దూది పిజం(కవిత)అన్నవరం దేవేందర్ -9440763479

 పసిపిల్లలైనా పండు వృద్ధులైనా
చూపుల స్పర్శల కోసం ఎదురుచూపులు
సందడి సందడి మాటల నవ్వులు
సంగీత రాగ తరంగాలూ కావాలి
ముచ్చట్లు తమతోనే అన్నట్లు కళ్ళలోకి చూపులు
చుట్టూ రంగు రంగుల బొమ్మల చలనాలు
చటుక్కున చిటికెల సైగల సౌందర్యాలు
అప్పుడే ఆ పాల నవ్వులకు మురిపాలు
నెలలు నెలలుగా ఎదిగే పసి బాల్యం
గలగల అలికిడి అగుపడకుంటే అలకలే
పసి గుడ్డు నుంచే అమ్మ వాసన పసిగట్టుట
పెరిగిన కొద్దీ తెలిసికునే పరివారం పద ముద్రలు
ఊగే తొట్టెల కెల్లి చిన్నంగ మంచం మీదికి పడక నుంచి పదిలంగా బోర్లా పడుడొక మార్పు
ఆపైన పాకుతూ అంబాడుడు మరొక ఉద్యమం
మొగ్గ కళ్ళముందే పువ్వులా  విచ్చుకుంటున్న దృశ్యం
మనుమని మనసు శ్వేత కాయితం
 లోకంలోని రూపాలను ముద్రించే కెమెరా
 మాటల పాటలు సింక్ చేసుకునే మెమరీ కార్డ్
 నా, నీ భేదాలు తెలియని తెల్లని మేఘం
పసితనం తెలతెల్లని దూది పింజం
కర స్పర్శలు కనుచూపులే ముద్దు ముద్దు సంబురాలు

కామెంట్‌లు