లస్మయ్య సంతోష్ తండ్రి.ఊరంతటికి బడికి వచ్చి తన పిల్లల చదువు గురించి అడిగిపోవడానికి తరచుగా వచ్చే ఏకైక వ్యక్తి.నేను చేరిన కొద్దిరోజులకే వచ్చి తన పరిచయం చేసుకున్నాడు.ఎంతో వినయంగా మరాఠీ యాసలో మాట్లాడే వాడు.ఆయన ఇద్దరు కొడుకులు స్కూల్‌లో చదువుతున్నారు.నేను పోయే సరికి గణేశ్ ఏడవ తరగతి సంతో ఐదవ తరగతిలో ఉన్నారు.గణేశ్ రెగ్యులర్ గా బడికి వచ్చేవాడు.సంతోష్ ఆరవతరగతి దాకా బాగానే వచ్చాడు.ఆరవ తరగతి లోకి వచ్చిన తరువాత రెండు మూడు నెలలకు బాగా ఆబ్సెంట్ అవటం మొదలు పెట్టాడు.ఇటు క్లాస్ టీచర్ నుండి కంప్లెయింట్ వచ్చింది.అటు నేను అతన్ని పిలిపించి అడుగుదా మనుకునే లోపలనే లస్మయ్య నే వచ్చి కొడుకు మీద ఫిర్యాదు చేశాడు.
“ఎంత చెప్పినా వినడం లేదు సారూ.బడికి రోజెగ్గొడతాండు. నేనేంజెయ్యాలె.ఎట్ల నన్న మీరే జెప్పాలె”అని ప్రాధేయ పడ్డాడు.
“సరే.పద పోదాం.ఇంట్ల ఉన్నడా”
అన్నాను.
“ఉన్నడు సారూ”
“అయితే పద నేనడుగుత “ అని ఇంటికి వెళ్లే సరికి అన్నం తింటున్న వాడల్లా కంచం అక్కడే పారేసి పెరట్లోకి వరుగెట్టాడు.
“అరేయ్.సంతోష్ ఆగు నిన్ను కొట్టడానికి రాలేదు,నా మాట విను నిన్నేమన”అనుకుంటూ వాడిని వెంబడించాను.ఇంకా భయంతో పెరడు వెనుక మైదానంలా ఉన్న చెల్కలో దౌడు తీయడం మొదలు పెట్టాడు.నిజం చెప్పాలంటే నేను ఒక పెద్దసారుననీ,న వయసుని కూడా మరచీ ఏమైనా సరే వాణ్ని పట్టుకోవాలని పరుగెత్తాను.అలా చాలా దూరం పరుగు పందెం సాగింది.వాడు లేడి లా పరిగెడుతుంటే
నేను అందుకేలేనని తెలిసింది. ‘శిష్యాదిచ్ఛేత్ పరాజయమ్’అన్నట్లు వెను దిరిగి వచ్చాను.ఆ చేను మా బడి అరుగు మీద నిలబడితే కనిపిస్తుంది.అప్పటికే ఎవరో పిల్లలు చెబితే టీచర్లు పిల్లలు కూడా దూరంగా మమ్మల్ని చూస్తున్నారు.నేను తిరిగి బడికి వస్తూ ఆలోచించాను.అసలు వాడెందుకింత గా బడికి రావడానికి
అయిష్టంగా ఉండి ఉంటాడు.ముందు స్కూల్‌లో టీచర్లనడగాలని అనుకున్నాను.వస్తూనే క్లాస్ టీచరును మిగతా టీచర్లందరినీ అడిగితే సమస్య అర్థమయింది.ఎవరో ఒక టీచరు వాడి అహం దెబ్బ తినే విధంగా మాట్లాడట మో శిక్షంచటమో జరిగిందని. నాకు లస్మయ్య దీనమైన ముఖమే కనిపిం చింది.వాడు నా దగ్గరికి వస్తే చాలు మార్చగలను అనుకున్నాను.ఈ పరుగు పందెంతో వాడింకా బెదిరి పోయుంటా డు.బడికి పోతే దెబ్బలు తప్పవని.ఎలా రప్పించటం అని ఆలోచిస్తుంటే అదే సమయంలో ఎస్.సి.ఎస్.టీ.స్కాలర్ షిప్ లు వచ్చాయి.వాడి పేరు కూడా అందులో ఉంది.చిన్నగా ఆలోచించాను.
ఒక ఆలోచన తట్టగానే శుభాకర్ సార్ ను పిలిచాను.ఆ సారు కొత్తగా వచ్చారు. సింగిల్ గా ఉండటం చేత అదే ఊళ్లో లస్మయ్య ఇంటి పక్కనే రూము తీసుకుని ఉంటున్నాడు.కనుక ఆయనతో డీల్ చేయించడానికి నాకో అవకాశం దొరికింది.సారుతో అన్నాను మీరు వాడికి చెప్పండి.పెద్దవారు నిన్ను ఏమీ అనడు.బడికి వచ్చినా ఫర్వా లేదు రాకపోయిన ఫర్వా లేదు.నీ స్కాలర్ షిప్ డబ్బులు తీసుకొని వచ్చేయి.అక్కడ రిజిస్టర్లో నువు సంతకం పెట్టాలి. లేకపోతే డబ్బులు వాపస్ పోతాయి అని చెప్పమన్నాను.నా ఆలోచన ఫలించింది.వచ్చాడు.దగ్గరికి పిలిచాను.నేను నిన్నేమీ అనను.చదువుకుంటే నువ్వే బాగు పడతావు.లేకపోతే నీ ఇష్టం. రా సంతకం పెట్టు అన్నాను.భయం భయంగా వచ్చాడు.దగ్గరికి రాగానే రెండు చేతులతో దగ్గరికి తీసుకుని గుండెలకు అదుముకున్నా ను. వాడికి భయం పోయింది.అప్పుడు మెల్లగా అడిగాను.నువ్వు బడికి రాకపోయినా ఫర్వా లేదు కాని ఎందుకు రావటం లేదో కారణం చెప్పు చాలు.ఒక వేళ టీచర్లు నిన్నేమైనా అంటున్నారంటే నేను వాళ్లకు చెబుతాను.నువ్వు చదివినా చదవక పోయినా నోట్స్ రాసినా రాయక పోయినా నిన్నేమీ అన వద్దని చెబుతాను.బడికి రా క్లాసుల కూచో పో.”
అనగానే కొట్టక పోతే వస్తా అన్నాడు.ఎవ్వరూ కొట్టరు అని భరోసా ఇచ్చాను.వాడి మింగరే టీచర్లందరకీ చెప్పాను.వాడు చదివినా చదవక పోయినా ఎవ్వరూ ఏమీ అనకండి అని.అంతే ఆ మరుసటి రోజు నుంచి బడికి వచ్చాడు.నేను క్లాసు తీసుకున్నప్పుడు వాడితే పాటలు పద్యాలు పాడించి బాగా ప్రోత్సహించటం చేశాను.బాగా తెలివి గల పిల్లడు.అతి తొందరలో నాకు ప్రియ శిష్యుడయ్యాడు.
అందుకే అలా సాష్టాంగనమస్కారం చేశాడు.ఇప్పుడు నేను వాడికి గుర్తున్నానో లేదో తెలియదు కానీ నేను మాత్రం మరచిపోలేద.శిక్ష కంటే ప్రేమ గొప్పది.నేను ఏ స్కూల్‌లో పని చేసినా పిల్లలు నాకు బాగా దగ్గరయ్యార.అది నా అదృష్టం.(సశేషం)
ఉపాధ్యాయపర్వము-49: - రామ్మోహన్ రావు తుమ్మూరి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి