అడవిలో ఎన్నికలు :- రక్షిత సుమ

జంతువులని అనవసరంగా చంపి తినేస్తున్న సింహాన్ని ఒక బుల్లి కుందేలు తెలివితో చంపేస్తుంది కదా..! ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ అడవికి రాజుని ఎన్నుకోవాల్సిన అవసరం వస్తుంది.ఏంచేద్దామబ్బా అని అందరూ ఆలోచించసాగారు.


అప్పుడు ఒక ముసలి కోతి " నేను మొన్న ఊర్లోకి వెళ్ళినపుడు చూసాను, మనుషులు వాళ్ళ పాలకుల్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు పెట్టుకున్నారు.మనం కూడా అలాగే చేద్దాం "అని చెప్పింది.


ఎన్నికలా? అంటే ఏంటి? " అని అడిగింది కుందేలు.


"అవునవును,నేను కూడా విన్నాను. ఎన్నికలంటే మనని సరిగ్గా పరిపాలించగలిగిన నేర్పు ఉన్న వ్యక్తిని, మనమే ఎన్నుకోవడం" చెప్పింది నెమలి.


అన్ని జంతువులు ఒప్పుకోవడంతో, వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికలు పెట్టుకుందాం అనుకున్నాయి.


అభ్యర్థులు గా సింహం, జింక,మొసలి,నక్క నిల్చున్నారు.
వాటికి మద్దతు ఇచ్చేవాళ్ళు కొంతమంది వాటితో సరిపోల్చడానికి ఒప్పుకున్నారు. అభ్యర్థులు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలను  విడుదల చేశారు.


తను గెలిస్తే జంతువులని వేటాడటం నిషేధిస్తామని. నిజానికి మాంసాహార  జంతులన్నిటిని అడవినుంచి బహిష్కరిస్తామని చెప్పింది జింక.


ఎన్నో ఏళ్లుగా నీటిలో ఉండే జంతువులని తక్కువ చేసి చూస్తున్నారు.వాటికి సమానమైన హక్కులు ఇవ్వట్లేదు.పైగా వేరే జంతువులన్నీ నీటిని కలుషితం చేస్తున్నాయి కాబట్టి,నీటిలో ఉండే జంతువులకి అన్ని విషయాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తానని, రిజర్వేషన్లను కల్పిస్తానని చెప్పింది మొసలి.


తరతరలుగా ఈ అడవికి రాజులుగా మేము ఉంటున్నాం.మీకు ఏం కావాలో,ఏం చెయ్యాలో మాకే బాగా తెలుసు.కాబట్టి నన్నే గెలిపించండి అని కోరింది సింహం.


ఇక వీళ్ళంతా మోసగాళ్ళు, ఎప్పుడూ చెప్పిన మాట మీద నిలబడరు.అవన్నీ వట్టి మాటలే.నేను గనక మీ రాజైతే, మీరు ఏం కోరినా చేస్తా అని చెప్పుకో సాగింది నక్క.


 ఎవరు మెరుగా అని జంతువులన్నీ ఎవరిని ఎన్నుకోవాలో తెలియక సందిగ్ధం లో పడ్డాయి. చాపకింద నీరులా నక్క కొన్ని జంతువులకి ఏవేవో ఆశపెట్టి దానివైపుకి తిప్పుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయడం మొదలేసింది. కొన్ని జంతువులు వాటి వాటి జాతులను ఎన్నికోవాలనుకుంటున్నాయి.అడవిలో ఎక్కడ చూసినా కాబోయే రాజు గురించే చర్చ.జంతువులు జట్లు జట్లుగా విడిపోవడం మొదలైంది.కొన్నిసార్లు గొడవలు కూడా జరగసాగాయి.


ఎన్నికలకి ముందు రోజు సాయంత్రం జంతువులన్నీ సమావేశమైనాయి. ఆ గుంపులో ఉన్నట్టుండి గెలవబోయే వాళ్ళు ఎవరు అన్నదానిపై చర్చ మొదలై మెల్లగా అది గోడవలా మారింది. ఇదంతా గమనిస్తున్న పులి ఒక్కసారిగా లేచి గట్టిగా గాండ్రించింది.అంతే, చుట్టూ నిశ్శబ్దం ఆవరించింది.


"చూడండి! కొద్ది రోజులుగా ఈ అడవిలో జరిగే వాటిని నేనూ గమనిస్తున్నా.ప్రతిదానికీ గొడవలు పడడం కాదు,  ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.తర్వాత మీ ఇష్టం" అని పక్కనే ఉన్న బండ రాయి మీదికి ఎక్కింది.


జంతువులన్నీ ఆ రాయి చుట్టూ చేరి పులి ఏం చెప్పబోతున్నదా అని ఎదురు చూడసాగాయి.


"మన అడవిలో మొట్టమొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి.ఎప్పుడూ లేనిది ఈసారి మన రాజుని మనమే ఎన్నుకోబోతున్నాం.రాజు అంటే మన అందర్నీ చక్కగా చూస్కొగల్గిన వారు, అంతే కానీ మన జాతి అనో,వేరే జంతువుల కంటే మనల్ని ఎక్కువ చేసి చూస్తదనో,ఈ పూటకి ఏదో ఇచ్చిందనో,భయపెట్టారనో,బహుమతులు ఇచ్చారనో కాదు.వాళ్ళ వల్ల మనకీ మన అడవికి నిజంగా ఏదైనా మంచి జరగాలి.మన అడవి,మన బతుకులు అభివృద్ధి చెందాలి.అంతే కానీ మన మధ్య గొడవలతో  విడిపోవడం,కొట్టుకోవడం కాదు.మనం ఐకమత్యంగా ఉండి,నిజాయితీగా మన రాజుని ఎన్నుకున్నప్పుడే మన అడవికి, మనకీ, మన  ముందు తరాలకి మంచి జరిగేది.
ఇంకోటి....ఈ ఎన్నికలు గొడవలూ ఇవంతా మనకెందుకని  కొంతమంది అనుకుంటున్నారనీ నేను విన్నాను..ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు vote వేయకపోతే తర్వాత అడవిలో అది బాలేదు ఇది బాలేదు అని విమర్శిండానికి,అది కావాలి ఇది కావాలి అని అడగడానికి అర్హత పోగొట్టుకున్నట్టే. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనండి,ఆలోచించి ఓటు వేయండి.
మన మధ్యే ఐకమత్యం లేకపోతే,మొన్నటిలాగే బయటనుంచి ఎవరో వచ్చి పాలిస్తున్నామన్న పేరుతో అలాగే చంపుకుతింటారు.ఆలోచించుకోండి!" అని చెప్పి తన గుహలోకి వెళ్ళిపోయింది పులి.


ఎన్నికల రోజు రానేవచ్చింది.జంతువులన్ని తమకు ఇష్టమైన అభ్యర్థి పేరును వారికి ఇచ్చిన ఆకు మీద రాసి చెట్టు తొర్రలో వెయ్యాలి.ఒక్కొక్కటిగా జంతువులన్నీ ఓటు వేశాయి.
ఓట్లను లెక్కపెట్టడం మొదలుపెట్టారు.అందరూ తమ రాజు ఎవరో తెలుసుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నయి.


" ఎప్పటికైనా అడవికి రాజంటే సింహమే, కచ్చితంగా గెలిచేది నేనే!" చెప్పింది సింహం.


" ఆ ఆలోచన ఇవాల్టితో మారిపోతుందిలే ! మీ జాతి వల్ల మాకు వచ్చిన ఇబ్బందులు ఇక పోతాయి." అని మెల్లగా చెప్పింది జింక.


" అవునవును....ఇలా అనుకుంటూనే ఉండండి.ఫలితాలు వచ్చాక మీకే తెలుస్తుంది."అనుకుంటూ వచ్చింది మొసలి.


"మీ వట్టి మాటలు ఇకనైనా ఆపండి.ఎన్ని అబద్దాలో..ఎన్ని మోసాలో... చి ఛీ... మిమ్మల్ని నమ్మి ఎవ్వరూ ఓటు వేసి ఉండరు.నాకంటే గొప్ప రాజు వీళ్ళకి ఎక్కడైనా దొరుకుతారా?! అంటూ గొప్పలు చెప్పుకోసాగింది నక్క.


కోతి గట్టిగా డోలు వాయించసాగింది.ఫలితాలను ప్రకటించడానికి ఎలుగు బంటి వచ్చింది."ఇందుమూలముగా జంతువులందరికీ  తెలియజేయు నది ఏమనగా..ఈ ఎన్నికలలో అత్యధిక ఓట్లతో గెలిచి,మన రాజు కాబోతున్నది ఎవరంటే........'పులి'." అని ప్రకటించింది.


జంతువులన్నీ హర్షం వ్యక్తంచేశాయి.పులి మాత్రం ఆశ్చర్యంతో " నేను అస్సలు పోటీ చేయలేదు కదా,నాకు రాజు అవ్వాలన్న కొరికకూడ లేదు.మరి నన్నెందుకు గెలిపించారు"అని అడిగింది.


మీరే అన్నారు కదా, ఈ అడవికీ,మాకు,మా ముందు తరాలకి మంచి భవిష్యత్తుని కల్పించగలిగే వారే మన రాజవ్వాలని. అది మీరే అని మాకు అనిపించింది.అందుకే మిమల్ని ఎంచుకున్నాము. వీళ్ళని నమ్ముకుంటే ఇక మా బతుకులు తెల్లారినట్టే.!ఒకరేమో మాది రాజుల వంశం కాబట్టి ఓటు వెయ్యమంటారు,ఒకరేమో వాళ్ళదీ మనదీ వేరే జాతి కాబట్టి వాళ్ళకి ఓటు వెయ్యొద్దు అంటారు,వీళ్ళంతా మోసగాళ్లు నేనే మొనగాడిని అందుకే నన్ను గెలిపించాలని ఇంకొకరంటారు.అందరూ వాళ్ళ గురించి,వాళ్ళ జాతి గురించి, వాళ్ళ మంచి గురించి ఆలోచించకున్నరే తప్ప మన అడవి గురించి కాదు.వాళ్ళు ఎన్ని రకాల జంతువులైన సరే,ఎన్ని జాతులైన సరే, అంతా కలిసి ఉండేది అడవిలోనే ఐనప్పుడు అందరి మంచి కోసం ఆలోచించుకోవాలి కదా.అది వాళ్ళలో కనిపించలేదు,నీలో కనిపించింది.అందుకే నిన్ను ఎంచుకున్నాం" అని జంతువులన్నీ చెప్పాయి.


దానికి సింహం,జింక,మొసలి,నక్క కూడా " అవును మిత్రమా! మేము మాకోసం మాత్రమే ఆలోచించాము , మావల్ల అడవిలో గొడవలు జరిగాయి.మీరే గనక మంచి చెడులగురించి చెప్పకపోయిఉంటే మావల్ల జంతువులు విడిపోయేవి.ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి మా తప్పు మేము తెలుసుకున్నాము.ఇకనుంచి స్వార్థం తో కాక,అందరి మంచి కోసం పని చేస్తాం.మమ్మల్ని క్షమించండి."అని కోరాయి.


అప్పటినుంచి ఆ అడవిలో, పులి రాజు సారథ్యంలో జంతువులన్నీ ఐకమత్యంగా కలిసి మెలిసి  జీవించసాగాయి.