సాహసనారి చిన్నారి - బాలల జానపద నవల ఐదవ భాగం- డా.ఎం.హరికిషన్ - కర్నూలు-94410 32212


 చుట్టూ ఏవో అరుపులు...


కేకలు...


గందరగోళం....


కాళ్ళూ చేతులు ఎవరో గట్టిగా పట్టుకొని లాగుతున్నట్లనిపించి యువరాణి వులిక్కిపడి కళ్ళు తెరిచింది.


పైకి లేవబోయింది.


కానీ సాధ్యపడలేదు.


కాళ్ళూచేతులు తాళ్ళతో గట్టిగా కట్టిపడేసి వున్నాయి.


చుట్టూ చూసింది.


ఎదురుగా కొన్ని పెద్ద పెద్ద కుందేళ్ళు కనబడ్డాయి.


ఒక్కొక్కటి మనిషి అంత ఎత్తుగా రెండుకాళ్ళ మీద నడుస్తూ వున్నాయి.


అవి లాస్య అరవకుండా నోటికి అడ్డంగా బట్ట కట్టాయి.


ఆ కుందేళ్ళు యువరాణిని ఒక పెద్ద వెదురుబొంగుకు వేలాడదీసి మోసుకుపోసాగాయి.


లాస్య చుట్టూ చూసింది.


మొత్తం లోయంతా పెద్ద పెద్ద చెట్లతో పచ్చగా వుంది.


చుట్టూ వున్న కొండలు నిట్టనిలువుగా నున్నగా వున్నాయి.


అవి ఎక్కి పైకి పోవడం అసాధ్యం.


అసలు అక్కడినుంచి పైన భూమి కనబడడం లేదు.


ఆ లోయలో అడుగడుగునా కుందేళ్ళు వున్నాయి.


అవన్నీ బంధించి వున్న లాస్యను చూస్తూ ఆనందంగా ఎగురుతూ, గెంతుతూ వెనకనే నడుస్తూ వస్తున్నాయి.


యువరాణికి తాను మనుషుల రాజ్యం నుంచి కుందేళ్ళ రాజ్యంలోకి వచ్చిపడ్డట్టు అర్థమైపోయింది.


మనుషులు ఎలా కుందేళ్ళను వేటాడతారో, అలాగే ఇక్కడ కుందేళ్ళు మనుషులను వేటాడుతున్నాయి.


భూమ్మీద నుండి లోయలోకి అంత పైనుంచి పడేటప్పుడు ఏ రాయి మీదనో పడితే అక్కడికక్కడే చావడం ఖాయం.


ఎవరైనా పొరపాటున నీళ్ళలో పడి తనలాగా బ్రతికి బట్టగట్టినా ఈ కుందేళ్ళ చేతిలో చిక్కి చావడం ఖాయం.


అందుకే ఇంతవరకు ఎవరూ ఈ లోయలోంచి బైటపడలేకపోయారు అనుకొంది.


కుందేళ్ళు యువరాణి లాస్యను తీసుకొనిపోయి కుందేళ్ళరాజు ముందు ప్రవేశపెట్టాయి.


''రాజా... పైనున్న మానవలోకం నుంచి మన లోయలోకి వచ్చి పడింది. ఏం చేయాలో మీరే చెప్పండి'' అన్నాయి.


కుందేలురాజు లాస్యవంక ఎగాదిగా చూస్తూ ''ఆహా... చాలా రోజులకు దొరికింది మానవకన్య.


చూడడానికి చాలా బలంగా, వీరురాలిలాగా కనబడుతోంది.


వెంటనే రాజ్యంలోని వీరులంతా విల్లమ్ములతో సిద్ధమై ఆదివారం నాడు ఆటస్థలంలోకి అడుగుపెట్టమని దండోరా వేయించండి.


అంతవరకు ఈ చిన్నదాన్ని కారాగారంలో బంధించి కమ్మని విందుభోజనం పెట్టండి. ఎక్కడికీ పారిపోకుండా మన వీరులను కాపలాగా పెట్టండి. ఆదివారం నాడు సిద్ధం చేసి ఆటస్థలంలో ప్రవేశపెట్టండి'' అని చెప్పాడు.


కుందేలు రాజ్యంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆట...


శత్రువును బాణాలతో వేటాడడం.


ఒక్కొక్కరికి రెండు అవకాశాలు మాత్రమే ఇస్తారు.


శత్రువు ప్రాణభయంతో అటూ యిటూ పరిగెత్తుతూ వుంటే గురి తప్పకుండా బాణం వదలాలి.


అలా ఎవరైతే గురి చూసి కొడతారో...


వాళ్ళకి రాజుగారి చేతుల మీదుగా విలువైన బహుమతులు అందజేయడమే గాక, సైన్యంలో మంచి పదవులలో నియమిస్తారు.


అందుకే రాజ్యంలోని వీరులంతా ఆ పోటీకి ఉత్సాహంగా ముందుకు వస్తూ వుంటారు.


విషయం తెలిసి యువరాణి ఒళ్ళు భయంతో గగుర్పొడిచింది.


''మనుషులకు జంతువులను ఎట్లా వేటాడి వేటాడి చంపడం సరదానో, అట్లాగే ఇక్కడ జంతువులకు మనుషులను వేటాడి చంపడం సరదా అనుకుంటా. ఎలా దీన్నించి బైటపడాలి'' అని ఆలోచించసాగింది.


ఎంత ఆలోచించినా  ఉపాయం తట్టడం లేదు.


''సమయం ఇంకా చాలా వుంది గదా... ఆలోచనలతో కుంగిపోవడం అనవసరం. అవకాశం కోసం ఎదురుచూద్దాం. అంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం'' అనుకొంది.


మూడురోజులూ వాళ్ళు పెట్టిన వన్నీ బాగా తింటూ వ్యాయామం, యోగా చేయసాగింది.


కారాగారం బైటవున్న కుందేళ్ళకు ఇది చానా వింతగా వుంది. 


మానవులు ఎవరైనా పైనుంచి పడి పట్టుబడ్డప్పుడు విడిచిపెట్టమని ఒకటే ఏడుస్తారు.


పారిపోవడానికి ప్రయత్నిస్తారు.


అన్నం సరిగా తినరు.


కానీ ఈ అమ్మాయికేంది పెదవులపై చిరునవ్వు తొలగడం లేదు అనుకున్నారు.


ఆదివారం రానే వచ్చింది.


ఆటస్థలమంతా కుందేళ్ళతో నిండిపోయింది.


అన్నీ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నాయి.


యువరాణిని తీసుకువచ్చి ఆటస్థలంలో వదిలిపెట్టారు.


కుందేళ్ళన్నీ ''హొ... హొ... హొ... అంటూ గట్టిగా లయబద్ధంగా అరుస్తూ చప్పట్లు కొడుతున్నాయి.


లాస్య చుట్టూ చూసింది.


కుడివైపు సింహాసనం మీద కుందేళ్ళరాజు కూర్చుని వున్నాడు.


ఆటస్థలంలోకి ఎవరూ రాకుండా చుట్టూ ఇనుప కంచె ఎత్తుగా కట్టారు.


లోపలికి రావడానికైనా, బైటికి పోవడానికైనా ఒకే ఒక ద్వారం వుంది.


ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించ సాగింది.


అంతలో కొన్ని కుందేళ్ళు వచ్చి లాస్య చేతులకు కట్టిన కట్లు విప్పాయి.


పదిమంది కుందేలు వీరులు చేతులలో విల్లంబులు పట్టుకొని లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళు వరుసగా ఒకరి వెనుక ఒకరు నిలబడ్డారు.


కుందేలురాజు పైకి లేచి నిలబడి ''ఇక ఆట మొదలుపెడదాం. ఈ మానవకన్యను మన వీరులలో ఎవరు అంతమొందిస్తారో, పదవులు ఎవరిని వరిస్తాయో చూద్దాం. భేరీలు మ్రోగించండి'' అన్నాడు గట్టిగా.


లాస్య చిరునవ్వుతో కుందేలురాజు వంక తిరిగి గట్టిగా ''రాజా... నాదో చిన్న కోరిక. ఈ పదిమందిలో ఎవరూ నన్ను బాణాలతో చంపలేకపోతే వదిలేస్తారా...


అట్లాగే వాళ్ళు నన్ను చంపేలోపల నేనే వాళ్ళను చంపొచ్చా.


ఐనా ఒకరు పారిపోతుంటే మరొకరు వేటాడడం వీరత్వం కాదు.


నిజంగా మీ రాజ్యంలో వీరులెవరైనా వుంటే నాతో పోటీకి సిద్ధం కమ్మనండి.


వుత్తచేతులతో వున్న ఒకరి మీదికి పదిమంది ఆయుధాలతో దాడి చేయడమేనా మీ రాజ్యంలో వీరత్వమంటే.


దమ్ముంటే నా చేతికి గూడా విల్లంబులు ఇచ్చి, ఆ పదిమందినీ  చంపమని పంపండి.


అప్పుడు తెలుస్తుంది మీ వాళ్ళలో నిజమైన వీరులెవరో'' అంది.


ఒక్కసారిగా అక్కడ గుండుసూది కిందపడ్డా వినబడేంత నిశ్శబ్దం ఆవరించింది.


ప్రజలంతా రాజు ఏమి చెబుతాడా అని ఎదురుచూడసాగారు.


ఇంతవరకు ఇలా సవాలు చేసినవారు ఎవరూ లేరు.


ఆ మాటలకు కుందేలురాజుకు రోషం ముంచుకు వచ్చింది.


అదే సమయంలో ఆమె ధైర్యం నచ్చింది


ఆమె మాటల్లో న్యాయం కనిపించింది.


కుందేలురాజు పైకి లేచి నిలబడ్డాడు. ''శభాష్‌ మానవకన్యా... శభాష్‌... రెండు వైపులా పోటీ వున్నప్పుడే ఆట రంజుగా వుంటుంది. సరే... మా వాళ్ళను పదిమందినీ ఒంటరిగా ఎదురించగలవా... నీ చేతనవుతుందా'' అన్నాడు.


యువరాణి వినయంగా తల వంచి ''మహారాజా... నేను సిద్ధం. పదిమందినీ ఒకేసారి ప్రవేశపెట్టండి. ఎదుర్కొంటాను'' అంది.


''ఆహా... అంత వీరురాలివా... సరే చూద్దాం. నీ వీరత్వం వుత్తమాటల్లోనే వుందా లేక చేతుల్లో గూడా వుందా... నిజంగా నీవు గెలిస్తే నీకు ఏ సహాయం కావాలన్నా అందిస్తాం'' అన్నాడు.


యువరాణి చిరునవ్వుతో సరే అంది.


రాజు సైగ చేయగానే భటులు విల్లంబులు తీసుకువచ్చి యువరాణి చేతిలో పెట్టారు.


కుందేలు వీరులు ఆటస్థలంలో చుట్టూరా అక్కడొకరు అక్కడొకరుగా నిలబడ్డారు.


ఇంతకు ముందు వాళ్ళు చాలా ధైర్యంగా వుండే వాళ్ళు.


ఎందుకంటే గెలిచినా, ఓడినా వాళ్ళకి ఏమీ అయ్యేది కాదు.


కానీ ఇప్పుడలా కాదు.


చావు రెండువైపులా వుంది.


బాణం సరిగా వేయలేకపోతే అవతలివైపు నుంచి వచ్చే బాణం మన గుండెల్ని చీల్చి వేస్తుంది.


అంతేకాదు ఆ మానవకన్య కళ్ళలో ఎటువంటి బెదురూ లేదు.


పెదవులపై చిరునవ్వు మెరుస్తూ వుంది.


నిటారుగా నిలబడి వింటి నారి సిద్ధం చేసుకుంటూ వుంది.


అదే వాళ్ళను భయపెడుతోంది.


కలవరపరుస్తోంది.


ఏం జరుగబోతుందో అనే ఉత్కంఠ వాళ్ళతో బాటు ప్రజలందరికీ పెరిగింది.


ఎక్కడా చిన్న చప్పుడు గూడా లేదు.


అందరి కళ్ళు ఆటస్థలంపైనే నిమగ్నమయ్యాయి.


అందరూ వింతగా లాస్య వంకే చూడసాగారు.


ఎంత ధైర్యం ఈ అమ్మాయికి.


ఒంటరిగా ఏ మాత్రం జంకూ, గొంకూ లేకుండా పదిమందిని ఎదుర్కోవడానికి సిద్ధపడుతోంది.


ఈ ఆటలో ఎవరు గెలుస్తారు....


మానవకన్యనా, కుందేలు వీరులా...


అందరి మనసుల్లో ఒకటే సందేహం.


రాజు ఆట ప్రారంభించమన్నట్లు చేయి పైకెత్తాడు.


వెంటనే సైనికులు కొమ్ము బూరలు పైకెత్తి గట్టిగా వూదారు.


భేరీలు మ్రోగించారు.


కుందేలు వీరులంతా లాస్య వైపు బాణాలు గురిపెట్టి ఒక్కసారిగా వదిలారు.


అన్ని దిక్కుల నుంచి శరవేగంగా దూసుకురాసాగాయి.


అవి దగ్గరికి రాగానే...


లాస్య ఒక్కసారిగా బలమంతా వుపయోగించి గాల్లోకి ఎగిరింది.


అంతే బాణాలన్నీ వచ్చి ఆమె నిలబడ్డచోట కింద పడ్డాయి.


అలా గాలిలోకి ఎగిరిన లాస్య కిందకు వాలకముందే ఒకేసారి రెండు బాణాలు తీసి విల్లుకు సంధించింది.


తన ఎదురుగా బాణాలు ఎక్కుపెడుతున్న కుందేళ్ళపైకి గురిచూసి వదిలింది.


అవి సర్రున దూసుకుపోయి...


కుందేళ్ళు ఎక్కుపెడుతున్న విల్లు మధ్య భాగంలో తాకాయి.


అంతే అవి ఫట్టుమని మధ్యకు విరిగి రెండు ముక్కలై ఎగిరిపడ్డాయి.


శత్రువుల్లో గందరగోళాన్ని సృష్టించి వాళ్ళు తేరుకునేలోపే అంతం చేయాలి అనేది యుద్ధసూత్రాల్లో ఒకటి.


లాస్య తిరిగి భూమిమీద వాలిన మరుక్షణమే


వేగంగా కుడివైపుకు పదడుగులు వేసి...


ఎడమవైపుకు తిరిగి నాలుగడుగులు వేసి...


అంతలో మరలా గాల్లోకి ఎగిరి మరో రెండు బాణాలు వదిలింది.


కుందేలు వీరులకంతా అయోమయంగా వుంది.


లాస్య ఎటువైపు వెళుతుందో...


ఎటువైపు బాణాలు వేయాలో...


అర్థం కాక బాణాలు ఎక్కుపెట్టి దిక్కులు చూడసాగారు.


లాస్య ఒకదాని వెనుక మరొక బాణాన్ని ప్రయోగిస్తూ కళ్ళు మూసి తెరిచేలోగా అన్ని కుందేళ్ళ చేతుల్లోని బాణాలన్నీ ముక్కలుముక్కలుగా చేసేసింది.


దేనికీ ఎటువంటి చిన్నగాయం కూడా తగలలేదు.


రాజు ఆమె వీరవిన్యాసాలను కళ్ళు పెద్దవి చేసుకొని ఆశ్చర్యంతో చూడసాగాడు.


కథల్లో వినడమూ, చదవడమే తప్ప...


నిజంగా అటువంటి విన్యాసాలను వాళ్ళు ఎప్పుడూ చూడలేదు.


ఒక్కసారిగా ఆ ఆటను చూస్తున్న కుందేళ్ళన్నీ ఆశ్చర్యంతో, ఆనందంతో పైకి లేచి సభాస్థలమంతా మారుమ్రోగిపోయేటట్లు చప్పట్లు కొడుతూ అభినందించసాగారు.


కుందేలు వీరులందరూ సిగ్గుతో తలవంచుకున్నారు.


అప్పుడు కుందేళ్ళ మహారాజు పైకి లేచి ''శభాష్‌... మానవకన్యా శభాష్‌. మా వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళకు ఎటువంటి ఆపదా కలగకుండా ఓడించిన తీరు అద్భుతం, అమోఘం, అనితరసాధ్యం. ఇంతవరకు ఇంత వేగంగా బాణాలు ప్రయోగించగల నేర్పరులను మా రాజ్యంలో మేమెప్పుడూ చూడలేదు''


అంటుండగానే...


ఒక్కసారిగా...


ఆటస్థలంలో...


పెద్ద ఎత్తున కుందేళ్ళ హాహాకారాలు వినబడ్డాయి.


ఎక్కడినుంచి వచ్చిందో ఒక ఏనుగంత పెద్ద గద్ద...


సర్రున కిందికి దూసుకొచ్చింది.


దాన్ని చూడగానే భయంతో కుందేళ్ళన్నీ చెల్లాచెదురయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలా ఒక దిక్కు పారిపోతున్నాయి.  ఆ గద్ద తన వాడియైన కాలి గోళ్ళతో ఒక్కసారిగా పది కుందేళ్ళను పట్టుకొని గాల్లోకి ఎగిరింది.


అది చూసిన లాస్య అత్యంత వేగంగా ఆ గద్దవైపు దూసుకొనిపోయింది.


పరుగెడుతూనే బాణాన్ని బైటకు తీసి ఆ గద్దమీదకు ఎక్కు పెట్టింది.


బలమంతా ఉపయోగించి వెనక్కి లాగి దాని కంటిమీదకు గురిచూసి వదిలింది.


కుందేళ్ళను పట్టుకొని గాల్లోకి ఎగురుతూ వున్న ఆ గ్రద్ద కుడికంట్లోకి బాణం సర్రున దూసుకొని పోయింది.


బాధతో అది గట్టిగా అరుస్తా పైనుంచి దభీమని కింద పడింది.


తల తిప్పి బాణం వేసిన దిక్కు చూసింది.


లాస్య చేతిలో విల్లమ్ములు పట్టుకొని కనబడింది.


గట్టిగా భూమి దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ తన లావాటి ముక్కు తెరిచి లాస్యను ముక్కలు చెయ్యడానికి వేగంగా ఎగురుతూ రాసాగింది.


లాస్య అటూ ఇటూ చూసింది.


దూరంగా ఒక బల్లెం కనబడింది.


దానివైపు పరుగెత్తసాగింది.


లాస్య పారిపోతుందనుకున్న గద్ద మరింత వేగంగా రెక్కలను వూపుతూ రాసాగింది.


పరుగెత్తుకుంటూ బల్లెం దగ్గరకు చేరుకున్న యువరాణి దానిని అందుకొని ఒక్కసారిగా వెనక్కు తిరిగింది.


నోరు తెరచుకొని భయంకరంగా అరుస్తూ దగ్గరికొచ్చిన ఆ రాక్షస గద్ద నోట్లోకి అలాగే ఆ బల్లాన్ని బలంగా దించేసింది.


అంతే...


అది నోరుతెరిచి గిలగిలా కొట్టుకుంటూ అక్కడే కిందపడి ప్రాణాలు వదిలింది.


రాక్షసగద్ద చనిపోయిన మరుక్షణం కుందేళ్ళ ఆనందానికి అవధులు లేవు.


''జయహో... మానవకన్యా... జయహో'' అంటూ ఆకాశం దద్దరిల్లేటట్లు అరవసాగాయి.


కొన్ని కుందేళ్ళు వురుక్కుంటూ వచ్చి లాస్యను తమ భుజాలపైకి ఎత్తుకొన్నాయి.


అన్నీ ఆనందంతో చిందులు త్కొసాగాయి.


నిమిషాల్లో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.


కుందేళ్ళరాజు సింహాసనం దిగి పరుగుపరుగున లాస్య దగ్గరకు చేరుకున్నాడు.


''ఓ... వీరనారీ... ఈ రాకాసిగద్ద పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. వూహించని విధంగా దాడి చేసి దొరికిన కుందేళ్ళను దొరికినట్టు పట్టుకొని ఎగిరిపోయి చంపి తింటూ వుంది.


ఒంటరిగా లోయలో తిరగాలంటేనే అందరికీ భయం. దీనిని చంపడానికి ఎంత ప్రయత్నించినా ఎవరి వల్లా కాలేదు. దీనివల్ల రాజ్యంలో ఎన్ని కుందేళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నాయో లెక్కేలేదు. మేము నిన్ను చంపడానికి ప్రయత్నించినా అదేమీ మనసులో పెట్టుకోకుండా మమ్ములను కాపాడావు. మా నుంచి నీకు ఎటువంటి సహాయం కావాలో చెప్పు. ఏం చేయమన్నా చేస్తాం! మా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాం. నువ్వు చేసిన సహాయం అంత విలువైంది'' అన్నాడు సంబరంగా.


లాస్య చిరునవ్వు నవ్వి ''కుందేలు మహారాజా.. నువ్వు ఈ లోయకు ఎలా మహారాజువో, అలాగే నా తండ్రి లోయ బైట ఒక పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి. నేను ఆయన ఒక్కగానొక్క కూతురిని. యువరాణిని. నేను స్త్రీని కాబట్టి నన్ను తక్కువ అంచనా వేసి రాజ్యం నాకు దక్కకుండా కుట్రలు పన్నుతున్నాడు మా చిన్నాన్న కుమారుడు. కాబట్టి నేను వెంటనే ఈ లోయలోంచి బైటపడాలి. దానికేమైనా మార్గముంటే చెప్పండి'' అంది.


అప్పుడు కుందేలురాజు లాస్యను దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ''చూడు సోదరీ... ఈ లోయలో ఒక అద్భుతమైన కొలను వుంది.


అందులో నీళ్ళు తెల్లగా పాలలా నురగలు కక్కుతా గోరువెచ్చగా వుంటాయి.


దానిని మేమంతా పాలకొలను అని పిలుచుకుంటాం.


ఎలాంటి దెబ్బలు తగిలినా అందులో మునిగితే మాయమవుతాయి.


అలసటంతా పోయి ఉత్సాహం వురకలు వేస్తుంది.


ఆ ప్రదేశానికి ప్రతి పున్నమికి అర్ధరాత్రి దేవలోకం నుంచి ఒక తెల్లని చూడముచ్చటైన రెక్కలగుర్రం వస్తుంది.


ఆ సమయంలో మా రాజ్యంలో ఎవరూ అటువైపు పోరు.


అది మా ఆచారం.


రెక్కలగుర్రం తనివితీరా స్నానం చేసి మరలా పైకెగిరి పోతుంది.


నీవు దాన్ని గనుక పట్టుకోగలిగితే ఈలోయలోంచి బైటపడొచ్చు.


ఈ రోజే పున్నమి.


నీ అదృష్టాన్ని పరీక్షించుకో.


కానీ ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా దాని పైనుంచి పడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటావు జాగ్రత్త'' అంటూ హెచ్చరించాడు.


ఆ రోజు రాత్రి కుందేలు రాజు విందుభోజనం ఏర్పాటు చేశాడు.


దగ్గరుండి కొసరి కొసరి వడ్డించాడు.


రాత్రి కాగానే తానే స్వయంగా రథంపై తీసుకువచ్చి కొలనుకు కొంచెం దూరంగా ఆపి ''సోదరీ... మా రాజ్యపు కట్టుబాట్లను రాజునైన నేను గూడా అతిక్రమించగూడదు. అదిగో కనబడుతుందే ఆ తోటలోనే పాలకొలను వుంది. నీ ప్రయత్నం ఫలవంతం కావాలని, నీకు విజయం సిద్ధించాలని కోరుకుంటున్నాను'' అంటూ సాగనంపాడు.


లాస్య నెమ్మదిగా చిన్న చప్పుడుగూడా కాకుండా పిల్లిలా అడుగులు వేస్తూ తోటలోకి అడుగుపెట్టింది.


ఆ తోటలో అద్భుతమైన కొలను కళ్ళను కట్టిపడేస్తూవుంది.


ఆ తెల్లని పాలకొలనులో ఎర్రని తామరలు మిలమిలా మెరుస్తున్నాయి.


కొలనులోని హంసలు ఆ తెలుపు రంగులో కలసిపోయి దాగుడుమూతలు ఆడుతున్నాయి.


ఇంకా సమయం పన్నెండు కాలేదు.


చిన్న చిన్న కీటకాల అరుపులు తప్ప ఏ చప్పుడూ లేదు.


ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కొని ఆ రెక్కలగుర్రం కోసం ఎదురుచూడసాగింది.


సరిగ్గా పన్నెండు గంటలకు


ఆకాశం నుంచి


ఒక తెల్లని వెలుగు


కొలనులోకి ప్రసరించసాగింది.


ఒక పెద్ద రెక్కలగుర్రం, విశాలమైన రెక్కలను సాచి, ఆకాశం నుంచి రివ్వున కిందికి ఎగురుతూ వచ్చి, కొలను పక్కన ఒడ్డు మీద వాలింది.


చుట్టూ ఒకసారి పరికించి చూసింది.


ఎవరూ లేరు.


ప్రశాంతంగా వుంది.


నెమ్మదిగా నీళ్ళలోకి దిగి హాయిగా ఈదసాగింది.


అలా అరగంటసేపు ఆ పాలకొలనులో ఈదులాడి మరలా ఒడ్డుకు చేరింది.


ఒళ్ళంతా నీళ్ళు కారుతూ వున్నాయి.


వెన్నెలలో శరీరాన్ని కాసేపు ఆరబెట్టుకుంది.


ఇక తిరిగి దేవలోకానికి పోవడం కోసం తన రెక్కలను ఒక్కసారిగా పూర్తిగా విప్పింది.


అది ఒకసారి వెళ్ళిపోతే మరలా ముప్పయిరోజుల వరకూ తిరిగిరాదు. అంతవరకు ఆ లోయలోనే వుండిపోవలసిందే.


బండచాటు నుంచి ఇదంతా చూస్తున్న లాస్య ఇక ఏమాత్రం ఆలస్యం చేయగూడదని భావించి ఒక్కసారిగా పైకి లేచింది.


ఆ అలికిడికి తల తిప్పి చూసిన రెక్కలగుర్రం అదిరిపడింది.


కీడు శంకించి ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకుంటూ గాల్లోకి ఎగిరింది.


లాస్య వేటాడే చిరుతపులిలా...


ఎక్కుపెట్టిన బాణంలా...


రెక్కలగుర్రం వైపు దూసుకొనిపోయింది.


ఒక్కసారిగా రెండుకాళ్ళను నేలకు అదిమిపట్టి సర్రున గాల్లోకి ఎగిరింది.


అప్పటికే ఎగిరిపోతున్న రెక్కలగుర్రం తోక లాస్య చేతికి చిక్కింది.


వెంటనే దానిని రెండుచేతులతో గట్టిగా పట్టుకొంది.


లాస్యను కింద పడవేయడానికి రెక్కలగుర్రం పైకీ కిందికీ అడ్డదిడ్డంగా గిర్రున తిరగసాగింది.


వెనుకకాళ్ళతో ఎగిరెగిరి తన్నసాగింది.


లాస్య శరీరం గాల్లో అటూ యిటూ వూగిపోతోంది.


ఐనా చేతులు కొంచెం గూడా పట్టు సడలడం లేదు.


''ఓ రెక్కల గుర్రమా... దయచేసి నామాట విను. నిన్ను పట్టుకోవాలనే కోరిక గానీ, లొంగదీసుకొని నీమీద ఎక్కి విహరించాలనే ఆశగానీ నాకు లేవు.


కేవలం ఈ లోయలోంచి బైటపడడానికే ఇలా చేశా.


ఇది తప్పని తెలుసు.


కానీ నాకు ఇంకో మార్గం లేదు. అర్థం చేసుకో'' అంటూ వినయంగా వేడుకొంది.


ఆమె మాటల్లోని నిజాయితీ గుర్రానికి అర్థమైంది.


శాంతించి నెమ్మదిగా, ప్రశాంతంగా ప్రయాణించసాగింది.


లాస్య దాని తోక పట్టుకొని నెమ్మదిగా పైకి చేరి గుర్రమ్మీద సంతోషంగా కూర్చుంది.


కానీ ఆ లోయబైట ఇంకో ఆపద వాళ్ళ కోసం ఎదురుచూస్తోందని ఆ రెక్కలగుర్రానికి గానీ, దాని మీద కూర్చున్న లాస్యకు గానీ అప్పుడు తెలీదు.

*******************

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212.

******************

 *రేపు చివరి భాగం -*


కామెంట్‌లు