ఉపదేశం: -సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,--ధర్మపురి. మొబైల్:9908554535.


 పూర్వం ఒక ఆశ్రమంలో సిద్ధానందుడు అను గురువుగారు తన శిష్యులకు  విద్యలు బోధిస్తూ ఉండేవాడు .అతని దగ్గర అనేకమంది శిష్యులతోపాటు కశ్యపుడు అనే వాడు కూడా విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు.

       ఒకసారి  సిద్ధానందుడు తన శిష్యులకు ధర్మ బోధలు చేస్తూ "గురువుగారి దగ్గర ఉన్నది అంతా  శిష్యులకు చెందాలి .అప్పుడే గురువు నిజమైన గురువు అనిపించుకుంటాడు .ఇతరుల సొమ్ము అపహరించడం మహా పాపం .వారి సొమ్ము మనం అనుభవిస్తే అది ఋణపాశం అవుతుంది .ఆ రుణం కొరకు వచ్చే జన్మలో వారు మళ్ళీ జన్మించి రుణ విముక్తి చేయవలసి ఉంటుంది "అని బోధించాడు .రేపు చివరి రోజు కాబట్టి తాను గురువుగా ఉపదేశం  చేస్తానని ,అయితే అందరూ దగ్గరున్న నదిలో స్నానం చేసి మడి పంచెను కట్టు కొని పైన ఉత్తరీయం కప్పుకొని రావాలని ,లేనిచో తాను ఉపదేశం ఇవ్వనని షరతు విధించాడు .అందుకు శిష్యులందరూ అంగీకరించారు.

          మరుసటి రోజు తెల్లవారి అందరు శిష్యుల కన్నా  ముందే కశ్యపుడు నదికి వెళ్లి స్నానం చేస్తున్నాడు. ఇంతలోనే వరద తాకిడి ఎక్కువై ప్రక్కన పెద్ద రాయి పైన  పెట్టుకున్న తన ఉత్తరీయం పంచె కొట్టుకొని పోయింది. కశ్యపుడు తర్వాత ఇది గమనించి గురువుగారి షరతు  గుర్తుకు వచ్చి తనకు ఉపదేశం  బాకీ లేదని చింతిస్తూ ఒడ్డుకు వద్దామని అనుకుంటుండగా, ఒక ఉత్తరీయం పంచె నీటిలో కొట్టుకొని రాసాగింది . దానిని గభాలున అందుకున్న కశ్యపుడు గురువుగారి ధర్మ బోధ గుర్తుకు వచ్చి "అది ఎవరిది "అని అందరిని అడిగాడు .అందరూ తమది కాదంటే తమది కాదన్నారు .చివరకు కశ్యపుడు దేవుడే తనకు ఇది ఇచ్చాడని  సంతోషించి, గురువుగారి ఉపదేశం పైన ఉన్న ఆసక్తితో అది పైన కప్పుకొని ఆశ్రమానికి వెళ్ళాడు.

          గురువుగారు  ఉపదేశం ఇవ్వబోతూ "నేను నిన్న చెప్పిన  మాటలను కొందరు ఆచరింప లేదని తెలుస్తున్నది .అందుకు ఉదాహరణ ఈ కశ్యపుడే . నేను నదిలో స్నానం చేస్తుండగా పైన కప్పుకునే ఉత్తరీయం నాది కొట్టుకొని పోయింది." అది పోయింది కదా" అని నేను బాధపడుతూ ఆశ్రమానికి తిరిగి వచ్చాను .ఈరోజు ఆది కశ్యపుడు కప్పుకొని రావడం గమనించాను. అది నాదే .అది నేను గమనించే మాట్లాడుతున్నాను " అని అన్నాడు.

              అప్పుడు కశ్యపుడు గురువుగారితో " స్వామీ! నా ఉత్తరీయం కూడా నదిలో వరద తాకిడికి కొట్టుకొని పోయింది .ఇది నాకు నీటిలో  దొరికింది .నేను తర్వాత  "ఇది ఎవరిది " అని అందరినీ అడిగాను. అందరూ తమది కాదని అన్నారు . అయినా ఈ ఉత్తరీయం మీదని  నాకు తెలియదు. నా ఉత్తరీయం పోయింది కనుక దీనిని ఉపదేశం పై ఉన్న ఆసక్తితో పైన కప్పుకొని వచ్చాను .అయినా గురువుగారి దగ్గర ఉన్నదంతా శిష్యులకు చెందాలని మీరే  గతంలో సెలవిచ్చారు. అందువల్ల విద్యలతో పాటు ఇది కూడా నాకు మీ నుండి సంక్రమించిందని సంతోషపడుతున్నాను.కావాలని ఇది నేను ఎత్తుకొని రాలేదు కదా "అని అన్నాడు .

               అప్పుడు గురువు ఈ మాటలు విని నవ్వి "గురువుగారి  దగ్గరున్నదంతా అని అంటే కేవలం విద్యలు మాత్రమే నని  అర్థం .వస్తువులు కావు. ఆస్తి కాదు "అని చురక అంటించాడు. అంతేకాదు. కశ్యపుడి స్థానంలో  ఉన్న ఎవరైనా అలాగే చేస్తారని ,అతనికి అందరూ శిష్యులతో పాటు ఉపదేశం ఇచ్చాడు.

                    ..................