నుండి 10 సంవత్సరాల వయసు (సమాజం పట్ల అవగాహన చేసుకోవాల్సిన దశ)4. 11 నుండి 14 సంవత్సరాల వయసు (మంచి, చెడు విశ్లేషణ)వాస్తవానికి నేటి పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. కనుక వారి ఆలోచనలకు తగినట్లు బాల సాహిత్యం ముమ్మాటికి రావడం లేదు. వారికి ఉపయోగపడే సాహిత్యం నామమాత్రంగానే ఉన్నది. ఐదవ తరగతి పిల్లవాడు సైన్సు ప్రాజెక్ట్ చేస్తుంటే… అరవై సంవత్సరాల బాల సాహిత్యవేత్త మూఢనమ్మకాలు, ఊహ లోకాల గురించి చెప్తే… ఆ సాహిత్యాన్ని పిల్లలు చదువుతారా?... బాల సాహిత్యంలో సైన్సు ఫిక్షన్ రావాల్సిన అవసరం లేదా? పిల్లల కోసమే కదా…. ఏముందిలే అని రాసే రచయితలే ఎక్కువగా ఉన్నారు… పిల్లల కోసం రాసే సాహిత్యం సార భూతంగా ఉండాలన్న విషయం చాలా మంది రచయితలు తెలియకపోవడం, విస్మరించడం దురదృష్టకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే బాల సాహిత్యాన్ని ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. సినిమాలకు ఎలాగైతే… సెన్సార్ ఉంటుందో… ప్రతి సంవత్సరం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న బాల సాహిత్య పుస్తకాలను పరిశీలించడానికి… ఒక కమిటీ ఏర్పాటు చేయాలి.ఆచార్య తిరుమల గారు బాల సాహిత్యం గురించి ఒక మాట అన్నారు. “మనకు బాల శిక్ష ఉంది కాని బాల రక్ష లేదు”. ఈ వాక్యం యొక్క ప్రాముఖ్యతను అటు ప్రభుత్వాలు, ఇటు బాల సాహిత్యవేత్తలు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. బాలలను రక్షించేది బాలసాహిత్యంపై వచ్చే విమర్శే.
బాలశిక్ష కాదు బాలరక్ష కావాలి: ---జాని తక్కెడశిల -ప్రతిలిపి తెలుగు వెబ్సైట్ మేనేజర్ 7259511956
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి