అపార్థం: --సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.- మొబైల్: 9908554535.

 రాంప్రసాద్ మాస్టారు అంటే రవికి చాలా గౌరవం. అందుకు కారణం రాంప్రసాద్ మాస్టారు అన్నింటిలో విద్యార్థులకు ఆదర్శంగా ఉండేవాడు. లెక్కలు చక్కగా చెప్పేవాడు .అందుకే రవికి రాంప్రసాద్ మాస్టారు అంటే ప్రాణం. అన్ని విషయాల్లో రాంప్రసాద్ మాస్టారును రవి అనుకరించేవాడు.
           ఒక రోజు రవి రాంప్రసాద్ మాస్టారును కలుద్దామని వారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కనబడిన దృశ్యం చూసి రవి తెల్లబోయాడు .రాం ప్రసాద్ మాస్టారు సిగరెట్ తాగుతూ, తూలుతున్నాడు .ఇతరులతో మత్తుగా మాట్లాడుతున్నాడు .రవిని చూసి కూడా కనీసం మాట్లాడ లేదు సరికదా అసలు పట్టించుకోనే లేదు. దానితో రవికి కోపం వచ్చి విసా విసా ఇంటికి నడిచాడు.
          "మాస్టారు ఎంత నటించాడు. ఇన్ని రోజులు తాను మాస్టారును ఆదర్శంగా తీసుకున్నాడు .ఇలాంటి వారు నేతి బీరకాయ లాంటి వారు .వీరిని నమ్మరాదు. నేను ఇదివరలో నా మిత్రులతో మాస్టారు గురించి ఎంతో గొప్పగా చెప్పానే! "అని తనలో తాను కుమిలిపోయాడు రవి.  ఆ సంఘటన కలిగించిన కలవరం నుండి తేరుకో లేకపోయాడు రవి.
           మరుసటి రోజు రాంప్రసాద్ మాస్టారు యథావిధిగా బడికి వచ్చాడు. ఒక లెక్క చెప్పి రవిని ప్రశ్నించాడు. కానీ రవి జవాబు చెప్పలేదు .మాస్టారు వెంటనే ఆదుర్దాగా "రవీ! నీకు ఏమైంది? ఇవ్వాళ అంత ఎలాగోలా ఉన్నావు. జవాబు చెప్పలేదు ఏంటి నాన్నా"! అని ప్రేమగా అడిగాడు .దానికి రవి "చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు రాదు "అని పెడసరిగా జవాబిచ్చాడు .అప్పుడు మాస్టారు "చూడు రవీ! నీవు తరగతిలో చాలా తెలివైనవాడివి. అలాంటి నువ్వు ఈ చిన్న ప్రశ్నకు జవాబు చెప్పకపోవడం ,నీ ప్రవర్తన మారడం నాకే ఆశ్చర్యం అనిపిస్తోంది "అని అన్నాడు. "ఆశ్చర్యం ఎందుకు సార్ ?మీ ప్రవర్తన మారినప్పుడు నా ప్రవర్తన కూడా మారవచ్చు కదా!" అని అన్నాడు.  "నా ప్రవర్తన మారడం ఏంటి రవీ! నిన్న నేను ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాను కదా" అని అన్నాడు మాస్టారు. "అవును .ఎప్పుడు ఉన్నట్టే బడిలో ఉన్నారు .ఇంటిదగ్గర కాదు "అని అన్నాడు రవి ."ఇంటి దగ్గర ఏమిటి !అసలు నీకు ఏమైందో చెప్పు రవీ" అని అన్నాడు.
           "నేనేం చెప్పాలి మాస్టారు !మీరు ఎంతో మంచివారని భ్రమ పడ్డాను. మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నాను .కానీ నిన్న మీ ఇంటి ముందు మీరు సిగరెట్ తాగుతూ కనబడేసరికి ,నా ఊహ తప్పని తెలుసుకున్నాను" అని అన్నాడు రవి. "ఏమిటీ?నేను సిగరెట్ త్రాగడం ,మద్యం తాగి తూలానా!అసలు నాకు ఆ అలవాట్లే లేవు "అన్నాడు మాస్టారు." మాస్టారూ! నేను ప్రత్యక్షంగా చూచిన తర్వాత కూడా నమ్మవద్దని అంటారా "అని అన్నాడు రవి. అప్పుడు మాస్టారు" నీవు నన్ను ఎప్పుడు చూసావు రవీ"అని ప్రశ్నించాడు. "నిన్న సాయంత్రం 6 గంటలకు" అని బదులిచ్చాడు రవి. "అసలు ఆ  6 గంటలకు నేను ఇంట్లో లేను తెలుసా! పట్నం వెళ్లి రాత్రి పది గంటలకు వచ్చాను. నిన్న బడికి సెలవు రోజు కావడంతో పట్టణానికి పనిమీద వెళ్లాను" అని అన్నాడు మాస్టారు." మాస్టారూ !మీరు ఇంటి ముందు నిలబడి ఉన్నారు .సిగరెట్ తాగుతూ ఏదో వాగుతున్నారు" అని అన్నాడు రవి. " ఓహో! నాకిప్పుడు అర్థమైంది రవి.నీవు  పొరబడ్డావు. నిన్న నీవు చూసింది మా అన్నయ్యను. అతడి పేరు శ్యాంప్రసాద్. అచ్చం నాలాగే ఉంటాడు. మేమిద్దరం కవలలం. అతడు ఎంత చెప్పినా వినకుండా చదువుసంధ్యలు మాని,  దురలవాట్లకు బానిస అయ్యాడు! మా అమ్మ నా దగ్గర ఉంటుంది కనుక బహుశా నేను లేనప్పుడు చూడటానికి వచ్చి ఉంటాడు. అందువల్ల నీవు నేనే అనుకొని పొరబడ్డావు. నీ తప్పు లేదులే "అని అన్నాడు మాస్టారు .రవి ఆతృతతో "ఏమిటీ! మీకు అన్నయ్య ఉన్నాడా! మీలాగే ఉంటాడా! మీరు కవలలా" అని అడిగాడు. " అవును రవీ. నిన్న నీవు చూసినది మా అన్నయ్యనే .అందువల్ల నా గురించి అపార్థం చేసుకున్నావు. కావాలంటే ఎవరినైనా అడుగు" అని అన్నాడు మాస్టారు. అప్పుడు రవి" క్షమించండి మాస్టారు! మీ మీద  ఉన్న అభిమానంతో నేను అపోహ పడ్డాను. ఎంతో తప్పుగా అర్థం చేసుకున్నాను" అని బాధపడ్డాడు. " ఫర్వాలేదు రవీ! ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. ఇక  జవాబు చెబుతావా! లేదా! నా మీద కోపం పోయినట్లేనా" అని అన్నాడు మాస్టారు. రవి సిగ్గుతో తలవంచుకున్నాడు.