ఆయనే ఉంటే మంగలెందుకు!
పూర్వం రోజుల్లో భర్త చనిపోయిన ఆడవారికి జుట్టు తీయించేసేవారు. అలా తీయించిన తరువాత, జుట్టు పెరిగినప్పుడల్లా..నెలకో, రెణ్ణెల్లకో మంగలిని పిలిచి మళ్ళీ తీయిస్తూ ఉండేవారు. అలాంటి అవసరానికి మంగలిని పిలుచుకురావటానికి ఇంటినించి ఎవరో ఒకరు వెళ్ళవలసి వచ్చేది. ఇంట్లో మరెవరూ లేనప్పుడు, యధాలాపంగా "మంగలిని పిలుచుకు రావటానికి మీ ఆయన్ని పంపకపోయావా" అని ఎవరైనా అంటే, ఆ సందర్భంలో వాడే సామెత ఇది.
******
కమల, విమల, రాజీ ఇంకా ఆ కాలనీ లో ఉండే మిగిలిన ఆడవాళ్ళు రోజూ ఉదయం ఇంటి పక్కన ఉండే పార్క్ కి వాకింగ్ కి వెళతారు.
అలాగే ఆరోజు కూడా ‘ఉదయం వాకింగ్’ కాక – ‘వేసవి కాలం వచ్చింది, కాస్త చల్ల గాలి పీల్చుకోవచ్చని’ కమల సాయంత్రం కూడా వాకింగ్ కి వెళ్ళింది. నాలుగు రౌండ్లు కొట్టేటప్పటికి, అక్కడ బెంచ్ మీద కూర్చున్న ఒకాయన ఎవరితోనో గట్టిగా అరుస్తున్నాడు. ఏమిటా అని తల తిప్పి చూసేటప్పటికి, ఒక ‘మధ్య వయస్కుడు’ పిల్లలు ఎక్కి ఊగటానికి ఏర్పాటు చేసిన ‘ఉయ్యాల’ ఎక్కి మంచి జోరుగా ఊగుతున్నాడు.
ఆ అరిచే ఆయన ఆ కాలనీ సంక్షేమ సమితి సభ్యుడు.
కమల పూర్తి విషయం తెలుసుకుందామని ఆయన దగ్గరకి వెళ్ళి కూర్చుంది. తనకి తోడుగా ఇంకొక వ్యక్తి వచ్చేటప్పటికి ఆయనకి హుషారు వచ్చి చెప్పటం మొదలు పెట్టాడు.
‘ఈ పార్క్ అదివరకు ‘రాలిన ఆకులు’, ‘కాయితాలు’, తిని పడేసిన ‘పేపర్ ప్లేట్స్’, ఏళ్ళ తరబడి కుటుంబాలతో కాపురం ఉంటున్న ‘కుక్క’లతో చాలా అశుభ్రంగా, అసహ్యంగా ఉండేది. మేము పూనుకుని మ్యునిసిపాలిటీ వాళ్ళతో మాట్లాడి అన్ని విధాలా అభివృద్ధి చేశాము. పిల్లలకి ఊగటానికి ‘ఉయ్యాలలు’, ‘రంగుల రాట్నాలు’, ‘దండాలు - బస్కీ లకోసం ఇతర ఏర్పాట్లు చేశాము. పార్క్ అంటే కాలనీలో అందరికీ ఆహ్లాదంగా ఉండాలని, నడిచే వారికి సౌకర్యంగా ఉండాలని అహర్నిశలు కష్టపడి ఈ స్థితి తెచ్చామండీ. ఆ స్పృహ అందరికీ ఉండాలి కదండీ, పిల్లలు ఊగే ఉయ్యాల పెద్దలు ఊగితే విరిగిపోదా, ఆ మాత్రం బుద్ధి ఉండద్దండీ ఆ పెద్ద మనిషికి’ అని ఆవేశంగా చెప్పాడు.
‘మొన్నటికి మొన్న ఒక కుటుంబం ‘పిల్లా జెల్ల’తో వచ్చి గడ్డిలో కూర్చుని పిల్లల్ని ఆడించి, వాళ్ళ ‘బగ్గీ’ లతో సహా ఇక్కడ తిప్పి, ఆ తరువాత వాళ్ళకి తినటానికి అవీ ఇవీపెట్టి, ఆ తిన్న ‘బిస్కెట్ ప్యాకెట్ల రేపర్లు’, చుట్టు పక్కలంతా పోసి వెళ్ళ బోతుంటే చూసి నేను గట్టిగా అరిచి అవన్నీ తీయించాల్సి వచ్చింది. అవన్నీ తియ్యమన్నానని, నా మీదికి తగువుకి వచ్చారండీ, ఏం చేస్తాం చెప్పండి, స్పందించే మనసు ఉండే నాలాంటి వారికి కష్టమేనండీ’ అన్నాడు.
‘ఒక్కళ్ళం అనుకుంటే సరి పోదండీ, అందరికీ ఆ ఙ్ఞానం ఉండాలి, ఇదంతా నా ఒక్కడి కోసమా, కాలనీ లో అందరికీ ఉపయోగపడాలనే కదండీ నా తాపత్రయం’ అని ఊపిరి తీసుకున్నాడు.
‘ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త గా ఉంటే నా బోటి వాళ్ళు చేసే పనులు రాణింపుకి వస్తాయి’ అన్నాడు.
"ఆయనే ఉంటే మంగలెందుకు" అని ‘ఆబుద్ధే ఉంటే మీకీ కంఠ శోష ఎందుకు, తప్పు చేసిన వాళ్ళతో తగాదా ఎందుకు’ అని కమల ఇంటికి వెళ్ళటానికి లేచింది.
సామెత కథ : ఎం. బిందు మాధవి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి