ప్రత్యుపకారం (బాల సాహిత్య కథ): రచన : కందర్ప మూర్తి , హైదరాబాదుమొబైల్ : 8374540331.

తిమ్మాపురంలో రంగయ్య పేదరైతు. కొద్ది పాటి భూమిలో
వ్యవసాయం చేసుకుంటు కొడుకు నారాయణను పక్క ఊరి
పాఠశాలలో చదివిస్తున్నాడు.
       వర్షాలు సరిగ్గా కురవక పంటలు ఎండి రాబడి లేకపోయినా
కొడుకును క్రమం తప్పకుండా రోజూ పాఠశాలకు పంపు
తున్నాడు. గ్రామంలోని మిగతా రైతులు వారి పిల్లల్ని తమ
వెంట వ్యవసాయ పనులకు తీసుకెల్తూంటారు.
       నారాయణ చురుకైన తెలివైన అబ్బాయి. రోజూ ఉదయం
పక్క ఊరి పాఠశాలకు నడుచుకుంటూ పుస్తకాల సంచిలో
మొక్కజొన్న కంకులు, పిల్లన గ్రోవి వెంట తీసుకెల్తూంటాడు.
      ఊరి పొలిమేరలో ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద కొద్దిసేపు
కూర్చొని పిల్లనగ్రోవితో  చక్కటి పాటల్ని  వాయించి వెంట
తెచ్చుకున్న మొక్క జొన్నల్ని తిని కంకుల్ని చెట్టు పక్క పొదల్లో
పడేసేవాడు.
   పొదల దగ్గర బొరియలో ఒక కుందేలు నివాసం ఉంటోంది.
అది రోజూ నారాయణ విసిరివేసిన మొక్కజొన్న కంకుల నుంచి
మిగిలిన గింజలు తిని కడుపు నింపుకునేది.
   ఆ మర్రి చెట్టు మీద ఒక భూతం కూడా నివసిస్తోంది. అది
రోజూ నారాయణ పిల్లనగ్రోవితో వినిపించే సంగీతం విని
ఆనందించేది.
     కుందేలు , భూతం ప్రతి దినం ఉదయం నారాయణ రాక
కోసం ఎదురు చూసేవి. పాఠశాల శలవు రోజున మరే కారణం
తో  అతను చెట్టు దగ్గరికి రాకపోతే వాటికి తోచేది కాదు.
     చెట్టు మీదున్న భూతం, బొరియలోని కుందేలు  నారాయణ కి ఏదైనా మేలు చెయ్యాలనుకున్నాయి.


         ఊరి షాహుకారు కూతురు ఇంట్లో స్నానం చేస్తు మెడ
లోని  బంగారు నగ స్నానాల గది గోడమీద ఉంచింది. అటుగా
వచ్చిన కాకి తినే వస్తువనుకుని నగను నోటితో కరుచుకుని
ఎగిరిపోయింది. విషయం తెల్సిన షావుకారు మనుషుల్ని
పెట్టి వెతికించినా కాకి జాడ కన్పించ లేదు.
       కాకి తిన్నగా ఎగురుకుంటూ పోయి మర్రిచెట్టు కొమ్మ మీద
వాలి బంగారు నగను తిందామను కుంటే సాధ్యం కాక కింద
పడేసింది. బంగారు నగ జారి తిన్నగా కుందేలున్న బొరియ
వద్ద పడింది.
     కుందేలు ఆ నగను నారాయణకు కానుకగా ఇవ్వాలనుకుని
చెట్టు మొదట్లో పెట్టింది.
   రోజూలాగ వచ్చిన నారాయణ బంగారు నగను చూసి ఎవరో
 పారవేసుకున్నారనుకుని తలిచి తీసుకెళ్లి తండ్రి రంగయ్య
కిచ్చాడు.
    నిజాయతీ పరుడైన రంగయ్య ఎవరో బంగారు నగ
పోగొట్టుకున్నారని గ్రామాధికారికి అప్పగించాడు.
    పోగొట్టుకున్న బంగారు నగ  గ్రామాధికారి వద్ద ఉందని
తెలిసి షావుకారు వచ్చి ఆ నగ తన కూతురు స్నానం చేస్తూండగా  కాకి తీసుకు పోయినట్టు వివరాలు చెప్పగా
గ్రామాధికారి నగను ఇచ్చేసాడు.
      షావుకారు రైతు రంగయ్య నిజాయితీకి మెచ్చి సాగుకి
కావల్సిన ఎరువులు విత్తనాలు ఉచితంగా అందచేసాడు.
వాటితో రంగయ్యకు  పంటలో దిగుబడులు పెరిగి మంచి
ఫలసాయం దక్కింది.
        రోజూ వేణువుతో ఇంపైన సంగీతం వినిపిస్తున్న నారాయణ
కు భూతం కూడా ఎలా సాయపడాలని ఆలోచిస్తోంది.
      ఒకరోజు రాత్రి  కొంతమంది దారి దొంగలు  బంగారు నగల
మూటతో మర్రిచెట్టు కింద చేరి నగలు పంచుకునే విషయంలో
ఘర్షణ పడసాగేరు.
    దొంగల సవ్వడి విన్న భూతం వచ్చి వారిని భయపెట్టి చెదర
గొట్టి నగలమూట తెచ్చి నారాయణ కోసం మర్రిచెట్టు మొదట్లో
ఉంచింది.
     దొంగలు పక్క ఊరి నగల వ్యాపారిని దారి దోపిడీ జరపగా,
ఆ వ్యాపారి పోలిసు ఠాణాకెళ్లి తన బంగారు నగలు దారిదోపిడీ
జరిగినట్టు ఫిర్యాదు చేసాడు.
       ఎప్పటిలా పాఠశాల కెల్తూ మర్రిచెట్టు మొదట్లో కూర్చున్న
నారాయణకు నగలమూట కనబడింది. దాన్ని విప్పి చూసి
ఎవరో బాటసారి వాటిని మర్చిపోయారనుకుని తెచ్చి తండ్రి
కిచ్చాడు.
     రైతు రంగయ్య నగలమూటను భద్రంగా తెచ్చి గ్రామాధి
కారికి అప్పగించాడు.
     ఊరి గ్రామాధికారి పోలీసు ఠాణాకు కబురు పంపగా, నగలు
 దారి దోపిడీ జరిగినట్టు ఫిర్యాదు అందినందున నగల వ్యాపారిని రప్పించి గ్రామాధికారి వద్దకు వచ్చారు.
     నగలను గుర్తించిన వ్యాపారి  గ్రామాధికారి  భద్రంగా తన వస్తువులను అప్పగించినందుకు  అభినందనలు  తెలిపాడు.
      అభినందనలు తనకు కాదనీ నిజాయతీ పరుడైన ఊరి
రైతు రంగయ్యకు చెప్పమని గ్రామాధికారి అనగా సంతసించి
వ్యాపారి నగదు బహుమతితో సత్కరించాడు.ఊరిలో అందరు
రంగయ్య నీతి నిజాయితీలను అభినందించారు.
      మర్రిచెట్టు మీదున్న భూతం , బొరియలో ఉండే కుందేలు
తమ వల్ల నారాయణ కుటుంబానికి మేలు జరిగినందుకు
ఆనందపడ్డాయి.
                    *             *            *             *