ఆట వెలదులు --సంక్రాంతి లక్ష్మి : --- ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు


 నేల సాన్పు జల్లి  నేర్పుగా  తొలిపొద్దు 

నింగిలోని చుక్క నిలిపి చూసి

రంగు రంగులతలు హంగుగా వేయుచు 

ముదిత ముగ్గు బెట్టి మురియు చుండు!


పాత వస్తువులను పారవేసిరిపుడు 

బూజు దులిపి వెల్ల బుడ్డి దెచ్చి 

గోపి రంగు వేసి గోడల కళగాను

కొత్త రూపునిచ్చె కోరి తాము! 


గాదెలన్ని నిండ గర్వమునుప్పొంగ

నిద్ర పోయె రైతు నిజము గాను 

కునికి పాటులేదు కూరిమియడుగును 

మరల పంట కెపుడు మంచి రోజు? 


బంతి పూల రథము భామామణి నడక

చిట్టి చేమంతులు చీర కొంగు 

సీత జడల కుచ్చు సింగార మొలుకుచు 

పారిజాత పూవె పడతి నవ్వు!


పల్లె పడుచు లంత పరిహాస మాడుచు 

అరిసెలెన్నొ  జేయునలుపు లేక 

తీపి వాసనలకు తినగనోరూరును 

కొత్త యల్లుడింట కోరి దిగును!


భోగిమంట లోను భోగమ్ము తేగలు 

రుచిగ నుండు బాల రూపి తాడి 

గాలి పటముతోను గట్టిదారమువేసి 

కోడి పందెములకు కోరి యురుకు!


సంకు రాత్రి శోభ సందడే సందడి 

యుర్వి జనుల కెల్ల యూరటగును 

గెలుపు దక్కవలెను గీటుగా రైతుకు 

పుడమి కోరికదియె పూర్తిగాను!