గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది: --ఎం బిందుమాధవి

 "గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించింది"
శ్యామశాస్త్రి గారు ఏభయ్యెకరాల కామందు.
నలుగురు పిల్లలు కలిగిన శ్యామ శాస్త్రి గారు ఉద్యోగాలంటూ పట్నాలకి ఎగబడకుండా, పిత్రార్జితపు ఆస్తిని కనిపెట్టుకుని పల్లెటూళ్ళోనే ఉండిపోయారు.
పిల్లలని దగ్గర ఉన్న టౌన్ లో చదివించారు. శాస్త్రిగారి అబ్బాయి సాగర్- చదువయ్యాక హైదరాబాద్ లో మంచి ఉద్యోగం వచ్చిందని చేరిపోయాడు.
******
సంక్రాంతి పండుగ వేడుక పల్లెటూళ్ళో చూడాలని సాగర్ కుటుంబం తండ్రి దగ్గరకి వచ్చారు.
సాగర్ కొడుకు ఫణి, తాతగారితో కలిసి పొలం చూస్తానని బయలుదేరాడు.
సంక్రాంతి అంటే కొత్త పంట చేతికి వచ్చే రోజులు కనుక, పొలంలో రైతులు పంట కొయ్యటం, కుప్ప వెయ్యటం అంతా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, శాస్త్రి గారు.
ఫణి అగ్రికల్చర్ బియ్యెస్సీ చదువుతున్నాడు.
క్షేత్ర స్థాయిలో వ్యవసాయం చూడటం చాలా ఆసక్తిగా ఉన్నది.
తనకి తెలిసిన పుస్తక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'తాతయ్యా.... పంట కొయ్యటానికి, కుప్పలు వెయ్యటానికి ట్రాక్టర్లు ఉపయోగిస్తే పనులు త్వరగా అవుతాయి. ఖర్చు కూడా తక్కువే అవుతుంది.'
'అలాగే మళ్ళీ దుక్కి దున్నటానికి కూడా ట్రాక్టర్లు ఉపయోగిస్తే, మళ్ళీ అదనులో విత్తనాలు వెయ్యటానికి వీలుగా పొలం తయారుగా ఉంటుంది.'
'కానీ మీరు మనుషుల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారే?' అని అడిగాడు.
'మనకి ఈ దేశంలో మనుషులు, అంటే మానవవనరులు ఎక్కువ. మిగిలిన దేశాలతో పోలిస్తే లేబర్ ఇక్కడ చౌక. అదీ కాక, మన చుట్టూ ఉండే వారికి కూడా ఉపాధి చూపించినట్లవుతుంది. వాళ్ళు కూడా బ్రతకాలి కదా! అంతే కాదు, వ్యవసాయంతో పాటు పాడి పశువులు కూడా ఉంటాయి. వాటి నిర్వహణకి కూడా మనుషులు కావాలి. ఇవన్నీ కలిపి సమగ్రంగా చూసుకోవటానికి వ్యవసాయంలో మనుషుల్ని ఎక్కువగా వాడతాము,' అన్నారు శాస్త్రి గారు.
'తాతయ్యా, పొలంలో ఎరువులు ఎక్కువగా వాడాలి. నాట్లు అయ్యాక ఒకసారి, గింజ పాలు పోసుకున్నాక ఒకసారి, యూరియా వాడాలి. మధ్య మధ్యలో పురుగు మందు పిచికారి చెయ్యాలి. అలాగే అవసరాన్ని బట్టి తరుచుపురుగుమందులు కొడుతూ ఉండాలి. అప్పుడే పంట దిగుబడి బాగుంటుంది.' అన్నాడు ఫణి.
ఇలా మాట్లాడుకుంటూ తాతా-మనవలిద్దరు మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికొచ్చారు.
అన్నం తింటూ ఇందాకటి సంభాషణ కొనసాగిస్తూ, శాస్త్రి గారు
'మన పొలంలో అసలు రసాయన ఎరువులు వాడము. ఇక పురుగు మందుల విషయానికి వస్తే, అసలు వాటి అవసరమే మనకి ఉండదు,' అన్నారు.
భోజనం ముగించి హాల్లో మంచం మీద కాసేపు నడుం వాల్చారు, శాస్త్రి గారు.
********
ఇందాక తాతగారు చెప్పిన విషయాన్ని నెమరువేసుకుంటూ, అదేంటి పురుగు మందు కొట్టకపోతే దోమకాటు, లద్దె పురుగు లాంటి వాటితో సగానికి సగం పంట నష్టపోయినట్లే కదా! అనుకున్నా డు ఫణి.
తాతగారు చెప్పినట్లు అసలు పురుగు మందులే కొట్టకుండా వ్యవసాయం ఎలా చేస్తారు? వీళ్ళది అంతా చాదస్తంగా కనిపించింది, ఫణికి!
ఆ మాటే తండ్రితో అంటూ, 'మేము ఒక ప్రణాళిక ప్రకారం శాస్త్రీయంగా వ్యవసాయం ఎలా చెయ్యాలో మా కోర్స్ లో నేర్చుకుంటున్నాం. నేను చెప్పే ప్రతిదానికీ విరుద్ధంగా చెబుతున్నారు, తాతగారు' అన్నాడు.
కొడుకు అసహనం చూసి, సాగర్ నవ్వుతూ 'తాతగారు అంటే నీకు కనిపించే వ్యక్తి కాదు!'
'ఎప్పుడో బ్రిటీష్ వాళ్ళ కాలంలోనే ఆయన డిగ్రీ పాస్ అయ్యారు.
ఇంగ్లీష్ కాక రెండు మూడు భాషలు అనర్గళంగా మాట్లాడతారు.
చదరంగంలో మంచి నిష్ణాతులు.'
'అప్పట్లో బ్రిటీష్ నాగరికతని వంటపట్టించుకున్న కొన్ని కుటుంబాల్లో టెన్నిస్, బ్రిడ్జ్ ఆటలు కూడా బాగా విస్తారంగా ఆడేవారు. తాతగారు ఆ ఆటల్లో కూడా మంచి అందె వేసిన చెయ్యి.
వ్యవసాయంలో ఆయనకున్న అనుభవమంత లేదు నీ వయసు.'
"గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని", నీకు తాతగారు చేసే వ్యవసాయంలో విశేషాలు నిద్ర లేచాక ఆయన నోటినించే విందువుగానివి ' అంటూ ఉండగా
శాస్త్రి గారు నిద్ర లేచి, ఓ గుక్క కాఫీ తాగి, మనవడిని పిల్చి పక్కన కూర్చోపెట్టుకుని, 'నాన్నా నీకు నేను చేయించే వ్యవసాయం మీద బోలెడు అసంతృప్తిగా ఉన్నదని అర్ధమయింది. మేము పొలాలకి "జీవామృతం", "వర్మి కంపోస్ట్" వాడతాము. ఆవు పేడ, వేప కషాయం, గోమూత్రం వాడతాము.'
'వేసవి కాలంలో ఊరి చెరువులో తీసే పూడికమట్టిని కొంత డబ్బిచ్చి కొని పొలానికి తోల్తాము. అది బాగా సారవంతంగా ఉంటుంది.'
'పొలంలోదే రెండు-మూడు అడుగుల లోతులో ఉన్న మట్టి తీసి నీళ్ళల్లో కలిపి పిచికారీ చేస్తే ఏ దోమలు-పురుగులు ఆశించకుండా పైరు ఏపుగా పెరుగుతుంది. ఇటు దిగుబడీ పెరుగుతుంది. అటు సేంద్రీయ పంటలూ పండుతాయి. మానవాళి ఆరోగ్యం మనకి ముఖ్యం కదా! ' అన్నారు శాస్త్రి గారు.
తాతగారి అనుభవం, ఆంతర్యం అర్ధమయిన ఫణి తృప్తిగా, తన చదువయ్యాక కొంతకాలం తాతగారి దగ్గరుండి ఆరోగ్యకరమైన ప్రాక్టికల్ వ్యవసాయం నేర్చుకోవాలని నిర్ణయించేసుకున్నాడు.