సూరీడా : :- డా.గౌరవరాజు సతీష్ కుమార్

తూరుపు రేడా సూరీడా
వెలుగుల రేడా సూరీడా
పులుగుపాపలూ ఎగిరెను చూడూ
మేలుకో మేలుకో సూరీడా || తూరుపు ||
వెలుగుపోగులు వెలికివచ్చెను
కమలపు కన్నెలు కలకలలాడెను
జీవజాలములు చకచక వెలిగెను
సకలలోకమూ జాగృతి ఆయెను || తూరుపు ||
రమ్యములైన రంగులు అన్నీ
నింగిన విరిసిన సింగిణి వలెనూ
జగమున పూవులు విప్పారినవీ
అందాలను చిందించినవీ || తూరుపు ||
బాలభానుడా లేచిరారా
బాలపాపలను లేపరారా
ఆరోగ్యమును ఇచ్చెడివాడా
ఐశ్వర్యమును ఒసగెడి రేడా || తూరుపు ||