మూఢ నమ్మకం(సామాజిక బాలకథ)--కందర్ప మూర్తి: 8374540331.

 పేరాపురంలో ఉండే చంద్రయ్య సన్నకారు రైతు.తనకున్న 
రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో
హాయిగా జీవనం సాగిస్తున్నాడు.
      చదువు విలువ తెలిసిన చంద్రయ్య పదేళ్ల కొడుకు శంకర్ , 
ఆరేళ్ల కూతురు వరలక్ష్మిని పక్క ఊరిలో ఉండే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలకు పంపిస్తున్నాడు.తనలా కాకుండా పిల్లల్ని
బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకున్నాడు.
     శంకర్ కి చెల్లంటే ఎంతో ప్రేమ.తినే వస్తువు ఏది ఉన్నా ముందు చెల్లికి పెట్టిన తర్వాతే తను తింటాడు. కంటికి రెప్పలా
చూసుకుంటూంటాడు. వాళ్ల ప్రేమాను రాగాల్ని చూసి మురిసి
పోతూంటారు చంద్రయ్య దంపతులు.
    రోజూ శంకరం చెల్లిని వెంట తీసుకుని ఊరి చెరువు గట్టు
మీదుగా నడుచుకుంటూ పక్క ఊరి  పాఠశాలకు వెల్తూంటాడు.
     ఒకరోజు చెల్లితో కలిసి చెరువు గట్టు వెంబడి పాఠశాలకు
వెల్తున్నాడు.అకస్మాత్తుగా చెరువు గట్టు మీద పిచ్చి కుక్క వరలక్ష్మి వేసుకున్న రంగుల చెంకీ పరికిణీ చూసి కరవడానికి
వెంట పడింది.
     భయంతో వరలక్ష్మి పరుగులు పెట్టింది. పిచ్చి కుక్క చెల్లిని
కరుస్తుందని తలిచి పట్టుకోడానికి శంకరం ప్రయత్నించగా అది
తిరగబడి శంకర్ చేతుల్నీ కాళ్లని కరిచి పారిపోయింది.
    శంకరం ఒళ్లంతా రక్తసిక్తమైంది.వరలక్ష్మి భయంతో అరవడం
మొదలెట్టింది.
       వరలక్ష్మి కేకలు విని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు పరుగున వచ్చారు.శరీరమంతా గాయాలతో రక్తం
కారుతున్న శంకరాన్ని చూసి చంద్రయ్యకు సమాచారం అందించగా కంగారుగా వచ్చి కొడుకు పరిస్థితి గమనించి
హతాసుడయాడు.
       వెంటనే ఊళ్లో ఉన్న గ్రామీణ వైద్యుడి (ఆర్.యం. పి )
దగ్గరకు తీసుకెళ్లేడు. సరైన వైద్య పరిజ్ఞానం లేని ఆ వైద్యుడు
  శంకరం వంటి మీదున్న పిచ్చి కుక్క గాట్లకు డెట్టాల్ తో శుభ్రం
చేసి కట్టుకట్టి యాంటీబయోటిక్ మందులిచ్చాడు.
      ఇంటికి తీసుకు వచ్చిన శంకరానికి రాత్రి విపరీతమైన 
జ్వరం వచ్చి మర్నాటి నుంచి పిచ్చికుక్క కాటుకి రేబీస్ వైరస్
సోకి కుక్క మాదిరి అరుపులు పరుగులు తీస్తూ నీటిని చూసి
భయపడుతు అందర్నీ పరుగులు పెట్టిస్తున్నాడు
    అన్న ప్రవర్తనకి వరలక్ష్మి కలవరపడసాగింది.శంకర్ ఆరోగ్య స్థితి చూసిన చంద్రయ్య గ్రామీణ వైద్యుణ్మి ఇంటికి పిలిచి శంకర్ని
చూపించగా పరిక్షించి ఇదేదో భూత సంబంధ గాలి తగిలిందని
భూత వైద్యుడి చేత  మంత్రించిన  తావీజు చేతికి కడితే నయమౌతుందని సలహా ఇచ్చాడు.
     మూఢ నమ్మకాల పిచ్చి ఉన్న  చంద్రయ్య పక్క గ్రామంలో
ఉండే భూతవైద్యుణ్ణి సంప్రదించి మంత్రించిన తావీజు తెచ్చి
శంకరం చేతికి కట్టేడు.
       రోజు రోజుకీ రేబీస్ వ్యాధి ముదిరి శంకరం ఆరోగ్య పరిస్థితి
విషమించి మంచానికి కట్టి ఉంచారు.అన్నపానీయాలు లేక
కృసించి ప్రాణాలొదిలాడు.
    చంద్రయ్యతో పాటు ఊరంతా విచారంలో ములిగింది.
పండక్కి గ్రామదేవతకి  మొక్కు తీర్చనందు వల్లే ఇలా జరిగిందని
 అనుమానం వెలిబుచ్చారు అమాయక జనం.
        రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే తెలివైన 
విధ్యార్థి శంకరం కుక్క కాటుతో చనిపోయాడని తెలిసి పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు చంద్రయ్య ఊరికి వచ్చారు.
    నిరక్షరాస్యత , మూఢ నమ్మకాల కారణంగా పట్నం తీసుకెళ్లి
సరైన వైద్యుడికి  చూపించి  పిచ్చి కుక్క కాటుకి రేబీస్ ఇంజెక్షన్లు
ఇప్పించక  జాప్యం వల్ల  శంకర్ చనిపోయాడని ఉపాధ్యాయుడు
చెప్పగా తన అజ్ఞానం వల్ల కొడుకును పోగొట్టుకున్నానని బావురు మన్నాడు రైతు చంద్రయ్య.
       ఎంత డబ్బు ఖర్చు చేసైనా కూతురు వరలక్ష్మిని  బాగా చదివించి డాక్టరు చెయ్యాలని నిశ్చయాని కొచ్చాడు చంద్రయ్య.
                  *               *            *              *
             :