స్ఫూర్తి: - ఎం. బిందు మాధవి


 వాసుదేవ మూర్తి గారు గవర్నమెంట్ డాక్టర్ గా 40 సం లు పని చేసి పదవీ విరమణ చేశారు.


చాలా నిజాయితీ గల మనిషి. తన వృత్తిపట్ల నిబద్ధత కలిగిన వారు.


సర్వీస్ నించి రిటైర్ అయినా, శరీరం -ఆరోగ్యం సహకరించినంత కాలం కొనసాగించగలిగిన వృత్తి లో ఉన్నారు కనుక ఆ ఊళ్ళో ఉన్న కొన్ని స్వచ్చంద సంస్థల్లో ఉచిత వైద్య సేవ చేస్తున్నారు.


ఆయన హస్త వాసి మంచిదని పేరు పడిన వారు కావటం వల్ల ఎప్పుడు ఇసకేస్తే రాలనంత మంది జనం, ఆయన ఇంటి దగ్గర కూడా ఉంటారు.


ప్రభుత్వ సర్వీస్. పెన్షన్ కూడా వస్తుంది కనుక ఏదో నామ మాత్రపు ఫీజ్ తీసుకుని నాణ్యమైన వైద్యం చేసేవారు.


ఇలా ఉద్యోగానంతర సేవ చేయగలుగుతున్నందుకు ఆయన ఎంతో సంతృప్తిగా భావిస్తారు.


వాసుదేవ మూర్తిగారు ఆ ఊళ్ళో ఉన్న ఒక "కుష్టు వ్యాధి పునరావాస కేంద్రం" లో కూడా తన సేవలు అందిస్తున్నారు. ఆ కేంద్రం వీరింటికి దాదాపు 15 కి.మీ లు ఉంటుంది. ఆయన 75 సం. ల వయసులో కూడా తనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ రోజూ ఉదయం 11 గం. ల తరువాత ఆ కేంద్రానికి వెళతారు.


అక్కడి రోగులు కూడా ఆయన్ని తమ స్వంత మనిషి లాగా భావిస్తారు. అందువల్లనే ఎంత ఇబ్బంది వచ్చినా, కొంత సేపైనా అక్కడికి వెళ్ళి రోగుల సమస్యలు ఓపికగా విని, వైద్యం చేసి వస్తారు.


ఒక రోజు వారింటికి పొరుగూరు నించి వారి దూరపు బంధువు విమల వచ్చింది. ఆవిడ కి కూడా ఇలాంటి సేవలు, కార్యక్రమాల పట్ల ఆసక్తి, గౌరవం ఎక్కువ.


అది గమనించి, ఆయన విమలతో "మిమ్మల్ని ఒక ఆసక్తికరమైన ప్రదేశానికి తెసుకెళతానని", ఈ కుష్టు వ్యాధి పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళారు.


వాసుదేవ మూర్తి గారికి ఆ కేంద్రం లో వారిచ్చే గౌరవం, అక్కడి వారి పట్ల ఈయనకి ఉన్న అక్కర చూసి విమల ఆశ్చర్య పోయింది. ఆ కేంద్రం గురించి వివరించమని అక్కడ ఉండే వ్యక్తికి ఆయన పురమాయించారు.


అతను ఎంతో వినయంగా, ఆ కేంద్రానికి స్థలం ఉచితంగా ఒక పెద్ద పారిశ్రామిక వేత్త ఇచ్చారని, ప్రతి రోగికి "ఒక గది - వంట గది"చొప్పున 10-15 మందికి అక్కడే ఉండి వండుకు తినే ఏర్పాటు తో బిల్డింగులు కట్టారని చెప్పాడు. అలా వండుకోలేని వారికి కామన్ కిచెన్ లో తిని పడుకునేటందుకు మాత్రం ఒక గది ఇచ్చేట్లుగా ఒక 10-15 మందికి ఏర్పాటు ఉన్నదని చెప్పాడు.


అంటే మొత్తం 30 మంది కుష్టు రోగులు అక్కడే ఉండే పద్ధతి లోనూ, రోగ తీవ్రత అంత ఎక్కువ లేక, బయటి నించి వచ్చి పోయేటందుకు ఇంకో 30 మంది రోగులకి ఏర్పాటు ఉన్నదని చెప్పాడు.


ఈ కేంద్రం లో భవనాలు కట్టగా మిగిలిన స్థలంలో వారి పాలు -పెరుగు అవసరాలు తీరటానికి ఆవులు పెంచుతారని, వారికి కావలసిన కూరగాయలు బయటి నించి కొనే అవసరం లేకుండా వారే పండించుకుంటారని, చెప్పాడు.


అంతేనా, ఒక సారి ఆకేంద్రంలో చేరాక ఇంక వారు బయటికి వెళ్ళి యాచక వృత్తి చేపట్టరని కూడా చెప్పాడు.


ఇలా విమల, ఆ కేంద్రం లోని వ్యక్తి మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్దాయన వచ్చాడు. ఈ మొదటి వ్యక్తి ఆ పెద్దాయన్ని పరిచయం చేస్తూ, "అమ్మగారు 'ఈయన ఈ వ్యాధి రాక ముందు ఒక ప్రభుగ్వ ఉద్యోగం చేసే వాడని, ఈ వ్యాధి కారణంగా ఉద్యోగం వదిలి రావలసి వచ్చిందని, తదనంతరం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్ కూడా పొందుతున్నాడని' చెప్పాడు.


అక్కడ సంభాషణ ఆపి, 'పెద్దాయనా ఇంక నువ్వు చెప్పు ' అన్నాడు.


ఆ పెద్దాయన మొహమాటపడుతూ, 'అమ్మా నాకు నెలకి 100 రూపాయలు పెన్షన్ వస్తుంది. నా అవసరాలన్నీ ఈ కేంద్రం వాళ్ళే చూసుకుంటారు. ఇంక నాకు డబ్బుతో పనేం ఉన్నది, అందుకని ఆ డబ్బు 10,000 రూపాయలు పోగు చేసి ఇక్కడ ఒక గది కట్టటానికి విరాళం ఇచ్చానమ్మా' అని తల వంచుకుని చెప్పాడు.


అది విని విమల అవాక్కయి, ఒక నిముషం ఏమీ మాట్లాడలేకపోయింది. చేతి నిండా పుష్కలంగా డబ్బుండి, ఎంతయినా దానం చెయ్యగలిగిన స్థితిలో ఉండి కూడా మనబోటి వాళ్ళు 10,000 రూపాయలు దానం చేసి "పదివేల" సార్లు చెప్పుకుంటాము. ఇతను తన స్థోమతు -తాహతు తో సంబంధం లేకుండా (తనకి కుటుంబం, పిల్లలు ఉండి కూడా) సాటి మనిషికి సాయం చెయ్యాలనే ఒకే ఒక భావనతో ఎంత బాధ్యత గా ఔన్నత్యం తో దానం చేశాడో కదా అని కళ్ళు చెమరుస్తూ ఉండగా అప్పటికప్పుడు తన చేతిలో ఉన్న "వెయ్యి" రూపాయలు అన్నదానానికి ఇచ్చి, తన ఊరికి వెళ్ళాక తనుకూడా ఒక గది- వంట గది క్వార్టర్ కి తన వంతు సాయం చెయ్యాలని నిర్ణయించుకుంది.


మనసులో సమాజ సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం ఉన్నా, ఏం చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియక అస్పష్టతో ఉండే నా బోటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు మంచి "స్ఫూర్తి ప్రదాతలు" అని తేలిక పడిన మనసుతో సంతృప్తిగా విమల తన ఊరికి వెళ్ళింది.